సల్లంగ సూడు గాంధారి మైసమ్మ తల్లీ….
ఆదివారం గాంధారి మైసమ్మ ఆషాఢ మాస బోనాల జాతర….
జాతరకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్న పోలీసులు
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
మందమర్రి మండలం బొక్కలగుట్ట గ్రామ పంచాయతీ, క్యాతనపల్లి మున్సిపాలిటీ 9వ వార్డు పరిధిలోని జాతీయ రహదారి పక్కన గల గాంధారి మైసమ్మ,సంతాన నాగదేవతలు కొలువై ఉన్నారు.ఈ నెల 20 ఆదివారం రోజున అంగరంగ వైభవంగా జాతర నిర్వహించేందుకు ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. టెంట్లువేసి బారికేడ్లు ఏర్పాటు చేసింది. జంతుబలుల కోసం ప్రత్యేక ప్లాట్‌ఫామ్ నిర్మించింది. జిల్లా నలుమూలలతో పాటు ఆసిఫాబాద్ జిల్లా నుండి కోల్ బెల్ట్ ప్రాంతాల నుండి కార్మిక కుటుంబాలు పెద్ద సంఖ్యలో తరలివచ్చే అవకాశమున్నది.భక్తులు మేకలు, కోళ్లు బలి ఇచ్చి సల్లంగ సూడు గాంధారి మైసమ్మ తల్లీ అని బోనాలతో మొక్కులు చెల్లించుకోనున్నారు. మంచిర్యాల డీసీపీ ఏ భాస్కర్ పర్యవేక్షణలో బెల్లంపల్లి ఏసిపి రవికుమార్,మందమర్రి సిఐ శశిధర్ రెడ్డి, ఆర్కేపి ఎస్ఐ రాజశేఖర్ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహించనున్నారు. జాతీయ రహదారిపై ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.
20 ఏండ్ల క్రితం మైసమ్మ ఆలయం ఏర్పాటు…
మంచిర్యాల నుండి మందమర్రి మీదుగా చంద్రపూర్ వెళ్లే జాతీయ రహదారిపై బొక్కలగుట్ట అటవీ సమీపంలోని పాలవాగు వంతెన వద్ద తరుచూ రోడ్డు ప్రమాదాలు జరిగేవి. అనేక మంది ప్రాణాలు కోల్పోయేవారు. దీంతో బొక్కలగుట్ట, పులిమడుగు గ్రామస్తులు చారిత్రక గాంధారి కోటలోని మైసమ్మ దేవతకు పూజలు చేసి 20 ఏండ్ల క్రితం ప్రతిష్ఠించారు. అనంతరం గుడి నిర్మించి పూజలు చేయడం ప్రారంభించారు.అప్పటి నుండి రోడ్డు ప్రమాదాలు తగ్గిపోయాయి. ఆనాటి నుండి ఆషాఢమాసంలో గాంధారి మైసమ్మ ఆలయానికి వచ్చి బోనాలతో మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో తల్లికి నూటొక్క బోనాలతో జాతర నిర్వహించి మొక్కులు చెల్లించుకోవడం ఆచారంగా వస్తుంది. అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా 20వ తేది ఆదివారం గాంధారి మైసమ్మ బోనాల జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసినట్లు ఆలయ కమిటీ తెలిపింది.
జాతరకు వచ్చే భక్తులు పోలీసులకు సహకరించండి
ఏసిపి రవికుమార్, సిఐ శశిధర్ రెడ్డి, ఎస్ఐ రాజశేఖర్
ఈనెల 20 ఆదివారం రోజున గాంధారి మైసమ్మ బోనాల జాతర జరిగే ప్రదేశం జాతీయ రహదారి కావడంతో మంచిర్యాల,రామకృష్ణాపూర్ నుండి వచ్చే భక్తులు కుర్మపల్లి స్టేజ్ వద్ద నుండి వాహనదారులు ఎట్టి పరిస్థిటీలో రాకూడదని, పులిమడుగు వద్ద నుండి యూ టర్న్ తీసుకుని ఆలయం సమీపంలో ఏర్పాటుచేసిన పార్కింగ్ ప్రదేశంకు చేరుకొని పోలీసులకు సహకరించాలని, ఆలయం వద్ద ఏర్పాటుచేసిన క్యూలైన్లో భక్తులు వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవాలని బెల్లంపల్లి ఏసిపి రవికుమార్, మందమర్రి సిఐ శశిధర్ రెడ్డి, రామకృష్ణాపూర్ ఎస్సై రాజశేఖర్ లు తెలిపారు.