అంజయ్య నగర్ స్మశాన వాటిక అభివృద్ధికి నిధుల మంజూరు
టెండర్ ప్రక్రియను వేగవంతం చేయాలని ఎస్‌ఈని కోరిన ఆంజనేయులు సాగర్
శేరిలింగంపల్లి, నేటి ధాత్రి :-
అంజయ్య నగర్ డివిజన్ పరిధిలోని అంజయ్య నగర్ కాలనీ స్మశాన వాటిక ఆధునీకరణకు అడుగులు పడ్డాయి. గత కొంతకాలంగా ఈ స్మశాన వాటిక పునరుద్ధరణ కోసం స్థానిక నాయకులు, ప్రజలు చేస్తున్న కృషితో ప్రభుత్వం నిధులను మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో పనులను త్వరగా ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని డివిజన్ సీనియర్ నాయకులు ఆంజనేయులు సాగర్ అధికారులను కోరారు.నిధులు మంజూరైన తరుణంలో, తదుపరి టెండర్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని కోరుతూ ఆంజనేయులు సాగర్ శుక్రవారం సంబంధిత సూపరింటెండింగ్ ఇంజనీర్ సక్కుబాయి గారిని కలిసి చర్చించారు. టెండర్లలో జాప్యం లేకుండా పనులను గ్రౌండ్ లెవల్‌లోకి తీసుకురావాలని ఈ సందర్భంగా ఆయన విజ్ఞప్తి చేశారు. దీనిపై ఎస్‌ఈ సానుకూలంగా స్పందిస్తూ, టెండర్ ప్రక్రియను వేగవంతం చేసి వీలైనంత త్వరగా పనులు మొదలుపెడతామని హామీ ఇచ్చారు.ఈ భేటీలో స్మశాన వాటిక అభివృద్ధి పనులతో పాటు డివిజన్ పరిధిలోని వీధి దీపాల సమస్యలను కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఎలక్ట్రికల్ (డీఈ) స్వప్న గారితో మాట్లాడి, గతంలో ఇచ్చిన వినతి పత్రం ఆధారంగా పెండింగ్‌లో ఉన్న వీధి దీపాల ఏర్పాటును వెంటనే పూర్తి చేయాలని కోరారు. చీకటిగా ఉన్న ప్రాంతాల్లో కొత్త దీపాలు ఏర్పాటు చేస్తామని అధికారులు ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.ప్రజల మౌలిక వసతుల కోసం కృషి చేస్తున్న అధికారులకు, ఈ ప్రక్రియలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికీ ఆంజనేయులు సాగర్ కృతజ్ఞతలు తెలిపారు.
