జిల్లా కలెక్టర్ పేరుతో ఫేక్ వాట్సాప్
భూపాలపల్లి నేటిధాత్రి
వాట్సాప్‌లో జిల్లా కలెక్టర్
ఫోటోను ఉపయోగించి డబ్బులు పంపాలని కోరుతూ నకిలీ సందేశాలు పంపిస్తున్న ఘటనలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.
తన ఫోటోను ప్రొఫైల్‌గా పెట్టుకొని కొందరు దుండగులు వివిధ వ్యక్తులకు, అధికారులకు వాట్సాప్ సందేశాలు పంపి డబ్బులు పంపించాలని అడుగుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఇటువంటి సందేశాలకు ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించవద్దని, ఎలాంటి లావాదేవీలు చేయవద్దని ప్రజలకు సూచించారు.
జిల్లా కలెక్టర్ పేరు, ఫోటో లేదా హోదాను ఉపయోగించి వచ్చే సందేశాలు నకిలీవని, తన తరఫున వ్యక్తిగతంగా గానీ, వాట్సాప్ ద్వారా గానీ డబ్బులు అడగబోనని ఆయన స్పష్టం చేశారు.
ఇలాంటి నకిలీ మెసేజీలు అందిన వెంటనే సంబంధిత వాట్సాప్ నంబర్లను బ్లాక్ చేయాలని, సైబర్ క్రైమ్ పోలీసులకు లేదా సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండి మోసాలకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.
