అభివృద్ధి లక్ష్యంగా అందరూ కలిసి పనిచేయాలి…

అభివృద్ధి లక్ష్యంగా అందరూ కలిసి పనిచేయాలి

జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్

మంచిర్యాల,నేటి ధాత్రి:

ప్రజా సంక్షేమం,అభివృద్ధి లక్ష్యంగా అందరూ కలిసి పనిచేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గురువారం జిల్లాలోని చెన్నూర్ మండల కేంద్రంలో గల మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మండల స్థాయి కార్యక్రమానికి జిల్లా పంచాయితీ అధికారి వెంకటేశ్వర్ రావు, మండల తహసిల్దార్ మల్లికార్జున్, మండల పరిషత్ అభివృద్ధి అధికారి మోహన్,మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ మహేష్ ప్రసాద్ తివారి,సి.ఐ. బన్సీలాల్ లతో కలిసి హాజరయ్యారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో అమలు చేస్తూ అర్హులైన లబ్ధిదారులకు పథకాల ఫలాలు అందే విధంగా అందరూ సమన్వయంతో పని చేయాలని తెలిపారు.రైతు సంక్షేమంలో భాగంగా వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా వరి పంట ఉత్పత్తులను కొనుగోలు చేయడం జరుగుతుందని,ఈ క్రమంలో సన్నరకం వడ్లకు బోనస్ అందించడం జరుగుతుందని తెలిపారు.ఇందిరమ్మ ఇండ్ల పథకంలో భాగంగా దాదాపు 3 వేల 500 ఇండ్లు స్లాబ్ స్థాయి వరకు పూర్తయ్యాయని,అర్హత కలిగి ఉండి ఇందిరమ్మ ఇండ్లు రానివారు దరఖాస్తు చేసుకున్నట్లయితే మంజూరు చేసే దిశగా చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకోలేని లబ్ధిదారులకు గుత్తేదారుల ద్వారా నిర్మించే విధంగా చర్యలు తీసుకుంటున్నామని,ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం అందించే ఉచిత ఇసుకను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.కళ్యాణ లక్ష్మీ పథకంలో అర్హులందరికీ నగదు అందించడం జరుగుతుందని తెలిపారు.అర్హులకు పెన్షన్ అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని,జిల్లాలో దాదాపు 9 వేల దరఖాస్తులు అందాయని,ఈ దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అర్హులకు పెన్షన్ అందించడం జరుగుతుందని తెలిపారు.రేషన్ కార్డు రానివారు దరఖాస్తు చేసుకున్నట్లయితే నిబంధనల ప్రకారం మంజూరు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.చెన్నూర్ పట్టణంలో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణ పనులు పూర్తి కాబడి ప్రారంభానికి సిద్ధంగా ఉందని, 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయని తెలిపారు.జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలలో ఈ విద్యా సంవత్సరం 3 శాతం మంది విద్యార్థులు చేరారని,ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల నుండి ప్రభుత్వ పాఠశాలలకు వస్తున్నారని తెలిపారు.అమ్మ ఆదర్శ పాఠశాలల కమిటీ ఆధ్వర్యంలో అన్ని ప్రభుత్వ పాఠశాలలను ఉన్నత స్థాయిలో అభివృద్ధి చేస్తూ విద్యార్థులకు సకల సదుపాయాలతో కూడిన నాణ్యమైన విద్య అందించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు.విద్యార్థులకు శుద్ధమైన త్రాగునీటిని అందించేందుకు ఆర్.ఓ. ప్లాంట్ ఏర్పాటు, కాస్మోటిక్,డైట్ చార్జీలను పెంచి నిర్దిష్టమైన మెనూ అమలు చేయడం ద్వారా విద్యార్థులకు పౌష్టిక ఆహారం అందించడం జరుగుతుందని తెలిపారు.చెన్నూర్ లో అంతర్గత రహదారులు,మురుగు కాలువ వ్యవస్థను అభివృద్ధి చేయడం జరుగుతుందని,మున్సిపల్ వార్డులలో సౌర విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.గ్రామాలలో అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేయాలని,మండల కేంద్రం నుండి ప్రతి గ్రామానికి రహదారులను అనుసంధానించడం ద్వారా ప్రభుత్వ సేవలను మరింత విస్తరించడం జరుగుతుందని తెలిపారు.డి.ఎం.ఎఫ్.టి., సిఎస్ఆర్ ఇతర నిధుల ద్వారా పనులు చేపట్టడం జరుగుతుందని,బిల్లులు పెండింగ్ ఉన్నట్లయితే వివరాలు సమర్పిస్తే చెల్లించే దిశగా ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.గ్రామాలకు, మున్సిపాలిటీలకు మంజూరు చేయబడిన నిధులను ప్రణాళిక ప్రకారంగా ఖర్చు చేయాలని, అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేసే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు.ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మహిళల సంక్షేమం,ఆర్థిక అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని, ఇందులో భాగంగా సోలార్ పవర్ ప్లాంట్,మందమర్రిలో పెట్రోల్ బంక్ నిర్వహణకు స్వయం సహాయక సంఘాల సభ్యులకు అవకాశం కల్పించడం జరిగిందని తెలిపారు.ఈ క్రమంలో చెన్నూర్ పట్టణంలో అనువైన ప్రాంతంలో పెట్రోల్ బంక్ ఏర్పాటుకు స్వయం సహాయక సంఘాలను ప్రోత్సహించడం జరుగుతుందని, నిబంధనల ప్రకారం ప్రతిపాదనలు సమర్పించినట్లయితే మంజూరుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.వివిధ వ్యాపార రంగాలలో మహిళలు అభివృద్ధి చెందేందుకు అవసరమైన శిక్షణ అందించి మహిళలు ఆర్థిక స్వావలంబన పొందేలా తోడ్పాటు అందించడం జరుగుతుందని తెలిపారు.స్వయం సహాయక సంఘాల సభ్యులు తాము పొందిన రుణాలను సకాలంలో తిరిగి చెల్లించి మరింత రుణం పొందవచ్చని తెలిపారు.సంక్షేమ, అభివృద్ధి పథకాల అమలులో ఏమైనా సమస్యలు తలెత్తినట్లయితే తమ దృష్టికి తీసుకురావాలని,సంబంధిత శాఖల సమన్వయంతో పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.ప్రజాస్వామ్యంలో ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వం చేపట్టిన పథకాలను క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు అధికారుల సమన్వయంతో చర్యలు తీసుకుంటామని తెలిపారు.

రహదారి భద్రత నిబంధనలపై ప్రతిజ్ఞ

అనంతరం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన అరైవ్ అలైవ్ కార్యక్రమానికి సి.ఐ. బన్సీలాల్ తో కలిసి హాజరై రహదారి భద్రత నిబంధనలపై అందరితో ప్రతిజ్ఞ చేయించారు.ద్విచక్ర వాహనదారులు హెల్మెట్,కార్ లో ప్రయాణించేవారు తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాలని,రహదారి భద్రతా నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని తెలిపారు.

నీటి ట్యాంకుల నిర్మాణ పనులను వేగవంతం చేయాలి

చెన్నూర్ పట్టణంలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను సందర్శించి ప్రారంభానికి సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.పట్టణంలోని గెర్రె కాలనీ,మార్కెట్ యార్డు ప్రాంతాలలో అమృత్ 2.0 పథకంలో భాగంగా చేపట్టిన నీటి ట్యాంకుల నిర్మాణ పనులను పరిశీలించి పనులు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో సంబంధిత శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version