గుట్టుచప్పుడు కాకుండా చెరువు ఆక్రమణ ?
*ప్రభుత్వ ఆస్తుల రక్షణ పట్టని అధికారులు..
పలమనేరు నేటి ధాత్రి
పలమనేరు నియోజకవర్గ పరిధిలోని పెద్దపంజాణి మండలం రాయలపేట సమీపం,గంకొండ రెవెన్యూ గ్రామం తురకవాని కుంట చెరువు సర్వేనెం 18-2 నందు 7ఎకరాల 50 సెంట్ల ప్రక్కనే ఉన్న ఓ అక్రమార్కుడు రాత్రికి రాత్రే చెరువు భూమిని అర్థానికి పైగా ఆక్రమించడమే కాకుండా భారీవాహనాలను ఉపయోగించి బండలను సైతం చెరువులోకి తోసి పూడ్చివేశారు.
కోట్లాది రూపాయల విలువైన భూములపై అక్రమార్కుల కన్ను
ప్రస్తుతం నియోజకవర్గ పరిధిలోని భూముల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.పైగా అధికారపార్టీ పెద్దలతో బాటు అధికారుల ఆశీస్సులు కూడా మెండుగా ఉండడంతో ప్రభుత్వ భూములు కనిపిస్తేచాలు ఇలా ఆక్రమించి తమ ఆధీనంలో పెట్టుబడులు, వాటికి నకిలీ రికార్డులు సృష్టించి,ఏమీ తెలియని అమాయకులకు లక్షలాది రూపాయలు తీసుకుని కట్టబెట్టే ప్రయత్నం చేయడం జరుగుతోంది..
రెవెన్యూ,ఇరిగేషన్ అధికారుల మొద్దునిద్ర
ప్రభుత్వ భూములు,చెరువు భూములు ఇలా అన్యాక్రాంతం అవుతున్నా సంబంధిత రెవెన్యూ,ఇరిగేషన్ అధికారులు మొద్దునిద్ర వహిస్తున్నట్లు స్థానికులు ఆరోపించారు.ఇంతజరుగుతున్నా ఈ అక్రమణలపై నోరు విప్పిన అధికారులపట్ల పలు అనుమానాలు కలుగుతున్నట్లు పలువురు గుసగుసలు ఆడుతున్నారు.ఇప్పటికైనా ఇటువంటి ఆక్రమణలపై ఉక్కుపాదం మోపి,కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.