విస్తృత ప్రజా భాగస్వామ్యంతోనే సమర్థ విపత్తు నిర్వహణ
ఎన్డీఎంఏ జాయింట్ అడ్వైజర్ నావల్ ప్రకాష్
కలెక్టర్ డాక్టర్ సత్య శారదతో కలసి జిల్లా విపత్తును ఎదుర్కొనే చర్యలపై అధికారులతో సమీక్షించిన ఎన్డీఎంఏ అధికారుల బృందం
వరంగల్ జిల్లా ప్రతినిధి నేటిధాత్రి:*
విస్తృత ప్రజా భాగస్వామ్యంతోనే సమర్థ విపత్తు నిర్వహణ సాధ్యమని జాతీయ విపత్తు నిర్వహణ ప్రాధికార సంస్థ(ఎన్డీఎంఏ) సీనియర్ అధికారుల బృందం పేర్కొంది. ఎన్డీఎంఏ జాయింట్ అడ్వైజర్ నావల్ ప్రకాష్ , అండర్ సెక్రటరీ అభిషేక్ బిశ్వాస్, సీనియర్ కన్సల్టెంట్లు వసీం ఇక్బాల్, డాక్టర్ గౌతమ్ కృష్ణా, సంద్రా, అనుపమా, గురువారం వరంగల్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధ్యక్షతన జరిగిన సమావేశంలో పాల్గొని జిల్లా విపత్తు నిర్వహణ ప్రణాళిక నవీకరణ, డిజాస్టర్ ఎమర్జెన్సీ ఆపరేషన్ సెంటర్ కార్యకలాపాలు, విపత్తు ముప్పు తగ్గింపుతో పాటు భవిష్యత్తు విపత్తులను ఎదుర్కొనే వ్యవస్థ పటిష్టత తదితర అంశాలపై సమీక్షించి, సమన్వయ శాఖల అధికారులతో చర్చించారు.మాక్ డ్రిల్స్ నిర్వహణ సామర్థ్య నిర్మాణంపై అధికారులకు శిక్షణ, సమన్వయం వంటి అంశాల్లో జిల్లాలో చర్యలపై కూడా చర్చించారు. వరదల సమయంలో బాధితులకు చేయూతనివ్వడం, పునర్మిర్మాణ చర్యల్లో అధికార యంత్రాంగం చూపిన చొరవను కూడా బృందం సభ్యులు ప్రశంసించారు.ఎలాంటి విపత్తునైనా ఎదుర్కొనే సరైన సన్నద్ధత విషయంలో ప్రతి శాఖా తమదైన ప్రత్యేక విపత్తు నిర్వహణ ప్రణాళికలను రూపొందించడం కీలకమని చెప్పారు. చట్ట ప్రకారం కొత్తగా పట్టణ విపత్తు నిర్వహణ అథారిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరముందన్నారు. ప్రకృతి వైపరీత్యాలపై రియల్టైమ్ హెచ్చరికల వ్యవస్థలో సచేత్ కీలక మైలురాయి అని, ఈ యాప్ పై అధికారులతో పాటు ప్రజలకు ముఖ్యంగా గ్రామస్తులలో అవగాహన కల్పించాలని సూచించారు. విపత్తు నిర్వహణ ప్రణాళికలో ఏఐ, డ్రోన్ టెక్నాలజీ వంటి సాంకేతికతలను పొందుపరచడంపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. ఆపద మిత్ర, ఇతర వలంటీర్ సేవలకు ముఖ్యంగా యువతను ప్రోత్సహించాలని ఎన్డీఎంఏ అధికారుల బృంద సభ్యులు పేర్కొన్నారు. జాతీయ, రాష్ట్ర మరియు జిల్లా స్థాయిలో విపత్తు నిర్వహణ ప్రణాళికలతో పాటు జాతీయ విపత్తు ప్రతిస్పందన నిధి మరియు జాతీయ విపత్తు తగ్గించే నిధిని కూడా అందిస్తుందని తెలిపారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ
జిల్లాలో ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు వాటిని సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు,
జిల్లా విపత్తు నిర్వహణ ప్రణాళిక రూపొందించడం జరిగిందని,
విపత్తుల సమయంలో చేపట్టే .
చర్యలు, సహాయక చర్యలు, పునరావాస కార్యక్రమాలపై వివరించారు. అన్ని శాఖలు సమన్వయంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకొంటున్నట్లు తెలిపారు. గత సంవత్సరం వరదల వల్ల ఆకేరు వాగు నీటి వరద వల్ల 40 మంది ప్రయాణికులతో ఉన్న బస్సు నీటిలో దిగ్బంధం కాగా స్థానికుల సహకారంతో ఎలాంటి ప్రాణనష్టం జరగకుండా బయటికి రావడం జరిగిందన్నారు. గోదావరి కృష్ణ నదుల మధ్యలో వరంగల్ జిల్లా ఎత్తైన ప్రదేశంలో ఉన్నందున వరద ముప్పులేదని, అధిక వర్షాలు కురవడం వల్ల వరద సంభవించే అవకాశం ఉందని, అందుకు నగరంలోని ప్రధాన నాలాలను డీసిల్టేషన్ చేయడం జరిగిందన్నారు. గతంలో రాజులు నిర్మించిన గొలుసు చెట్టు చెరువులలో వర్షపు నీరు చేరుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నగరం ముంపు గురి కాకుండా స్ట్రామ్ వాటర్ డ్రైన్స్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. శిథిలావస్థలో ఉన్న నిర్మాణాలపై ప్రత్యేక దృష్టి సారించి వాటిని తొలగించడం జరుగుతున్నదని అన్నారు. వర్షపు నీరు చేరుకొనుటకు గాను చెరువులలో పూడికలు తీయడం జరిగిందన్నారు. ఇటీవల భూకంపం సంభవించినప్పుడు జిల్లాలో రిచేట్ స్కేల్ పై 3.5 నమోదైందని, ప్రభుత్వం ద్వారా జిల్లాలో నిర్మిస్తున్న 10 వేల ఇందిరమ్మ గృహాలకు భూకంపం వల్ల నష్టం వాటిల్లకుండా సాంకేతికత అమలుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేసి 24 గంటలు సహాయం చేయడం జరుగుతుందన్నారు. జిల్లా యంత్రాంగం ద్వారా ఆపద మిత్ర కింద 179 వాలంటీర్లను శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు.
ఈసారి జిల్లాలో ముందస్తుగా జూన్ నుంచి వర్షాలు కురుస్తున్నందున అధికంగా వర్షాలు పడే అవకాశం ఉందని, విపత్తులు రాకముందే ముందస్తు చర్యలలో భాగంగా జిల్లాస్థాయిలో అన్ని మండలాలు, గ్రామస్థాయిలో కమిటీలను తహసీల్దార్ అధ్యక్షతన ఏర్పాటు చేశామని, అదనపు కలెక్టర్‌ను విపత్తుల జిల్లా నోడల్ అధికారిగా నియమించినట్లు తెలిపారు. వరద ముంపు ప్రాంతాల్లోని గ్రా మాలపై ప్రత్యేక దృష్టి సారించామని. శిథిలావస్థలో ఉన్న గృహాలను, పాఠశాలలను ముందస్తుగానే గుర్తించి అవరమైతే వారిని ఇతర ప్రాంతాలకు తరలిస్తామని కలెక్టర్ అన్నారు.
భారీ వర్షాలు కురిసినప్పుడు గ్రామాల్లో టామ్ టామ్ ల ద్వారా విస్తృత ప్రచారం కల్పించి ప్రజలను అప్రమత్తం చేయడం జరుగుతుందన్నారు. పీహెచ్సీలలో తగినంత ఔషధాలు అందుబాటులో ఉంచినట్లు, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తగు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రోడ్ల భవనాల శాఖ ద్వారా బ్రిడ్జిలు, కల్వర్ట్ లు ఇరువైపులా బ్యారికేడ్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
జిడబ్ల్యుఎంసి కమిషనర్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ
బల్దియా ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ద్వారా నగరంలో విపత్తును తక్షణమే ఎదుర్కొనేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. 27 మంది, సిబ్బంది వాహనాలు బోట్లు రోప్స్ తదితర అన్ని ఎక్విప్మెంట్తో సిద్ధంగా ఉన్నామన్నారు. గ్రేటర్ వరంగల్లో 170 చెరువులు ఉన్నాయని, 5 ప్రధాన నాలాలను డిసిల్టేషన్ చేయడం జరిగిందని, ప్రభుత్వ నిధులచే నాలాలను అభివృద్ధి, బలోపేతం చేయడం వల్ల నగరంలో ముంపు తగ్గిందన్నారు. తక్షణ సహాయార్ధం డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ల ఆధ్వర్యంలో రెస్పాన్స్ టీమ్లను చేయడం జరిగిందన్నారు. నగరంలో శిథిలావస్థలో ఉన్న గృహాలను గుర్తించి, నోటీసులు అందించి, గృహాలను తొలగించడం జరుగుతుందన్నారు. 2023లో వరదలు సంభవించినప్పుడు 2200 మందిని పునరావాస కేంద్రాలకు తరలించి వారికి ఉచితంగా భోజనం, దుప్పట్లు ఇతర సదుపాయాలు కల్పించడం జరిగిందన్నారు.అగ్నిమాపక, పంచాయతీ, వైద్య ఆరోగ్య, పశుసంవర్ధక శాఖ, పోలీస్, వ్యవసాయ శాఖల ద్వారా వరదలు సంభవించినప్పుడు చేపట్టే చర్యలపై ఆయా శాఖల అధికారులు వివరించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డి ఆర్ ఓ విజయలక్ష్మి, జెడ్పి సీఈఓ రామిరెడ్డి, సంబంధిత శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.