సర్పంచ్ ఎన్నికలపై బకాయిల ఎఫెక్ట్..! పోటీ చేసేందుకు ఆసక్తి చూపని నేతలు
జహీరాబాద్ నేటి ధాత్రి:
సర్పంచ్ ఎన్నికల నిర్వహణకు ఎలక్షన్ కమిషన్ ఏర్పాట్లు వేగవంతం చేసింది. ఈ నెల 31వ తేదీ నుంచి మూడు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అంతకు ముందే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్స్ జరగనున్నాయి. ఈ నేపథ్యంలో గ్రామాల్లో రాజకీయం వేడెక్కింది. అయితే గత (BRS) బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దయనీయ పరిస్థితులను గమనించిన నాయకులు.. ఇప్పుడు సర్పంచ్గా పోటీ చేసేందుకు వెనకడుగు వేస్తున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి రంగంలోకి దిగేందుకు నిరాసక్తత చూపిస్తున్నారు.
అప్పుల భారంతో..
సరిపడా నిధులు విడుదల చేయకుండానే.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి పేరిట గ్రామాల్లో అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. వైకుంఠధామాలు, క్రీడా ప్రాంగణాలు, పార్కులు, రోడ్లు, మొక్కల పెంపకం, ట్రాక్టర్ల కొనుగోలు వంటి పనులు చేపట్టింది. పనులు చేయకుంటే సస్పెండ్ చేస్తామని బెదిరించడంతో.. అప్పటి సర్పంచులు అప్పులు చేసి మరి పనులు చేపట్టారు. ఆ తర్వాత బిల్లులు కోసం ఏండ్ల తరబడి ఎదురుచూశారు. బిల్లులు రాక విసిగి వేసారిపోయారు. అప్పులు తీర్చలేక, తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో కొందరు సర్పంచులు ఆత్మహత్యలు సైతం చేసుకున్నారు.
బుజ్జగిస్తున్న పార్టీలు
సర్పంచ్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు కాగా, చాలా చోట్ల బరిలో దిగేందుకు నాయకులు వెనకడుగు వేస్తున్నట్లు చర్చ జరుగుతున్నది. తాము ఎన్నికల్లో ఖర్చు చేయడం, ఆ
తర్వాత అభివృద్ధి పనులకు నిధులు వెచ్చించి, అవి విడుదల కాకుండా ఏండ్ల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగడం తమ వల్ల కాదని తెగేసి చెబుతున్నారు. అయితే ఎన్నికల్లో
పోటీ చేయాలంటే పార్టీనే మొత్తం ఖర్చు పెట్టుకోవాలంటూ.షరతు విధిస్తున్నట్లు తెలిసింది. రిజర్వేషన్లు ఖరారైన తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఓ నియోజకవర్గంలో ముఖ్య
నాయకులకు ఈ పరిస్థితి ఎదురైందని చెబుతున్నారు. పోటీ చేయగలిగిన వారిని ముఖ్య నేతలు పిలిపించి మాట్లాడగా.. తాము విధించే షరతులకు ఒప్పుకోవాలని వారు చెప్పినట్లు
తెలిసింది. దీంతో బుజ్జగించి, ఒప్పించి, మెప్పించి పోటీలో ఉండే విధంగా చేసినట్లు సమాచారం. గత అనుభవాలు తమ కండ్ల ముందు కదలాడుతుంటే.. ప్రత్యేకంగా తమకు ఎవరూ చెప్పాల్సిన అవసరం ఉంటుందని గ్రామాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. తమ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రమేనని, ఇంకా ఎన్నికల్లో నిలబడితే అప్పుల పాలు కావడం తప్ప మరొకటి ఉండదని అంటున్నారు. దీంతో
ముఖ్య నాయకులకు ఏం చేయాలో పాలు పోవడంలేదని.సమాచారం. చివరికి విజయావకాశాలు ఎక్కువగా ఉన్న
వారిని బుజ్జగించి, వారికి భరోసా కల్పించి ఎన్నికల్లో నిలబడేలా చేస్తున్నారని సమాచారం.
ఆశావహులకు పండుగల ఎఫెక్ట్
రిజర్వేషన్లు ఖరారు కావడంతో జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఆశావహులపై పండుగల ఎఫెక్ట్ పడుతుందని ఆయా పార్టీల నాయకులు చెబుతున్నారు. తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుపుకునే దసరాకు ఖర్చు భారీగానే ఉంటుంది. ఓటర్లను మచ్చిక చేసుకోవడానికి ఆశావాహులు మటన్, చికెన్, మద్యం బాటిళ్లతో ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు సమాచారం. ఎవరికి తోచిన స్థాయిలో వారు, తమకు నమ్మకమున్న, తనతో పాటు తిరిగే, పార్టీ ముఖ్య నేతలను సంతృప్తి పరిచే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. గ్రామాల్లో ప్రధానంగా అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు చెందిన నేతలు ఖర్చు పెట్టడంలో ముందున్నారనే చర్చ జరుగుతున్నది.