తెలంగాణ రాష్ట్ర ఫోటోగ్రఫీ పోటీల్లో డబుల్ అవార్డు విజేత..
ఫోటోగ్రఫీలో అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన ఇరుకుల్ల వీరేశం
ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:
ఓదెల మండలం జీలకుంట గ్రామానికి చెందిన ఇరుకుల్ల వీరేశం ఫోటోగ్రఫీని హాబీగా ప్రారంభించి స్వంత నైపుణ్యంతో అనేక సుందర ఛాయాచిత్రాలను సృష్టించి వివిధ్ ఫోటోగ్రఫీ పోటీలకు పంపించి ఎన్నో అవార్డులను గెలుచుకున్నాడు. అత్యంత ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ అవార్డులను సైతం కైవసం చేసుకున్నారు.
2022 లో ఎన్ ప్రింట్ ఇంటర్నేషనల్ సర్క్యూట్ (ప్రింట్ అండ్ డిజిటల్) వారు అంతర్జాతీయంగా ఫోటోగ్రఫీ పోటీలు నిర్వహించగా ఇందులో 27 దేశాలు పాల్గొన్నాయి. భారతదేశం తరపున ఈ పోటీలో ఆన్ లైన్ లో పాల్గొన్న ఇరుకుల్ల వీరేశం అంతర్జాతీయ ఫోటోగ్రఫీ పోటీలలో ప్రింట్ కలర్ విభాగంలో 8 అవార్డులను సాధించారు. 2016 సంవత్సరం నుండి ప్రతి ఏటా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఏదో ఒక అవార్డును సాధించారు.
ఫోటోగ్రఫీని ప్రాణంగా భావించే వీరేశం, గిరిజనుల అందాలను చిత్రీకరించడానికి అరకులోయ, ఒడిస్సా, వినాయక నిమజ్జనం దృశ్యాల కోసం మహారాష్ట్ర, హిమాలయాల సౌందర్యం ఒడిసి పట్టడానికి జమ్మూ కాశ్మీర్ లాంటి వైవిద్య భరితమైన ఎన్నో ప్రాంతాలను సొంత డబ్బులు వెచ్చించి అత్యంత వ్యయ ప్రయాసల కోర్చి పర్యటించారు. అక్కడి అందాలను తన కెమెరాల్లో బంధించి ఎన్నో విలువైన ఛాయాచిత్రాలను ఆవిష్కరించారు.
ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ఐ అండ్ పిఆర్ శాఖ నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో ఇరుకుల్ల వీరేశం కు కేటగిరి రాజీవ్ యువ వికాసంలో తృతీయ బహుమతి మరియు కేటగిరి రైతు భరోసా లో కన్సోలేషన్ బహుమతి లభింఛాయి.
రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన పలు సంక్షేమ పథకాల పైన తీసిన ఛాయా చిత్రాలకు గాను పోటీ నిర్వహించగా అందులో రాజీవ్ యువ వికాసం ఫోటోకు తృథియ బహుమతి & రైతు భరోసా ఫోటోలు ఎంపిక చేశారు.
ఈ బహుమతిని మంగళవారం హైదరాబాదులోని గ్రీన్లాండ్స్ గ్రీన్ పార్క్ హోటల్ లో సమాచార మరియు పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, సమాచార, పౌర సంబంధాల కమిషనర్ సిహెచ్ ప్రియాంక, మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా వీరేశం అవార్డు అందుకున్నారు.
గ్రామీణ నేపథ్యం కలిగిన వీరేశం.. సునిశిత దృష్టితో ప్రకృతి అందాలు, గిరిజన జీవితాలు, సంస్కృతి సంప్రదాయాలు పరిశీలించి తన కెమెరాలతో బంధించి చూపర్లను సమ్మోహిత పరుస్తున్నాడు.అతని ప్రతిభకు లభిస్తున్న పురస్కారాల పట్ల ఫోటోగ్రఫీ అభిమానులు మరియు స్థానిక ప్రజా ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు.