పంట వ్యర్థాలను కాల్చొద్దు
వ్యవసాయ మార్కెట్ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి
పరకాల,నేటిధాత్రి
పంట వ్యర్థాలను కాల్చడం వల్ల పర్యావరణంతో పాటు ప్రజల ఆరోగ్యానికి తీవ్ర నష్టం కలుగుతుందని రైతులు అలాంటి చర్యలకు దూరంగా ఉండాలని పరకాల వ్యవసాయ మార్కెట్ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి విజ్ఞప్తి చేశారు.నడికూడ మండలం కంఠాత్మకూర్ గ్రామ సమీపంలో నిన్న జరిగిన రోడ్డు ప్రమాదం బాధాకరమని,పంట వ్యర్థాల దహనం వల్ల ఏర్పడిన పొగ వాహనదారులకు ఇబ్బందులు కలిగించి ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉందన్నారు.పంట వ్యర్థాలను కాల్చడం వల్ల వెలువడే పొగ,విషవాయువులు గాలిలో కలిసిపోవడంతో కాలుష్యం పెరుగుతుందని,ప్రజలు శ్వాసకోశ సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉందని తెలిపారు.అలాగే భూమిలోని ముఖ్యమైన సూక్ష్మ జీవులు,పోషకాలు నశించి భూసారం తగ్గిపోతుందని పేర్కొన్నారు.రైతులు పంట వ్యర్థాలను కాల్చకుండా రోటవేటర్‌తో భూమిలో కలియదున్ని డీకంపోజర్లు చల్లడం ద్వారా సేంద్రియ ఎరువు తయారు చేసుకోవచ్చని సూచించారు. ఈ విధానం ద్వారా ఎకరాకు సుమారు రూ.300 ఖర్చుతో భూమి సారాన్ని పెంచుకోవచ్చని తెలిపారు.
