భారత్ బ్రహ్మోస్ క్షిపణి ట్రంప్‌ను భయపెట్టిందా.!

భారత్ బ్రహ్మోస్ క్షిపణి ట్రంప్‌ను భయపెట్టిందా? ఆపరేషన్ సిందూర్‌లో అమెరికా జోక్యానికి కారణమేంటి..

అమెరికా అధ్యక్షుడు భారత ఉత్పత్తులపై 50 శాతం సుంకాలను విధించారు. అలాగే భారత ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నారు. పాకిస్థాన్‌లో చమురు నిల్వలను అభివృద్ధి చేయడానికి ఉమ్మడి కార్యచరణను ప్రకటించారు. ఏదో ఒకరోజు భారత్‌కు పాకిస్థాన్ ఆయిల్ అమ్ముతుందని ప్రకటించారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇటీవలి కాలంలో భారత్‌పై విద్వేషాన్ని వెళ్లగక్కుతున్నారు. తన ఆదేశాలను ధిక్కరించి రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తోందనే కారణంతో భారత్‌పై సుంకాల దాడికి దిగారు (Trump Tarrifs). భారత ఉత్పత్తులపై 50 శాతం సుంకాలను విధించారు. అలాగే భారత ప్రత్యర్థి పాకిస్థాన్‌తో (Pakistan) ట్రేడ్ డీల్ కుదుర్చుకున్నారు. పాకిస్థాన్‌లో చమురు నిల్వలను అభివృద్ధి చేయడానికి ఉమ్మడి కార్యచరణను ప్రకటించారు. ఏదో ఒకరోజు భారత్‌కు పాకిస్థాన్ ఆయిల్ అమ్ముతుందని ప్రకటించారు.

ఇక, ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) సమయంలో ట్రంప్ జోక్యం గురించి తెలిసిందే. భారత్-పాకిస్థాన్ మధ్య యుద్ధాన్ని ఆపింది తానేనని ట్రంప్ పలుసార్లు ప్రకటించుకున్నారు. అయితే తాజాగా అమెరికాకు చెందిన వాల్‌స్ట్రీట్ జర్నల్ (Wall Street Journal) ఆ ఆసక్తికర కథనాన్ని వెల్లడించింది. భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సిందూర్.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను భయపెట్టిందని ఆ పత్రిక పేర్కొంది. పాకిస్తాన్ వైమానిక స్థావరాలపై భారత్ తన బ్రహ్మోస్ క్షిపణుల (BrahMos missile)ను ప్రయోగిస్తున్నట్టు వచ్చిన వార్తలు ట్రంప్‌నకు కలవరం కలిగించాయట.

ఆపరేషన్ సిందూర్ సమయంలో పాక్‌పై భారత్ ప్రయోగించే బ్రహ్మోస్ క్షిపణులలో అణ్వాయుధాలను నింపే అవకాశం ఉందని అమెరికా నిఘా వర్గాలు నిర్ధారించాయని ఆ పత్రిక పేర్కొంది. దీంతో వైట్‌హౌస్‌లో తీవ్ర ఆందోళన మొదలైందట. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు వేగవంతమైన, ఉన్నత స్థాయి చర్చలు మొదలయ్యాయట. పరిస్థితి చేయి దాటితే పాక్‌పై భారత్ అణు దాడులు చేయాలనుకుంటుందని, అలాగే పాకిస్థాన్ కూడా తన సొంత అణ్వాయుధ పరికరాన్ని ప్రయోగించాలని నిర్ణయించుకోవచ్చని ట్రంప్ భయపడ్డారని ఆ పత్రిక కథనాన్ని ప్రచురించింది.

భారతదేశం, రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ క్షిపణి అణ్వాయుధాలను మోసుకెళ్లగలదని అమెరికా అధికారులు విశ్వసిస్తున్నారని ఆ కథనం పేర్కొంది. అయితే ఆ కథనాన్ని భారత రాయబార కార్యాలయ అధికారులు తోసిపుచ్చినట్టు కూడా ఆ కథనం తెలిపింది. మొదటగా అణుబాంబులను ప్రయోగించకూడదనే నియమాన్ని భారత్ ఉల్లంఘించదని భారత అధికారులు చెప్పినట్టుగా పేర్కొంది. బ్రహ్మోస్ క్షిపణులు కేవలం సాంప్రదాయ ఆయుధ వ్యవస్థలే తప్ప, అణ్వాయుధాలను మోసుకెళ్లలేవని ఎప్పట్నుంచో భారత్ నొక్కి చెబుతోంది.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version