కేజిబివి విద్యాలయాల్లో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి.
ఎంజీఎంలో మౌలిక సదుపాయాల మరమ్మత్తుల పనులను ప్రారంభించాలి
జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద
వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:
వరంగల్ జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులు, ఇంజనీరింగ్ అధికారులతో కలెక్టర్ సమావేశమై పనుల పురోగతిని సమీక్షించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా ఉన్న 10 కేజీబీవీలలో అవసరమగు డార్మటరి,యూరినల్స్ , బాత్రూమ్స్, ఆరో ప్లాంట్స్ పనులు చేపట్టాలని,ఖానాపూర్,దుగ్గొండి, నల్లబెల్లి కేజీబీవీలలో
కొనసాగుతున్న పనులను వేగవంతంగా పూర్తి చేయాలని అన్నారు. రాయపర్తి కేజీబీవీలో డార్మిటరీ విస్తరణ పనులను వెంటనే ప్రారంభించాలన్నారు.మిగిలిన కేజీబీవీ లలో కూడా అభివృద్ధి పనులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.ప్రభుత్వ ఎంజీఎం ఆసుపత్రిలో రోగులకు ఇబ్బందులు కలగకుండా చేపట్టాల్సిన కనీస మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ఏర్పాటు చేసిన కమిటీ పేర్కొన్న విధంగా సీలింగ్ మరమ్మత్తులు, అంతర్గత మరమ్మత్తులు తదితరులు పనులను వెంటనే ప్రారంభించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.ఈ సమావేశంలో జిల్లా పరిషత్ సీఈవో రామిరెడ్డి, ఎంజీఎం పర్యవేక్షకులు కిషోర్, జిల్లా బాలికల అభివృద్ధి అధికారి ఫ్లోరెన్స్,ఇరిగేషన్ అధికారి సునీత, ఆర్ఎంఓ మాగంటి అశ్వినితో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.