మాల్స్‌లో దో నెంబర్‌ మాల్‌!?

-మహిళల వస్త్రాలలో పెద్ద ఎత్తున విషపూరిత రసాయన రంగులు!

-మహిళలకు క్యాన్సర్‌ కారకాలకు దారులు!

-అగ్గువ అని చెప్పి, బట్టలతో పాటు రోగాలు అంటగడుతున్నారు.

-ప్లాస్టిక్‌తో కూడుకున్న బట్టల అమ్మకాలు!

-కాటన్‌ ఖరీదుకన్నా ప్లాస్టిక్‌ చౌకగా కొనుగోలు?

-అతి ప్రమాదకరమైన రసాయనాలు కలిపి బట్టల తయారీ!

-వాటిని చౌకగా తెచ్చి అధిక ధరలకు అమ్ముతున్న మాల్స్‌!?

-మంగళకరమని ప్రకటనలు!

-ఆరోగ్యాలు పాడు చేసే ప్లాస్టిక్‌ దారాలతో తయారైన వస్త్రాలు.

-రంగురంగుల జిగేల్‌ మనిపించేలా రసాయనాలతో బట్టలు!?

-మాల్స్‌లకు పెట్టేది అమ్మవార్ల పేర్లు!

-అమ్మేది అంగడి సరుకుకన్నా అద్వాహ్నం!

-నాసిరకం మెరుగులతో కనికట్టు వ్యాపారం.

-అద్దాల షాపులు చూసి మోసపోకండి.

-రంగు రంగుల వస్త్రాలు చూసి మురిసిపోకండి!

-డిస్కౌంట్ల పేరుతో సాగించే అమ్మకాల ముందు సాగిలపడకండి!

-కిలోల చొప్పున అమ్మకాలంటే ఆశ పడకండి.

-ఏ వ్యాపారి నష్టాలకు అమ్మకాలు చేయరు.

-మాల్స్‌లో తక్కువ ధరలకు అసలే అమ్మరు.

-ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అంటారు.

-రెండిరటీ ధరలు ఒక్క దానిలోనే తీస్తారు.

-ఒరిజినల్‌ పట్టు అని మహిళలను నమ్మిస్తారు!

-తామే ప్రత్యేకంగా ఆర్డర్‌ ఇచ్చి తయారు చేయించామంటారు.

-పెళ్ళి, పేరంటం, పండగలు, గిఫ్టుల పేరు చెబుతారు!

-ఆకర్షణీయమైన వస్త్రాలంటూ నాసి రకం అంటగడతారు.

-జనాలను నిండా ముంచేస్తున్నారు.

-ఏటా వేల కోట్ల రూపాయల వ్యాపారాలు సాగిస్తున్నారు.

-మహిళల బలహీనతను దండిగా సొమ్ము చేసుకుంటున్నారు.

-సంప్రదాయమైన పేర్లు మాల్స్‌కు పెడతారు.

-ప్రజల్ని మోసం చేసి వ్యాపారం సాగిస్తుంటారు.

హైదరాబాద్‌, నేటిధాత్రి:
గోల్‌ మాల్‌, గోల్‌ మాల్‌ గోవిందం..మనకు అంటగట్టే బట్టలన్నీ నాసిరకం. అవును? కాదని ఎవరు చెప్పినా అది అబద్దం. వ్యాపారం చేసే వారు పట్టపగలు చేసే పచ్చి మోసం. ఇప్పుడు మనం చూస్తున్న, బట్టలు కొంటున్న మాల్స్‌లలో ఎక్కువ శాతం దో నెంబర్‌ మాలే ? కాదని వ్యాపారులు అనొచ్చు. చెప్పొచ్చు. మాయ మాటలు చెప్పి మనకు బట్టలు అంటగట్టొచ్చు. అది కూడా వ్యాపారమే..కాని మనకు జాగ్రత వుండాలి. మనం జాగ్రత్తగా నాణ్యమైన బట్టలు కొనుగోలు చేయాలి. కాని మనం రంగురంగుల లైట్లంటేనే ఇష్టపడతాం. పెద్ద పెద్ద షాపింగ్‌ మాల్స్‌లోనే కొనుగోలు చేయడానికి తొందరపడతాం. డబ్బులన్నీ పోగొట్టుకుంటాం. ఒకప్పుడు ఒక్క డ్రెస్‌ కొంటే ఎంత నాణ్యతగా వుండేదో అందరకీ తెలుసు. కాని గతంలో లాగా రెండు మూడు డ్రెస్సులతో ఏడాది గడిపే రోజులు కాదు. నాలుగు చీరలలో సంవత్సరం పూర్తి చేసే రోజులు అసలే కాదు. కట్టుకున్నా,కట్టుకోకపోయినా బీరువా నిండా కొత్త చీరులు వుండాలి. ఒక్కసారి కట్టిన చీర ఎంత ఖరీదైనా రెండోసారి కట్టుకుంటే నామూషీ అనుకునే రోజులు. ఒక ఫంక్షన్‌కు కట్టుకున్న చీరలు, వేసుకున్న డ్రెస్సుల మరో ఫంక్షన్‌లో కట్టుకుంటే ఇబ్బంది. అందుకే కొత్త కొత్త బట్టలు ఎప్పటికప్పుడు కావాలి. కట్టుకున్న రోజు ఆ బట్టలు దగధగ మెరవాలి. ఇదే ఇప్పుడు ట్రెండ్‌. అందుకు తగ్గట్టు ఫ్యాషన్‌. అందుకే మాల్స్‌ మనల్ని మోసం చేస్తున్నాయి. అంగడి సరుకుకన్నా అద్వాహ్నమైన బట్టలు అంటగడుతున్నాయి. అయితే ఇందులో జరిగే మోసం వల్ల ప్రజల ఆరోగ్యాలు కూడా చెడిపోతున్నాయి. ఆనారోగ్యాల పాలు కావల్సి వస్తుందన్న నిజం చాల మంది తెలుసుకోలేకపోతున్నారు. మనం ఎంత ఖరీదు పెట్టి కొన్న బట్టలైనా సరే నాసిరకంగా వుండడమే కాదు, అందులో ప్లాస్లిక్‌ ఎక్కువగా కలుపుతున్నారన్న సంగతి తెలుసుకోలేకపోతున్నాం. దాంతో అద్దాల షాపులు చూసి మురిసిపోతున్నాం. రంగు రంగుల దస్తులు చూసి మోస పోతున్నాం. డిస్కౌంట్ల పేరుతో అమ్మకాలు జరుపుతుంటే అవసరం లేకున్నా కొనుగోలు చేసుకుంటున్నాం. రోజుకోటి కొత్త డ్రెస్‌ వేసుకోవడమే గ్రేట్‌ అనుకుంటున్నాం. అయితే ఇటీవల మార్కెట్‌ను ముంచేస్తున్న దుస్తులన్నీ ఎక్కువగా ప్లాస్టిక్‌ దారాలతో తయారుచేస్తున్నారు. దాంతో ఎంతో మంది మహిళలు అనారోగ్యాల పాలౌతున్నారు. ఒంటి మీద గంటల తరబడి ప్లాస్టిక్‌తోపాటు, విషపూరిత రసాయనాలు కలిపి తయారు చేసిన బట్టలను వేసుకుంటున్నాం. దాంతో శరీరంలో మార్పులు కొని తెచ్చుకుంటున్నాం. మనం వినియోగించే ఆహార పదార్దాలు, ఒంటికి దరించే వస్తువులన్నీ ప్లాస్టిక్‌ మయమైపోతున్నాయి. అయినా గొప్పల కోసం కొనుగోలు చేస్తున్నాం. అనారోగ్యాలు కొని తెచ్చుకుంటున్నాం. మాల్స్‌ విపరీతంగా పెరిగిపోయాయి. ఒకప్పుడు నగరాలలో కూడా అనేక బట్టల షాపులు వుండేవి. ఇప్పుడు వాటన్నింటినీ మాల్స్‌ వచ్చేసి మింగేశాయి. చిన్న చిన్న పట్టణాలకు సైతం పెద్ద పెద్ద మాల్స్‌ వచ్చి చేరాయి. ఐదు నుంచి పది లక్షల జనాభా వున్న పట్టణాలతోపాటు, నగరాలను ఎంపిక చేసుకొని విపరీతంగా ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి వ్యాపారంలోనైనా నష్టాలుంటాయోమో కాని బట్టల వ్యాపారంలో కొనసాగిన మాల్స్‌ మూసేసిన చరిత్ర ఇప్పటి వరకు లేదు. తెలంగాణలో కొత్త జిల్లాలు వచ్చిన తర్వాత రియల్‌ వ్యాపారం, బట్టల వ్యాపారం విపరీతంగా పెరిగిపోయాయి. మన రాష్ట్ర వ్యాపారులే కాదు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్దఎత్తున వ్యాపారులు వస్తున్నారు. మాల్స్‌ ఏర్పాటు చేస్తున్నారు. ప్రజలు కూడా వాటిని బాగా ఎంచుకుంటున్నారు. ఖరీదైన బట్టలను కొనుగోలు చేయడం స్టేటస్‌ సింబల్‌గా మార్చుకుంటున్నారు. దాంతో మాల్స్‌ల సంఖ్య విపరీతంగా పెరిగిపోతూ వస్తుంది. కాని మనం కొనుగోలు చేస్తున్న బట్టల్లో నాణ్యత తెలుసుకుంటున్నామా? గుర్తిస్తున్నామా? ఒకటి రెండు ఉతుకులకే ఎంతో ఖరీదైన బట్టలు కూడా రూపు రేఖలు చెదిరిపోతున్నాయి. వాటి నాణ్యతాలోపం బైట పడుతున్నాయి. వాటిని మళ్లీ మాల్స్‌కు తీసుకెళ్లలేం. మాల్స్‌ యజమానులను నిలదీయలేం. ఎవరో ఒకరు…ఎక్కడో అక్కడ ప్రశ్నించినా మీ ఉతుకులో లోపాలంటారే గాని, మా బట్టల్లో తప్పుందని మాత్రం ఎప్పుడూ ఒప్పుకోరు. వినియోగదారులు అక్కడిదాక ఎప్పుడూ వెళ్లరు. ప్రజల ఆ బలహీనతే మాల్స్‌కు పెట్టుబడిగా మారుతున్నాయి. ఆదాయ మార్గాలుగా మారుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే మాల్స్‌లో మనం చూసే బట్టలన్నీ ముతక బట్టలే. ముక్కిన బట్టలే. ఒక్కసారే లారీల కొద్ది బట్టలు క్వింటాళ్ల కొద్ది కొనుగోలు చేసి, మాల్స్‌కు నాలుగైదు రెట్లు పెద్దవైన గోడౌన్లలో ఏళ్ల తరబడి నిలువ చేసి వాటిని వినియోగదారులకు అంటగడుతుంటారు. కొత్త స్టాక్‌ అని నమ్మించి మోసం చేస్తుంటారు. ఎప్పుడో కొనుగోలు చేసిన బట్టలకు కొత్త కొత్త స్టిక్కర్లు వేసి ప్రజల నిండా ముంచేస్తుంటారు. నాసికరకం బట్టలనే ఎక్కువగా అంటగట్టేస్తుంటారు. వాటిపై వుండే రంగులను చూసి మోసపోతుంటాం. అయినా అలాంటి మాల్స్‌లనే ఎంచుకొని పదే పదే కొనుగోలు చేస్తుంటాం. ఎందుకంటే అవి అద్దాల మేడలు. రంగుల రంగుల ప్రపంచం. రకరాల రంగుల లైట్లన్నీ వేస్తారు. సెంట్రల్‌ ఏసిలతో చల్లబరుస్తారు. ఎంతసేపైనా సరే బట్టలను ఎంచుకునే సమయం ఇస్తారు. మాయ మాటలతో ఒకటి కొనుగోలు చేయాలని వెళ్లిన వారి చేత పది కొనిపిస్తారు. ఇదే అసలు రహస్యం. నిజానికి అ రంగురంగుల ప్రదర్శన అంతా అబద్దమే…మన కళ్లను మనతోనే మోసం చేసే ఎత్తుగడలు. ఇక క్లియరెన్స్‌ సేల్‌ అంటారు. అంటే అర్ధమేమిటో ఎవరికీ తెలుసు. అయినా ఎగబడి కొంటాం. అంటే పాత స్టాక్‌ను తీసేస్తున్నాం. అవి అడ్డికిపావుసేరు అమ్మేస్తున్నాం. డెబ్బై ఎనభై శాతం రిబేటు ఇస్తున్నామంటారు. అదెలా సాధ్యమని ఎవరూ ఆలోచించరు. ఐదు వందల చీరపై రెండు వేల స్టిక్కర్‌ అతికించి, డిస్కౌంట్‌ పేరుతో అదే ఐదు వందలకు అమ్మేస్తుంటారు. మనల్ని నిండా ముంచేస్తుంటారు. ఐదు వందల చీరను వందకు అమ్మితే అది డిస్కౌంట్‌ అవుతుందే తప్ప, ధరలు ఇష్టాను సారం పెంచి, తగ్గించినట్లు ప్రచారం చేసి అమ్మితే ఎలా డిస్కౌంట్‌ అవుతుందో అని ఒక్క క్షణం ఆలోచించం. డిస్కౌంట్‌ సేల్‌ డిస్కౌంట్‌ సేల్‌ అంటూ బురిడీ కొట్టిస్తూనే వుంటారు. మనం వెళ్లి కొంటూనే వుంటాం. షాపింగ్‌ అని అందమైన పేరుపెట్టుకొని అవసరం లేకున్నా వేలు తగలేసి చీరలు, డ్రెస్సులు కొనుగోలు చేస్తుంటాం. మన బీరువాలు నింపేసుకుంటాం. వాటిని కట్టేది లేదు. చూసుకొని మురుస్తుంటాం. కొత్త స్టాక్‌ వచ్చిందని, ప్రతి కొనుగోలు మీద బంపర్‌ ఆఫర్లు పెట్టామని ప్రచారం చేస్తుంటారు. లక్కీ డ్రాలు పెడుతుంటారు. బంగారం, ఇతర ఖరీదైన వస్తువులను ఎరగా చూపుతారు. మళ్లీ మన చేత బట్టలు కొనిపిస్తూనే వుంటారు. ఎండాకాలంలో పెళ్లిళ్ల సీజన్‌ అయిపోగానే సహజంగా ఆషాడం వస్తుంది. ఆషాడంలో ఎలాంటి కొత్త వస్తువులు ఎవరూ కొనుగోలు చేయరు. కాని బట్టల మాల్స్‌మాత్రం ఆషాడం స్పెషల్‌ అని కొనిపిస్తారు. పెళ్లి చేసుకొని అత్తవారింటి నుంచి అమ్మగారింటికి వచ్చిన ఆడపిల్లల చేత ఆషాడ మాసంలో కూడా బట్టలు కొనుగోలు చేసేలా ఆఫర్లు ప్రకటిస్తారు. ఆషాడం పూర్తయి, శ్రావణ మాసంలో అత్తవారింటికి వెళ్లే కొత్త దంపతుల చేత పవిత్రమైన మాసమంటూ కొత్త బట్టలు కొనుగోలు చేసేలా ప్రచారం సాగిస్తారు. ప్రతి నెల ఏదో ఒక రకమైన ప్రలోభాలకు గురి చేస్తూనే వుంటారు. ఆ తర్వాత వచ్చే దసరా,దీపావళి పూర్తయ్యే సరికి ప్రజల ఇంట్లో వున్న సొమ్మంతా మాల్స్‌లో బట్టల ఖరీదుకు ఖర్చయ్యేలా చేస్తారు. ఏ పండుగ వచ్చినా ఆ పండుగ ఆఫర్లు ప్రకటిస్తుంటారు. అయినా అమ్ముడు పోకుండా వున్న స్టాక్‌ నంతా అడ్డికి పావుసేరు అమ్మలేరు. అమ్మాలనుకున్నా ఎవరూ కొనుగోలు చేయరు. బట్టల వ్యాపారమంతా మాయా జాలమే..మన కళ్లకు గంతలు కట్టడమే. పట్టపగలే చుక్కలు చూపించడమే. పగటి వేళలో రంగు రంగుల లైట్లు వేసి బరిడీ కొట్టించడమే. ముతక బట్టలు కూడా అందంగా కనిపించేలా కనికట్టు చేయడమే. అందుకే మాల్స్‌ చూసి మోసపోకండి. పైన పటారం.లోన లొటారమే వుంటుంది. మాల్స్‌ చేసేదంతా మోసమే..మన సొమ్ముకు కన్నం వేయడమే..ఇది తెలుసుకుంటే ఎవరూ మాల్‌ వరకు వెళ్లరు. చేతి చమరు వదిలించుకోరు. చేనేత కార్మికులు మగ్గం మీద ఎంతో కష్టపడి నేసే పట్టు చీరను పోలిన యంత్రాల తయారీ మీద రెడీ అయిన నాసికరకం చీరను అసలు చీరకన్నా ఎక్కువ ఖరీదుకు అమ్ముతున్నా పట్టించుకునే నాధుడు వుండడు. వాటిపై చర్యలు తీసుకోరు. ప్రభుత్వాలు ఇప్పటికైనా మేలు కోవాలి.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version