సిపిఆర్ తో ప్రాణాలు కాపాడొచ్చు.
చిట్యాల, నేటిదాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆదర్శ పాఠశాల కళాశాలలో సిపిఆర్ పై అవగాహన వారోత్సవాల సందర్భంగా జీవీకే ఈఎంఆర్ఐ 108 అంబులెన్స్ సిబ్బంది చిట్యాల వారి ఆధ్వర్యంలో శుక్రవారం సిపిఆర్ పై అవగాహన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా 108 అంబులెన్స్ ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్ నగేష్ కుమార్ స్వయంగా సిపిఆర్ చేసి విద్యార్థులకు చూపించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ సిపిఆర్ కార్డియో ఫల్మనరీ రీసెస్సిటేషన్ తో ప్రాణాలు కాపాడొచ్చు అన్నారు. సిపిఆర్ అనేది ఒక అత్యవసర ప్రాణ రక్షణ పద్ధతి అని ఎవరికైనా శ్వాస తీసుకోవడం గుండె కొట్టుకోవడం ఆగిపోయినప్పుడు మెదడు ఇతర ముఖ్య అవయవాలకు రక్తాన్ని ఆక్సిజన్ ను సరఫరా చేయడానికి ఇది సహాయపడుతుందని తెలిపారు. సిపిఆర్ లో ప్రధానంగా చాతిని గట్టిగా వేగంగా నొక్కడం గుండెపోటు వచ్చిన వ్యక్తికి తక్షణమే అందించవలసిన అత్యవసర చికిత్స అని తెలిపారు. అకస్మాత్తుగా కార్డియాక్
అరెస్ట్ అయినప్పుడు సిపిఆర్ చేసి ప్రమాదం నుంచి కాపాడవచ్చు అన్నారు. కార్డియాక్ అరెస్ట్ అయితే 108 అంబులెన్స్ కు సమాచారం ఇస్తూనే వాహనం వచ్చేవరకు సిపిఆర్ చేస్తే ప్రాణాలు దక్కుతాయి అని తెలిపారు. అపస్మారక స్థితిలో ఉన్న వ్యక్తికి సిపిఆర్ చేసే విధానం పై విద్యార్థులకు నగేష్ కుమార్ అవగాహన కల్పించారు. సిపిఆర్ పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ సందర్భంగా 108 టెక్నీషియన్ నగేష్ కుమారును పైలెట్ రాజు ను స్కూల్ యాజమాన్యం అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఆదర్శ పాఠశాల కళాశాల ప్రిన్సిపాల్ మేకల రమేష్ ఉపాధ్యాయులు రాకేష్ 108 పైలెట్ రాజు తదితరులు పాల్గొన్నారు.
