పోలీసు అధికారులపై డీజీపీకి పిర్యాదు?
న్యాయవ్యవస్థపై నమ్మకం, అవసరానికేనా?
అప్పుడొక న్యాయం. ఇప్పుడొక తీర్పా?
కోర్టులో తేలాల్సిన విషయాలపై ముందస్తు ముద్రలు సరికాదని విమర్శలు
నేటిధాత్రి, వరంగల్
పోలీసులపై ఫిర్యాదు చేసిన సదరు నాయకుడి కుమారునిపై దాదాపు పదేళ్ల క్రితం నమోదు చేసిన కేసులో, న్యాయవ్యవస్థపై నమ్మకంతో కోర్టులో పోరాడి చివరకు నిరపరాధిగా తేలిన ఘటన ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. డిసెంబర్ 23, 2025న కోర్టు ఆ కేసులో విముక్తి ప్రకటించడంతో అప్పట్లో న్యాయవ్యవస్థపై విశ్వాసం వ్యక్తం చేసిన అదే నాయకుడు, ఇప్పుడు మాత్రం భిన్న వైఖరిని అవలంబిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
అప్పుడూ కోర్టే… ఇప్పుడూ కోర్టే కదా?
తూర్పు నియోజకవర్గానికి చెందిన కార్పొరేటర్లపై నమోదైన ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసులను, కోర్టు పరిధిలోకి వెళ్లకముందే “తప్పుడు కేసులు”గా ముద్ర వేయడం ఎంతవరకు సమంజసమన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తమ కుమారుడి విషయంలో న్యాయస్థానాలను ఆశ్రయించి న్యాయం పొందిన నాయకుడు, ఇప్పుడు ఇతరుల విషయంలో అదే న్యాయవ్యవస్థపై ఎందుకు అనుమానం వ్యక్తం చేస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు.
డీజీపీకి లేఖలు… ఉద్దేశం ఏమిటి?
కేసులు నమోదైన వెంటనే వాటిని తప్పుడు కేసులుగా పేర్కొంటూ పోలీసు అధికారులపై విచారణ జరపాలని డీజీపీకి వినతిపత్రాలు ఇవ్వడం వెనుక రాజకీయ ప్రయోజనాలే ఉన్నాయన్న విమర్శలు వస్తున్నాయి. చట్టబద్ధంగా విధులు నిర్వహించిన పోలీసుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడం సమంజసం కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు.
ఇబ్బంది పడేది ప్రజలే
తూర్పు నియోజకవర్గంలో సాగుతున్న ఈ రాజకీయ పంచాయతీల వల్ల చివరకు నష్టపోయేది సామాన్య ప్రజలేనని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసులు పెట్టిన వారిని భయభ్రాంతులకు గురిచేయడం, అధికార యంత్రాంగంపై ఒత్తిడి తేవడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అంటున్నారు.
అభివృద్ధి ఎక్కడ? రాజకీయాలు ఎక్కడ?
వరద బాధితులు సహాయం కోసం ఇప్పటికీ ఎదురుచూస్తుండగా, మరోవైపు తూర్పు నియోజకవర్గంలో ఒక్క ప్రభుత్వ కార్యాలయం కూడా లేకపోవడం మరో పెద్ద సమస్యగా మారింది. అన్ని కార్యాలయాలు హన్మకొండలోనే ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నా, ఈ అంశాలపై పోరాటం చేయాల్సిన నాయకులు గ్రూపు రాజకీయాల్లో మునిగిపోయారని విమర్శలు వస్తున్నాయి.
న్యాయవ్యవస్థను నమ్మితే, అందరికీ సమానంగా నమ్మాలి
న్యాయస్థానాల్లో తేలాల్సిన అంశాలపై ముందే తీర్పులు ఇవ్వడం, అదే న్యాయవ్యవస్థపై నమ్మకం ఉందని చెప్పుకునే నేతలకు శోభించదన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. రాజకీయ పోటీలు ఉంటే నేరుగా తేల్చుకోవాలి కానీ, ప్రజల సమస్యలు, అభివృద్ధిని పక్కదారి పట్టించకూడదని స్థానికులు హితవు పలుకుతున్నారు.
ప్రజల కోసం పనిచేద్దాం… రాజకీయాలకు హద్దులు పెట్టేద్దాం
పక్క నియోజకవర్గాలు అభివృద్ధిలో ముందుండగా, వరంగల్ తూర్పు మాత్రం గ్రూపు రాజకీయాలు, సమావేశాలతోనే పరిమితమవుతుందన్న విమర్శలు పెరుగుతున్నాయి. ఇప్పటికైనా నాయకులు రాజకీయ లాభాలకన్నా ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.
