మట్టి వినాయకులే ముద్దు.., పర్యావరణ ప్రేమికులవుదాం..
డాక్టర్ రతన్ సింగ్ ఠాకుర్.
నేటిధాత్రి, మట్టేవాడ.
వరంగల్ ఏవివి జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ కోసం “మట్టి ప్రతిమలను పూజిద్దాం – పర్యావరణహిత ప్రేమికులమవుదాం” అనే ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ పర్యావరణ వేత్త డాక్టర్ రతన్ సింగ్ ఠాకూర్ ముఖ్య అతిథిగా విచ్చేసి విద్యార్థులకు సందేశమిచ్చారు. వినాయక చవితి సందర్భంగా పిఒపి విగ్రహాల వల్ల కలిగే నీటి కాలుష్యాన్ని నివారించేందుకు మట్టి వినాయకులే ఉత్తమమైనవి అని ఆయన పేర్కొన్నారు. వినాయకుడు అంటేనే “ప్రకృతి” కాబట్టి మట్టి విగ్రహాలు, సహజ రంగులు వాడటం ద్వారా పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని ప్రజలను ఆయన ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఏవివి కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ అధికారి శ్రీనివాసరావు మాట్లాడుతూ, గత 20 ఏళ్లుగా తమ విభాగం పర్యావరణ పరిరక్షణపై అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోందని తెలిపారు. ప్రస్తుతం మట్టి వినాయకుల వాడకం 25 శాతమే ఉన్నప్పటికీ రాబోయే రోజుల్లో ఇది 40 శాతానికి పెంచే దిశగా ప్రయత్నాలు కొనసాగుతున్నాయని వివరించారు. విద్యార్థులు స్వయంగా మట్టి వినాయకులను రూపొందించి ర్యాలీ నిర్వహించడం ఇదే లక్ష్యానికి నిదర్శనమని చెప్పారు. “పిఒపి వద్దు – మట్టి వినాయకులే ముద్దు” అనే నినాదాలతో ర్యాలీ కొనసాగింది. మట్టి వినాయకుల వల్ల పర్యావరణం కాపాడబడటమే కాకుండా గణేశ పూజలో వాడే 21 రకాల పత్రి ఔషధ గుణాలను కూడా ప్రజలకు తెలియజేశారు. అనంతరం శ్రీనివాసరావు రచించిన ఔషధ మొక్కల విలువలపై గోడపత్రిక ఆవిష్కరించబడింది. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ అధ్యాపకుడు సర్వేశ్, సీనియర్ ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు రబ్బాని, దేవిశ్రీప్రసాద్, సాకేత్, చిరంజీవి, దస్తగిరి, క్రాంతి, భరత్, శివశంకర్, నమ్రత, చందన, ప్రవళిక, మన్విత, సుహన, వైష్ణవి తదితరులు పాల్గొన్నారు.