తవ్వకాల్లో దొరికిన బంగారం కోసం ఘర్షణ.. రంగంలోకి దిగిన పోలీసులు
గుప్త నిధుల కోసం తొవ్వకాలు జరిపి.. భారీ ఎత్తున బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కానీ ఆ బంగారాన్ని పంచుకునే క్రమంలో ఘర్షణలు తలెత్తాయి. ఈ పంచాయితీ కాస్తా పోలీస్ స్టేషన్‌కు చేరింది. పోలీసులు రంగంలోకి దిగి పలువురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.
ములుగు, నవంబర్ 21: గుప్త నిధుల తవ్వకాల్లో భారీగా బంగారం లభించింది. దానిని పంచుకునే క్రమంలో వారి మధ్య విభేదాలు వచ్చాయి. దాంతో ఈ పంచాయితీ కాస్తా పోలీస్ స్టేషన్‌కు చేరింది. పోలీసులు రంగంలోకి దిగి.. ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటన ములుగు జిల్లాలో చోటు చేసుకుంది. ఆరు నెలల క్రితం కొందరు వ్యక్తులు బృందంగా ఏర్పడి.. మహారాష్ట్రలోని సిరిపంచ సమీపంలో ఒక ఇంట్లో గుప్త నిధల కోసం భారీ ఎత్తున తవ్వకాలు జరిపారు. ఈ సందర్భంగా రాగి బిందెను వారు వెలికి తీశారు. అందులో భారీ ఎత్తున బంగారం లభ్యమైంది.
దొరికిన ఆ బంగారాన్ని పంచుకునే క్రమంలో ఈ బృందంలోని సభ్యుల మధ్య విభేదాలు తలెత్తాయి. ఒకరికొకరు ఘర్షణకు దిగారు. ఈ పంచాయతీ పోలీసులకు చేరింది. వీరి నుంచి మొత్తం సమాచారాన్ని సేకరించేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. గుప్త నిధుల తవ్వకాల్లో దొరికిన రాగి బిందెపై పోలీసులు ఆరా తీశారు. ఈ తవ్వకాల్లో దొరికిన బిందెలో మొత్తం 36 బంగారం బిళ్లలు ఉన్నాయని పోలీసుల విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. ఒక్కో బిళ్ల 23 గ్రాముల బరువు ఉందని పోలీసులకు వారు వివరించినట్లు సమాచారం. దీనిపై పోలీసులు సమగ్ర విచారణ జరుపుతున్నారు.
