విద్యార్థుల భద్రత దృష్ట్యా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాలి
- బీజేవైఎం కళాశాలల రాష్ట్ర కన్వీనర్ మంద మహేష్ డిమాండ్
గణపురం, నేటిధాత్రి:
గణపురం మండలం ఆసియాలోనే అతిపెద్ద గిరిజన పండుగ మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరను పురస్కరించుకుని, గణపురం మండలంలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా పాఠశాలలకు తక్షణమే సెలవులు ప్రకటించాలని బీజేవైఎం కళాశాలల రాష్ట్ర కన్వీనర్ మంద మహేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 28 నుండి 31 వరకు జరిగే జాతరకు కోట్లాది మంది భక్తులు తరలివస్తున్నారని, దీనివల్ల గణపురం మండలంలోని ప్రధాన రహదారులన్నీ బస్సులు, భారీ వాహనాలతో నిండిపోయాయని ఆయన పేర్కొన్నారు. పాఠశాలలకు వెళ్లే చిన్నారి విద్యార్థులు సైకిళ్లపై వెళ్తూ ఈ రద్దీలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రహదారులు దాటే సమయంలో ప్రాణాపాయం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో జాతర సందర్భంగా మూడు, నాలుగు రోజులు సెలవులు ఇచ్చే ఆనవాయితీ ఉందని, కానీ ఈసారి ప్రభుత్వం పట్టించుకోకపోవడం సరికాదని విమర్శించారు. విద్యార్థుల భద్రత కంటే ముఖ్యం ఏదీ కాదు. ఏదైనా అవాంఛనీయ సంఘటన జరిగితే దానికి బాధ్యులు ఎవరని మంద మహేష్ ప్రశ్నించారు. తక్షణమే జిల్లా యంత్రాంగం స్పందించి విద్యార్థుల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ఈ నాలుగు రోజులు మండలంలోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేవైఎం నాయకులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
