నాన్ మెడికల్ అధికారుల నియామకం వైద్యరంగానికి ముప్పు
ఏఐఎఫ్డీడబ్ల్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగల రాగసుధ
నర్సంపేట,నేటిధాత్రి:
ప్రభుత్వ ఆసుపత్రుల పరిపాలన కోసం నాన్ మెడికల్ అధికారుల నియామకం చేయడం వైద్య రంగానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగల రాగసుధ పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆసుపత్రుల పరిపాలన బాధ్యతలను నాన్ మెడికల్ అధికారులకు అప్పగించాలని చేసిన ప్రతిపాదనలపై వైద్య వర్గాల్లో తీవ్రమైన అసహనం నెలకొందని, ఈ నిర్ణయం ఆరోగ్య వ్యవస్థ యొక్క ప్రాథమిక సూత్రాలకు విరుద్ధమని,రోగి సేవల నాణ్యతపై తీవ్రమైన ప్రభావం చూపుతోందని, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఏఐఎఫ్డీడబ్ల్యు రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.ఆసుపత్రుల పరిపాలన,వైద్య నిర్ణయాలు,చికిత్స విధానాలు అన్ని వైద్య పరిజ్ఞానంతో ముడిపడి ఉంటాయని అలాంటి వ్యవహారాలను నాన్ మెడికల్ అధికారుల చేతుల్లో పెట్టడం అనేది రోగి సేవలను ప్రమాదంలోకి నెట్టే నిర్ణయమని, ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇచ్చే ప్రభుత్వం ఈ నిర్ణయం పట్ల పునరాలోచించాలని అన్నారు. నాన్ మెడికల్ అధికారుల చేతుల్లో ఆసుపత్రుల నిర్వహణ ఉంటే వైద్యులు పరిపాలన అధికారాలు కోల్పోతారని,రోగుల సేవలు క్షీణిస్తాయని, ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థలో వైద్యుల పాత్రను బలహీనపరిచే నిర్ణయాలు తీసుకోవడం దురదృష్టకరమని ఈ ప్రతిపాదనను ప్రభుత్వం వెంటనే రద్దుచేసి రోగి సేవలు మెరుగుదలకు వైద్యులే ప్రధాన కేంద్రంగా ఉండే విధానం కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఆసుపత్రులలో పరిపాలన ప్రజా ఆరోగ్య భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రజా ఆరోగ్యం రాజకీయ నిర్ణయాలకు బలి కాకూడదని అన్నారు.ప్రభుత్వం ప్రజా ఆరోగ్యాన్ని కాపాడాలంటే, వైద్యులే పరిపాలన బాధ్యత వహించాలని, నాన్ మెడికల్ అధికారులకు అప్పగించే ఆలోచనను తక్షణమే ఉపసంహరించుకోవాలని, లేని పక్షంలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమైక్య ఆధ్వర్యంలో వైద్య వర్గాలను, రోగులను, ప్రజాస్వామ్య వర్గాలను సమీకరించి ఆందోళన పోరాటాలు ఉదృతం చేస్తామని రాగసుధ హెచ్చరించారు.
