లాటరీ ద్వారా డబుల్ బెడ్రూం ఇండ్ల కేటాయింపు.
రామకృష్ణాపూర్, నేటిధాత్రి:
డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులకు రామకృష్ణాపూర్ లోని ఆర్కేసీఓఏ క్లబ్ లో లాటరీ ద్వారా ఇండ్ల కేటాయింపు జరుగుతుందని మందమర్రి తహసిల్దార్ సతీష్ కుమార్ తెలిపారు. లాటరీ నిర్వహించే క్లబ్ ను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 286 ఇండ్లకు గాను 230 ఇండ్లకు ఆర్డీవో సమక్షంలో లాటరీ తీయబడునని, లబ్ధిదారులు మున్సిపల్ కార్యాలయం నుండి పంపిణీ చేసిన అర్హత గల స్లిప్ తో పాటు ప్రభుత్వం నుండి గుర్తింపు పొందిన ధృవీకరణ పత్రం తమ వెంట తీసుకురావాలని కోరారు. ఇండ్ల కేటాయింపులో ఎలాంటి అవకతవకలు లేకుండా పారదర్శకంగా నిర్వహిస్తామని, హాల్ లోకి లబ్ధిదారులకు మాత్రమే ప్రవేశం ఉంటుందని పేర్కొన్నారు. ఒకవేళ లబ్ధిదారులు అందుబాటులో లేని పక్షంలో రేషన్ కార్డులో ఉన్న సభ్యుల్లో ఒకరికి ప్రవేశానికి అవకాశం కల్పించినట్లు తెలిపారు. లాటరీ నిర్వహించే సమయంలో పట్టణ పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు తెలియజేశారు. ఆయన వెంట మున్సిపల్ కమీషనర్ రాజు, పట్టణ ఎస్సై రాజశేఖర్ ఉన్నారు.