హన్మకొండ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ ఆకస్మిక దాడులు – భారీ అవినీతి బట్టబయలు
హనుమకొండ, నేటిధాత్రి.
హనుమకొండ జిల్లా వరంగల్ (ఆర్.ఓ) సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు నిర్వహించిన ఆకస్మిక తనిఖీలు భారీ అవినీతి వ్యవహారాన్ని వెలుగులోకి తెచ్చాయి. ఏప్రిల్ 2న నిర్వహించిన ఈ దాడుల్లో అనేక కీలక విషయాలు బయటపడ్డాయి.
తనిఖీల సమయంలో కార్యాలయంలో అనుమతి లేకుండా తిష్టవేసిన 20 మంది దళారులు/డాక్యుమెంట్ రైటర్లను గుర్తించి పట్టుకున్నారు. వారి వద్ద నుండి లెక్కల్లో చూపని రూ.47,450 నగదు, అలాగే 70 రిజిస్ట్రేషన్‌కు సంబంధించినవి కాని పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
దళారుల మొబైల్ ఫోన్లను పరిశీలించగా, సబ్ రిజిస్ట్రార్ అధికారులు జమలాపురం రామనరసింహారావు (SRO-I), దావులూరి ఆనంద్ (SRO-II) లతో జరిగిన వాట్సాప్ చాట్‌లు వెలుగులోకి వచ్చాయి. వీటి ఆధారంగా గత ఏడాది కాలంలో ఫోన్‌పే ద్వారా దాదాపు రూ.42,03,125 (42లక్షలు) లంచాల రూపంలో లావాదేవీలు జరిగినట్లు అధికారులు గుర్తించారు.
ఇంకా, కార్యాలయంలో 204 డెలివరీ చేయని రిజిస్టర్డ్ పత్రాలు అధికారుల వద్దే ఉండటం గమనార్హం. ఇది విధి నిర్వహణలో నిర్లక్ష్యానికి ఉదాహరణగా అధికారులు పేర్కొన్నారు.
ఇదే సమయంలో సబ్ రిజిస్ట్రార్ల నివాసాల్లో నిర్వహించిన సోదాల్లో రూ.24,61,540 నగదు, సుమారు 819.5 గ్రాముల బంగారం, 2.6 కిలోల వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. అదనంగా, కపిల్ చిట్స్‌లో రూ.30,10,000 విలువైన ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా గుర్తించారు.
తనిఖీల సందర్భంగా మరికొన్ని అక్రమాలు బయటపడినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. మొత్తం వ్యవహారంపై సమగ్ర నివేదికను ప్రభుత్వానికి సమర్పించి, తదుపరి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
నేటిధాత్రి, హన్మకొండ.
ప్రజలు ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగుల నుండి లంచం డిమాండ్‌కు గురైతే, ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064కు ఫిర్యాదు చేయాలని అధికారులు సూచించారు. ఫిర్యాదు దారుల వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.
