ఆందోళన కలిగిస్తున్న వరుస సంఘటనలు..

విపరీత ధోరణితో అగమ్య గోచరం కానున్న విద్యార్థుల భవిత

ఆందోళన కలిగిస్తున్న వరుస సంఘటనలు

విద్యా హక్కు చట్టంతో ఉపాధ్యాయులకు సంకెళ్లు – నిస్సహాయ స్థితిలో ఆవేదన చెందుతున్న వైనం

తల్లిదండ్రుల అతి గారాబం లేదా అసలు పట్టించుకోకపోవడం రెండూ తప్పే

తీవ్ర దుష్ప్రభావం చూపిస్తున్న సినిమాలు, సోషల్ మీడియా

ప్రశ్నార్ధకం కానున్న విద్యార్థుల భవిష్యత్తు – సమాజ కంఠకులుగా మారే పెను ప్రమాదం

మొక్కై వంగనిది – మానై వంగుతుందా

నేడు బెత్తమే వారిని మార్చలేక పోతే భవిష్యత్తులో లాఠీలు మార్చాల్సి వస్తది

ఇవి డేంజర్ బెల్స్ – ప్రభుత్వాలు ,మేధావులు ఆలోచించాల్సిన తరుణం

తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ కేసముద్రం మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్ , ప్రధాన కార్యదర్శి నరసింహ రాజు ల ఉద్ఘాటన

కేసముద్రం/ మహబూబాబాద్: నేటి ధాత్రి

ఆంధ్రప్రదేశ్లోని ఒక ప్రభుత్వ పాఠశాల గోడపై పదవ తరగతి విద్యార్థి ” దమ్ముంటే పట్టుకోరా ఇన్విజిలేటరు ,పట్టుకుంటే వదిలేస్తా బుక్కులెట్టు ,నీ అవ్వ తగ్గేదేలే ” అని పుష్ప సినిమాలోని అల్లు అర్జున్ డైలాగ్ ను కాపీ కొట్టి రాసిన డైలాగ్ చూసి తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ కేసముద్రం మండల శాఖ అధ్యక్షులు గుండు సురేందర్ విస్మయం వ్యక్తం చేశారు .ఈ సందర్భంగా మండల శాఖ అధ్యక్షులు సురేందర్ మాట్లాడుతూ సినిమాలు, సోషల్ మీడియా విద్యార్థుల పై తీవ్ర దుష్ప్రభావాన్ని కలిగిస్తున్నాయని, విద్యాహక్కు చట్టం కూడా విద్యార్థులను దండించరాదని చెప్పడం, తల్లిదండ్రుల అతి గారాబం లేదా అసలు పట్టించుకోకపోవడం వలన క్రమశిక్షణ లేకుండా పోయిందన్నారు. విద్యార్థులు ఏం చేసినా అడిగే వారే లేరని వారి ఇష్టం వచ్చినట్లుగా వ్యవహరిస్తున్నారని అభిప్రాయపడ్డారు .వీరికిస్తున్న అతి స్వేచ్ఛ వలన మంచి చెప్పే ప్రయత్నం చేసే ఉపాధ్యాయులపై దాడులు చేయడం , పాఠశాలలో దురలవాట్లకు లోను కావడం , భిన్న రకాల హెయిర్ స్టైల్ లతో ఆకతాయిలుగా మారుతున్నారన్నారు. ఇవన్నీ చూస్తూ విద్యార్థులను సరిదిద్దలేక ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉపాధ్యాయులు ఉంటూ ఎంతో మనోవేదనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. “ఎంత చెప్పినా చదువులో రాణిస్తలేరని ,అలా అని మిమ్మల్ని దండించలేకపోతున్నాం అని , ఇప్పటికైనా చదవండి” అని ప్రాధేయ పడుతూ ఒక ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సాష్టాంగ నమస్కారం చేసి, గుంజీలు తీయడం సమస్య తీవ్రతను తెలియజేస్తుందన్నారు. చిన్నతనంలోనే తప్పు చేసినప్పుడు బెత్తంతోశిక్షిస్తే ఇంకొకసారి ఆ తప్పు చేయడానికి భయపడతారని, లాఠీలతో మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడదని వివరించారు. కానీ పిల్లలను దండిస్తే ఉపాధ్యాయులను నిందించడం ,వారిపై దాడులు చేయడంలాంటి సంఘటనలు ఎన్నో చూసామన్నారు. “మొక్కై వంగనిది మానై వంగుతుందా” అని ప్రశ్నించారు .చిన్నతనంలోనే మంచి అలవాట్లు నేర్పిస్తే తల్లిదండ్రులు ,గురువులు గర్వించే లాగా తమ భవిష్యత్తుని తీర్చిదిద్దుకుంటారని అన్నారు . అతి స్వేచ్ఛ ఇచ్చి ఇలాగే వదిలేస్తే సమాజ కంఠకులుగా మారే పెను ప్రమాదం ఉందన్నారు. ఇప్పుడు జరిగిన సంఘటనలన్నీ సమాజానికి డేంజర్ బెల్స్ మోగించినట్లేనని ,ఇంకా నిర్లక్ష్యం వహిస్తే జరిగే నష్టాన్ని ఎవరూ కూడా ఊహించలేరన్నారు.
ఇప్పటికైనా తల్లిదండ్రులు, మేధావులు , ప్రభుత్వాలు ఆలోచించాలని సూచించారు. చట్టంలో మార్పు తీసుకొస్తే విద్యార్థుల ప్రవర్తనలో మార్పు తీసుకురావడం కష్టమేమీ కాదని, తల్లిదండ్రులు కూడా పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఉపాధ్యాయులకు సహకరించాలని  కోరారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version