‘సిటీ మహిళా డిగ్రీ కళాశాల’ తీరే సపరేటు 

‘సిటీ మహిళా డిగ్రీ కళాశాల’ తీరే సపరేటు
హనుమకొండ పొద్దుటూరి కాంప్లెక్స్‌లో నిర్వహించబడుతున్న ‘ సిటీ మహిళా డిగ్రీ కళాశాల’ యాజమాన్యం తీరే సపరేటుగా ఉంది. ఇరుకైన ప్రదేశంలో కాలేజీ నిర్వహిస్తూ అన్ని సౌకర్యాలు ఉన్నట్లుగా ప్రచారం చేస్తూ యాజమాన్యం విద్యార్థులను ప్రలోభాలకు గురి చేస్తుంది. అన్ని రకాల వసతులున్నాయంటూ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు, తల్లిదండ్రులకు నమ్మబలికి అడ్మిషన్ల ప్రక్రియను కొనసాగిస్తుంది. సౌకర్యాల గురించి ఎవరైనా మాట్లాడితే  మాకు అందరూ తెలుసు, ప్రజాప్రతినిధులు, అధికారులు మా పక్షమే ఉన్నారు అంటూ యాజమాన్యం దబాయిస్తుంది. పత్రిక కథనాలు రాస్తే వారి పై స్థాయి వారికి ఫిర్యాదు చేసి మేనేజ్‌ చేసుకొని అసలు నిజాలు రాసే విలేఖరులనే తప్పుపటే విధంగా యాజమాన్యం వ్యవహరించటం చర్చానీయాంగా మారింది. మరో వైపు సిటీ మహిళా డిగ్రీ కళాశాల నిర్వహణ తీరుపై విద్యార్థి సంఘాలు ఆందోళన చెందుతుంటే కళాశాల యాజమాన్యం సక్రమంగానే ఉన్నాయంటూ విద్యార్థులను ప్రలోభాలకు గురిచేస్తుంది. కొంతమంది విద్యార్థులు యాజమాన్యం ప్రలోభాలకు గురైతే మరికొంత మంది విద్యార్థులు, తల్లిదండ్రులు కళాశాలల నిర్వహణ తీరును పరిశీలించి ప్రవేశాలు పొందడానికి  జంకుతుండటం గమనార్హం. ఫైర్‌ సేప్టీ లేకున్న, కనీసం మంచినీటి సౌకర్యం లేనటుంటి కమర్షియల్‌ కాంప్లెక్స్‌లో మహిళా డిగ్రీ కళాశాల నిర్వహించటానికి అధికారులు సైతం ఎలా పర్మిషన్‌ ఇచ్చారో వారికే తేలియాలని పలువురు వాఖ్యానిస్తున్నారు.  పార్కింగ్‌ స్థలం, గ్రౌండ్‌ లేకుండా ఇరుకైన  ప్రదేశమైన కాంప్లెక్స్‌లో కళాశాల నిర్వహిస్తుంటే అధికారులు గుమ్మనకుండా ఉండటం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అసలు కళాశాలకు పర్మిషన్‌ ఏ పత్రిపాధికన ఇచ్చారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.  సరైన ల్యాబ్‌ సౌకర్యం, లైబ్రరీ, మంచినీటి వసతి, మూత్రశాలలు, టాయిలెట్లు  తదితర సౌకర్యాలు లేకుండా కమర్షియల్‌ కాంప్లెక్స్‌ లో కళాశాలను నిర్వహించటం విద్యావ్యాపారానికి నిలువెత్తు సాక్ష్యంగా ఉందనేది గమనార్హం.  అధికారుల అండతోనే కళాశాల యాజమాన్యం ఇష్టానుసారంగా వ్యవహరిస్తోందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి కమర్షియల్‌ కాంప్లెక్స్‌ లోని సిటీ మహిళా డిగ్రీ కళాశాల నిర్వహణ తీరు పట్ల తక్షణమే చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.
పర్మిషన్లు  కాగితాలకే పరిమితమా…!
హన్మకొండ ప్రొద్దుటూరి కాంప్లెక్స్‌లో నిర్వహించబడుతున్న ‘ సిటి మహిళా డిగ్రీ కాలేజీ’ పర్మిషన్లు అన్ని కాగితాలకే పరిమితంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారులకు లేనివి ఉన్నట్లుగా చూపించి పక్కదారి పట్టించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సౌకర్యాలు లేవనేది స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ అధికారులు పర్మిషన్లు ఎలా ఇచ్చారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కాంప్లెక్స్‌ మొత్తానికి సరిపడనటువంటి తక్కువ మోతాదు కల బోర్‌ మాత్రమే కాంప్లెక్స్‌లో ఉంది. దీనిని బట్టి కనీస నీటి వసతి లేదనేది స్సష్టమవుతుంది. ఇక కనీసం పార్కింగ్‌ స్ళలం లేదనేది కాంప్లెక్స్‌ తెలిసిన వారికేవరికైనా బోదపడే అంశమే. మరో వైపు కళాశాల నిర్వహణలో భాగంగా ఎకరం గ్రౌండ్‌ తప్పని సరి అనేది నిబంధన కానీ కాలేజీ నిర్వహించే కాంప్లెక్స్‌లో గ్రౌండ్‌ ఎక్కడుందో, పార్కింగ్‌ స్థలం ఎక్కడుందో పర్మిషన్‌ ఇచ్చిన అధికారులకు, కాలేజీ నిర్వహించే యాజమాన్యానికే తేలియాలి. ఏదిఏమైనప్పటికీ సిటీ మహిళా డిగ్రీ కాలేజీ నిర్వహణ పట్ల ఉన్నతాధికారులు తక్షణమే చర్యలు చేపట్టాల్సి ఉంది.

ట్రబుల్‌షూటర్‌…రూటు మారేనా…?

ట్రబుల్‌షూటర్‌…రూటు మారేనా…?

తెలంగాణ రాష్ట్రంలో టిఆర్‌ఎస్‌ రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పార్టీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి ట్రబుల్‌షూటర్‌ హరీష్‌రావుకు అంతగా ప్రాధాన్యత దక్కడం లేదన్నది ప్రస్తుతం టిఆర్‌ఎస్‌ పార్టీతో సహా అన్ని రాజకీయ వర్గాల్లో చర్చ జోరుగా కొనసాగుతుంది. తెలంగాణ ఉద్యమం మొదలుకుని టిఆర్‌ఎస్‌ పీఠం ఎక్కే వరకు అతి కీలకమైన పాత్ర పోషించిన హరీష్‌రావు ప్రాధాన్యత మొత్తంగా తగ్గిపోయిందని రాష్ట్రం మొదలుకుని దేశస్థాయిలో అందరి దృష్టిని ఆకర్షించిన ఆయన ప్రస్తుతం తన నియోజకవర్గమైన సిద్ధిపేటకు పరిమితం అవుతూ ప్రాధాన్యత తగ్గింది. పార్టీ అధిష్టానం కావాలనే ఇలా చేస్తుందని అనుచరగణం, ఇతర అభిమానులు ప్రకటనలు, తమ నిరుత్సాహాన్ని వ్యక్తం చేస్తున్న ట్రబుల్‌షూటర్‌ మాత్రం అలాంటిది ఏం లేదు గులాబీతోనే ఉన్నానంటూ తరుచుగా ప్రకటనలు చేస్తున్నారు. ప్రభుత్వ అనుకూల ప్రకటనలతోపాటు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ గులాబీ వెంటే నేను అన్నట్లు సిగ్నల్స్‌ ఇస్తున్నారు. అయితే మొదటిసారి అధికారంలోకి వచ్చిన తరువాత బారీ నీటిపారుదలశాఖ మంత్రిగా కొనసాగిన హరీష్‌రావు, రెండోసారి ఏ మంత్రి పదవి లేకుండా మాజీగానే మిగిలిపోయారు. కీలకమైన ఎన్నికల్లో సైతం అంతగా ఆయనకు ప్రాధాన్యత కల్పించలేదు. దీంతో హరీష్‌ అనుచరుల్లో, అభిమానుల్లో ఆందోళన కలిగింది. నిర్ణయం ఏం తీసుకున్నా మేం కట్టుబడి ఉంటామని వారు నిర్ణయించుకున్నారట. కానీ ట్రబుల్‌షూటర్‌ మాత్రం ఎటువంటి తొందరపాటును ప్రదర్శించకుండా గురిచూసి కొడదాం, సమయం కోసం నిరీక్షిద్దాం అన్నట్లుగానే ఉన్నాడట.

ఇతర పార్టీల్లో జోరుగా చర్చ

హరీష్‌రావు టిఆర్‌ఎస్‌ పార్టీని వీడబోతున్నారనే చర్చ టిఆర్‌ఎస్‌ పార్టీలో కంటే ఇతర పార్టీల్లోనే జోరుగా కొనసాగుతుంది. మా పార్టీలోకి వస్తున్నాడంటే మా పార్టీలోకి అంటూ వారు తెగ సంబరపడి పోతున్నారట. ఇంకొందరైతే హరీష్‌రావు పార్టీ మారితే రాజకీయ సమీకరణలు మారుతాయని అప్పుడు టిఆర్‌ఎస్‌ పార్టీని అన్నిరకాలుగా ఎదుర్కొవడం అత్యంత సులభమని సంబరపడిపోతున్నారట. ఎమ్మెల్సీ, ఎంపీ ఎన్నికల్లో అధికార పార్టీ ఆశించినంతగా సీట్లను సాధించకపోవడం, ఆ ఎన్నికల్లో హరీష్‌రావుకు అధిష్టానం ప్రాదాన్యతను కల్పించకపోవడంతో ఫలితాలు అలా ఉన్నాయని, మరీ హరీష్‌ పార్టీకే దూరం అయితే టిఆర్‌ఎస్‌ చొక్కా బొర్లపడటం ఖాయమని ఎవరి విశ్లేషణలు వారు చేసుకుంటున్నారట. అయితే ఈ విశ్లేషణలన్ని 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందునుంచే జరుగుతున్న కాంగ్రెస్‌ బాహుబలి అంటూ పరోక్షంగా హరీష్‌పైనే ఆధారపడుతున్నాం అన్నట్లు ప్రకటనలు చేసినా లాభం లేకుండాపోయింది. దీంతో మామ, అల్లుళ్ల బంధం విడిపోదు అని కొందరు అనుకుంటుంటే ఇతరుల మనస్తత్వాలు తెలుసుకోవడానికే హరీష్‌ ద్వారా గులాబీ బాస్‌ మైండ్‌గేమ్‌ ఆడుతున్నాడని అది చూసి మనం చంకలు గుద్దుకోవాల్సిన అవసరం లేదని హరీష్‌ పార్టీని వీడేది లేదని ప్రాంతీయ పార్టీని ఏర్పాటు చేస్తాడు తప్ప ఇతర పార్టీల్లోకి మాత్రం వెళ్లడని కొందరు విపక్షనేతల విశ్లేషిస్తున్నారట.

అమిత్‌షాను హరీష్‌ కలిశాడు…?

గులాబీని వదిలి కమలాన్ని అందుకోవడానికి హరీష్‌రావు కేంద్ర మంత్రి అమిత్‌షాను కలిసినట్లు కొందరు లేదు, లేదు ఫోన్‌లో మాట్లాడుకున్నారని ఇంకొందరు తాజాగా ప్రచారం మొదలెట్టారు. గులాబీ గూటిని వదిలి కమలం గూటికి హరీష్‌రావు చేరుకోబోతున్నాడని రాజకీయవర్గాల్లో చర్చ జోరుగానే కొనసాగింది. దీంతో హరీష్‌రావు అనుచరులు, అభిమానుల్లో కొంత గందరగోళం ఏర్పడింది. అయితే ఈ వార్త రాజకీయవర్గాల్లో తప్ప ఎక్కడ అంతగా చక్కర్లు కొట్టలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంబ సమయంలో విజయోత్సవ కార్యక్రమాలలో పాల్గొన్న హరీష్‌ తనకు వేరే ఆలోచన లేదనే సంకేతాలు పంపారు. కానీ రాజకీయవర్గాల్లో మాత్రం హరీష్‌ పార్టీ మార్పుపై ప్రచారం బాగానే జరిగింది.

అనుచరుల్లో అసంతృప్తి

టిఆర్‌ఎస్‌ పార్టీలో హరీష్‌రావుకు అంతగా ప్రాధాన్యత లేకపోవడం, పక్కన పెడుతున్నట్లుగా క్యాడర్‌లోకి సంకేతాలు వెళ్తుండడంతో ఆయన అనుచరుల్లో అసంతృప్తి కలుగుతోంది. ఈ విషయమై వీరంతా హరీష్‌రావును ప్రశ్నిస్తే సమయం వచ్చేవరకు ఓపిక పట్టాలని సర్థిచెప్పినట్లు తెలుస్తోంది. పార్టీ మారే ప్రసక్తే లేదని మన భవితవ్యం ఏంటో ఇందులోనే తేల్చుకుందామని పరోక్షంగా హరీష్‌ అన్నట్లు సమాచారం. అవసరం అయితే మరో ప్రాంతీయ పార్టీకి తెరతీస్తాం తప్ప ఇతర పార్టీలోకి వెళ్లే అవకాశం లేదని కొందరు హరీష్‌ అనుచరులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఇటీవల కేసిఆర్‌ తమిళనాడు తరహా రాజకీయం అనగానే హరీష్‌ పార్టీ పెడతాడా అనే విషయం సైతం సోషల్‌మీడియాలో తెగ వైరల్‌ అయిపోతుంది. అవును నిజం రాజకీయాల్లో ఏదైనా జరగవచ్చు అని కొందరు రాజకీయ విశ్లేషకులు కామెంట్‌ చేస్తున్నారు. ఇదిఇలా ఉంటే ఎవరెన్ని ఊహగానాలు చేసినా ప్రయత్నాలు చేసినా ట్రబుల్‌షూటర్‌ మాత్రం రూటు మారే ప్రసక్తే లేనట్లు కనిపిస్తోంది.

జక్కలొద్దా…కేడలొద్దా..?

జక్కలొద్దా…కేడలొద్దా..?

అవును ఇది అక్షరాల నిజం. గ్రేటర్‌ వరంగల్‌ నగరంలోని ఓ కార్పొరేటర్‌ భర్త నగరశివారు ప్రాంతంలోని జక్కలొద్ది ప్రాంతాన్ని తాను కష్టపడి చెమటోడ్చి సంపాదించినట్లు తెగ బిల్డప్‌ చేస్తున్నాడు. ఎక్కరిదో భూమి మోసుకొచ్చి ఇక్కడ పెట్టినట్లు తాత, ముత్తాతల కాలం నుంచి ఆరుగాలం శ్రమించి భూమిని సంపాదించినట్లు ఆయనగారు కొడుతున్న ఫోజులు చూస్తుంటే ఎవరో వెనకాల ఉండి నడిపిస్తున్నట్లుగా అనిపిస్తోంది. భూముల గూర్చి ఇతగాడు చేసిన కబ్జాల గూర్చి ప్రస్తావిస్తే ఇతను అధిష్టానంపై విరుచుకుపడుతాడు. వారు చేయడం లేదా…? అని ఎదురు ప్రశ్నిస్తాడు. తిమ్మాపురం గ్రామశివారులో పేదదళితుడి భూమి ఆక్రమించిన ఇతడిని ‘నేటిధాత్రి’ ప్రశ్నించింది. అంతే అంత ఎత్తున లేచి నీతివాక్యాలు వల్లిస్తూ మధ్యమధ్యలో పరోక్షంగా హెచ్చరిస్తూ తాము ఒక గ్యాంగ్‌గా ఏర్పడి భూములు కబ్జా చేస్తున్నామని ఒప్పుకోకనే ఒప్పుకుంటూ, మరోవైపు ఎంతో కొంత చెల్లించి భూములు హస్తగతం చేసుకుంటున్నామని చెపుతూ అయోమయానికి గురి చేసే ప్రయత్నం చేశాడు. ఇది సరైంది కాదు కదా అని ప్రశ్నిస్తే టిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటిఆర్‌తో పోల్చుకుంటూ వారు ఎక్కడ కబ్జాలు చేయడం లేదా అంటూ సంబంధం లేని విషయాలను ప్రస్తావిస్తాడు. మొన్నటి వరకు టిఆర్‌ఎస్‌లో కొనసాగి ఇటీవలే పార్టీ మారి కాంగ్రెస్‌లోకి వెళ్లిన ఓ సీనియర్‌ నేత అనుచరుడిగా చెప్పుకునే ఇతను ఆ సీనియర్‌ నేత భూముల వ్యవహారం తమకెందుకని గమ్మున ఉన్న కార్పొరేటర్‌ భర్త మాత్రం తన కబ్జా పంథాను ఎంతమాత్రం వీడడం లేదు. ఇటీవల జక్కలొద్ది ప్రాంతంలో ఓ దళితుడికి సంబంధించిన భూమిని కబ్జా చేసిన కార్పొరేటర్‌ భర్త స్థానికులు భూమి ఎలా కబ్జా చేస్తారని నిలదీయడంతో ఆరులక్షల రూపాయల చెక్‌ అందజేసి అక్కడి నుంచి పలాయనం చిత్తగించాడట. ఇలా ఒకటి కాదు…రెండు కాదు…రెండువందల ఎకరాలకుపైగా భూమి ఇతని కబంధహస్తాల్లో చిక్కుకుని ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. సీలింగ్‌ భూములు, అసైన్డ్‌భూములు, దళితుల బూములు, ఎక్కడ పడితే అక్కడ కబ్జా చేసి కేవలం తెల్లకాగితంపై నాలుగు ముక్కలు రాయించి ఎవరితో సంతకం చేయించి పహాణీలు సృష్టించిన ఘనత ఇతగాడికే దక్కుతుందట. తిమ్మాపురం జక్కలొద్ది ప్రాంతాలలో ఎవరినడిగిన ఈయన పేరు చెప్తారు. కొందరు భూమిని కోల్పోయి…వారి భూమిలోనే వారు పరాయిగా మారిపోయి ఆవేదనతో, ఆక్రోశంతో బండభూతులు అందుకుంటారు, శాపనార్థాలు పెడతారు. మనం కేవలం పలకరిస్తే చాలు అయ్యా…నా భూమి నాకు అప్పగిస్తారా…అతనితో మాట్లాడతారా…? సగం అప్పగించిన చాలు మాట్లాడండయ్యా…? అంటూ బ్రతిమిలాడుతారు. ఈ ప్రాంతంలో ఇంత జరుగుతున్న రెవెన్యూ శాఖ కన్నెత్తి చూడదు సరికదా కబ్జాలోకి వెళ్లండి పహాణీలోకి ఎక్కిస్తాం…అంటూ ఉచిత సలహా ఇస్తారు అధికారులు. బలవంతుడితో ఢీకొన లేక, రెవెన్యూ, పోలీసుశాఖల సహకారం లేక రాత్రికి రాత్రే రికార్డులు 5 తారుమారు చేయించి తన పేరు వీలైతే బినామీ పేర్లు మరీ అవసరం అయితే తన కొడుకు పేరుతో రెవెన్యూ రికార్డులోకి ఎక్కి కబ్జా దర్పం ఒలకబోసే ఇతగాడిని తట్టుకోలేక భూమిని చూసి బతుకుతున్నారు తప్ప ఈ భూమి ఎప్పటికైనా తమ స్వంతం అవుతుందన్న ఆశను మాత్రం ఇక్కడి దళిత నిరుపేదలు ఎప్పుడో కొట్టేసుకున్నారు. విచిత్రం ఏంటంటే దళితుల భూములు కబ్జా అవుతుంటే తిరగబడి దళితులకు న్యాయం చేయాల్సిన దళిత నాయకులు కొంతమంది సైతం కార్పొరేటర్‌ భర్డకే సహకరిస్తుండటంతో దిక్కుతోచిన స్తితిలో ప్రస్తుతం దళితులున్నారు.

డివిజన్‌ సమస్యల పరిష్కారానికి కృషి – నగర మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు

వరంగల్‌ నగరంలోని 26వ డివిజన్‌ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వరంగల్‌ నగర మేయర్‌ గుండా ప్రకాష్‌రావు అన్నారు. మంగళవారం వరంగల్‌ నగర అభివద్ధిలో భాగంగా 26వ డివిజన్‌లో క్షేత్రస్థాయి పర్యటన చేసి శానిటేషన్‌, డ్రైనేజీ సమస్యలపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. నగర్‌ మేయర్‌తోపాటు బల్దియా కమీషనర్‌ ఎన్‌.రవికిరణ్‌, ఆరోగ్య అధికారి రాజారెడ్డి, బల్దియా వింగ్‌ అధికారులతో కలసి 26వ డివిజన్‌లోని ఇంతేజార్‌గంజ్‌ పోలీస్‌స్టేషన్‌ నుండి బట్టల బజార్‌, పాపయ్యపేట్‌ చమన్‌, కాకతీయ టాకీస్‌ వరకు పర్యటించారు. 26వ డివిజన్‌ పర్యటనలో సిసి రోడ్ల గుంతలను, డ్రైనేజీ సమస్యలను పరిశీలించారు. వర్షాకాలాన్ని దష్టిలో పెట్టుకుని డెంగ్యూ, మలేరియా వ్యాధుల నుండి ప్రజలు ఎలాంటి వ్యాధుల బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని బల్దియా అధికారులకు మేయర్‌ సూచించారు. గహ, భవన నిర్మాణాలు చేసుకునే నిర్వాహకులు రోడ్డుపై ఇసుక కుప్పలు పోయడం వల్ల డ్రైనేజీ కాలువ మూసుకుపోవడం, మురికినీరు రోడ్డుపై ప్రవహిస్తున్నందున పాదచారులు, వాహనదారులకు ఇబ్బందిగా మారడాన్ని గమనించిన మేయర్‌ వారిపై జరిమానా విధించాలని అధికారులను హెచ్చరించారు.

ఎన్నికల కోడ్‌ అమలులో ఉండటం వలన అభివద్ధి పనులు చేయలేకపోయామని చెప్పారు. ఇప్పటి నుండి ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మేయర్‌ అన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్‌ నాయకులు, కార్యకర్తలు, బల్దియా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

సమన్వయంతో పనిచేయాలి

సమన్వయంతో పనిచేయాలి

– సీపీ డాక్టర్‌ వి.రవీందర్‌

వరంగల్‌ ట్రైసిటి పరిధిలో ట్రాఫిక్‌ క్రమబద్దీకరణకు పోలీస్‌, మున్సిపల్‌ అధికారులు సమన్వయంతో పనిచేయాలని వరంగల్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ వి.రవీందర్‌ సూచించారు. వరంగల్‌ పోలీస్‌ అధ్యక్షతన నగరంలో ట్రాఫిక్‌ అభివద్దికోసం తీసుకోవాల్సిన చర్యలపై గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌, ఆర్‌ అండ్‌ బి అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని సోమవారం రాత్రి పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయంలో నిర్వహించారు. వరంగల్‌ ఆర్బన్‌ కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కమిషనర్‌ ఎన్‌.రవికిరణ్‌ హాజరయ్యారు. ఈ సమావేశంలో గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కమిషన్‌ పరిధిలో ట్రాఫిక్‌ రద్దీని నియంత్రించడంతోపాటు, రోడ్డు ప్రమాదాలను ఆరికట్టడం కోసం తీసుకోవాల్సిన అంశాలపై వరంగల్‌ కమిషనరేట్‌ ట్రాఫిక్‌ విభాగం చేసిన సూచనలపై పోలీస్‌ కమిషనర్‌, కలెక్టర్‌, గ్రేటర్‌ మున్సిపల్‌ కమిషనర్‌ అధికారులతో చర్చించారు. ఈ సమావేశంలో ట్రాఫిక్‌ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ జరిపి గుర్తించిన ట్రాఫిక్‌ సమస్యలపై ట్రాఫిక్‌ ఎసిపి మజీద్‌ పవర్‌ పాయింట్‌ ప్రజేంటేషన్‌ ద్వారా అధికారులకు వివరించారు. ఈ సందర్బంగా ప్రస్తుతం 12 ట్రాఫిక్‌ జంక్షన్లల్లో ఉన్న సిగ్నల్స్‌తోపాటు, మరో అదనంగా 13 జంక్షన్లలో సిగ్నల్స్‌ ఏర్పాటుకు కావల్సిన నిధులపై జిడబ్ల్యూఎంసి అధికారులు పోలీస్‌ అధికారులతో కలసి తగు ప్రణాళికను రూపొందించాల్సిందిగా కలెక్టర్‌ ఆదేశించారు. నగరంలో సిగ్నల్స్‌ మరమత్తులు, ముఖ్యమైన రోడ్డుమార్గాల్లో డివైడర్ల ఏర్పాటు, జంక్షన్లలో ఐలాండ్‌ మార్పులపై అధికారులకు వివరించారు. అవసరమైన ముఖ్యకూడళ్లల్లో రోడ్డు వెడల్పు, నగరంలో ముఖ్య సూచికబోర్డుల ఏర్పాటుతోపాటు, ముఖ్యమైన ప్రాంతాల్లో విఎంఎస్‌ సైన్‌బోర్డుల ఏర్పాటు చేయడంపై అధికారులను ఆదేశించారు. ట్రైసిటి పరిధిలోని అన్ని ప్రాంతాల్లో వాహనదారులకు కనిపించే విధంగా వేగం పరిమితి బోర్డులను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ అధికారుల దష్టికి తీసురావడంతోపాటు, అన్ని ట్రాఫిక్‌ జంక్షన్ల వద్ద స్టాప్‌లైన్స్‌తోపాటు జీబ్రా లైన్స్‌ రూపొందించాల్సిన అవసరం ఉందని పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు. ఈ సందర్భంగా పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ వి.రవీందర్‌ మాట్లాడుతూ వాహనదారులు ప్రయాణ సమయాన్ని తగ్గించడం, ట్రాఫిక్‌ నియంత్రణ కోసం ప్రస్తుతం అందుబాటులో ఉన్న టెక్నాలజీని వినియోగించుకోవడంతోపాటు, కొత్త ప్రణాళికను రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ వరంగల్‌ నగరంలో రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో పోలీస్‌ అధికారులతోపాటు, మనపై కూడా ఉందని అన్నారు. ముఖ్యంగా ట్రాఫిక్‌ కమిబద్దీకరణ కోసం ట్రాఫిక్‌ పోలీసుల సూచనలపై ఎప్పటికప్పుడు స్పందించాల్సి ఉంటుందని, ఇందుకోసం గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కమిషనరేట్‌, ట్రాఫిక్‌ పోలీస్‌ విభాగానికి నోడల్‌ అధికారిని నియమిస్తామని చెప్పారు. ఈ నోడల్‌ అధికారి ద్వారా ట్రాఫిక్‌ పోలీసులు సూచించే సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో వరంగల్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ అధికారులు, జిడబ్ల్యూఎంసి, ఆర్‌ అండ్‌ బి, నేషనల్‌ హైవే అధికారులు పాల్గోన్నారు.

ప్రొఫెసర్‌ సార్‌ కబ్జాపురాణం

ప్రొఫెసర్‌ సార్‌ కబ్జాపురాణం

ఆయన పిల్లలకు విద్యాబుద్దులు నేర్పే రిటైర్డు అయిన ప్రొఫెసర్‌. సమాజంలో బాద్యతాయుతమైన, గౌరప్రదమైన స్థానం కలిగినవాడు. చెడుమార్గంలో వెళుతున్న వారిని సరిదిద్ది సక్రమార్గంలో పంపించాల్సిన వాడు. కానీ ఇన్ని సంవత్సరాల ప్రొఫెసర్‌గిరి, అనుభవాన్ని, చదువు, తెలివితేటల సారానంతటిని రంగరించి కబ్జా పురాణానికి తెరలు తీశాడట. పదవివిరమణ జరిగాక చేతినిండా ఏదో పని ఉండాలి అనుకున్నాడో ఏమో తెలియదు కానీ తన ఇంటి పక్కనే ఉన్న స్థలంలో పాగావేసి కబ్జా పురాణాన్ని మహాజోరుగా నడిపిస్తున్నాడట. ఇంటి పక్కనే ఖాళీ జాగ కనపడటంతో తన ప్రొఫెసర్‌ తెలివినంతటిని ఉపయోగించి ఉన్న స్థలానికి ఖాళీ స్థలాన్ని జోడిస్తే విశాలమైన జాగ సొంతం అవుతుందని ఆలోచిస్తున్నాడట. దీంతో ఖాళీస్థలం యజమాని లబోదిబోమంటున్నారు. ప్రొఫెసర్‌ సార్‌ కబ్జా బుద్దితో తాము చుక్కలు చూస్తున్నామని, ఈ స్థలం నీది కాదు…మొర్రో అన్న ఎంత మాత్రం వినడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం…హన్మకొండ నగరంలోని వడ్డేపల్లి సమీపంలోని ఎక్సైజ్‌కాలనీలో సర్వే నెంబర్‌ 298/1లో కోటిచింతల కిరణ్‌కుమార్‌ అనే వ్యక్తి 2018 నవంబర్‌ నెలలో నల్లా ఇమ్మాన్యువల్‌ అనే అతని వద్ద నుండి 346గజాల స్థలాన్ని కొనుగోలు చేశాడు. కొనుగోలు చేయగానే ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నాడు. భూమిని కొనుగోలు చేసిన నంబరులో భూమి వద్దకు వెళ్లి పనులు చేయించడానికి ఉపక్రమించాడు. అంత రిటైర్డు ప్రొఫెసర్‌ రూపంలో ఓ అడ్డుపుల్ల తగిలింది. ఈ భూమి తనదంటూ కాకతీయ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌ పనిచేసి పదవివిరమణ పొందిన కె.కొండల్‌రెడ్డి నోటరీ పేపర్‌తో ఈ స్థలాన్ని తాను ఎప్పుడో కొనుగోలు చేశానని స్థలాన్ని కొనుగోలు చేసిన కిరణ్‌కుమార్‌ను బెదిరించడం మొదలుపెట్టాడు. దీంతో బాధితుడు కోర్టును ఆశ్రయించాడు. కోర్టు బాధితుడికి అనుకూలంగా ఇంజక్షన్‌ ఆర్డర్‌ ఇచ్చింది. దీంతోనయిన పని అవుతుందనుకుంటే అదీ కాలేదు. కిరణ్‌కుమార్‌ను సవాల్‌చేస్తూ కొండల్‌రెడ్డి కోర్టుకెక్కాడు. కోర్టు అక్కడ కూడా బాధితుడికే అనుకూలంగా తీర్పు చెప్పింది. ప్రొఫెసర్‌ తీరును తప్పుపట్టించి అయిన ప్రొఫెసర్‌ సార్‌ తన ప్రయత్నాలను మానుకోవడం లేదు. నయానో, భయానో బాధితుడిని తన దారికి తెచ్చుకోవాలని ప్రయత్నం చేశాడు. పైరవీకారులు ప్రజాసంఘాల నాయకులు, పార్టీ నాయకుల పేరుతో తిరిగేవారితో సెటిల్‌మెంట్‌కు దిగాడు. అయిన బాధితుడు ససేమిరా అన్నాడు. దీంతో ప్రొఫెసర్‌ సార్‌ కొంతమంది సెటిల్‌మెంట్‌ రాయిళ్ల సూచనలతో అది 298/1 సర్వే నెంబర్‌కాదని 294 సర్వే నెంబర్‌ అని కొత్త పల్లవి అందుకున్నాడు. పక్కా రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్‌తో 298/1 సర్వేనెంబర్‌లో పక్కా గృహాన్ని నిర్మించుకున్న ప్రొఫెసర్‌ సాబ్‌ తన ప్రహారీగోడ పక్కస్థలాన్ని 294 సర్వే నెంబర్‌ అంటూ కొత్త పల్లవి అందుకోవడంలోనే పక్కా కబ్జా బుద్ది బయటపడుతుందని బాధితుడు అంటున్నాడు. 298/1 సర్వే నెంబర్‌ ప్రొఫెసర్‌కు అతని స్థలాన్ని సంబంధించిన స్తలం డాక్యుమెంట్లు పక్కాగా ఉన్నాయని, తన స్థలం కూడా అదే సర్వే నెంబర్‌ కావడంతో ఇది నాది అంటున్నా ప్రొఫెసర్‌ను అప్పుడే రిజిస్ట్రేషన్‌ ఎందుకు చేయించుకోలేదు…? ఇంటి స్థలం కాగితాలు పక్కాగా ఉండి..ఖాళీస్తలం కాగితాలు లేకపోవడం ఏంటని ప్రశ్నిస్తారని కేవలం నోటరితో స్థలాన్ని కొనుగోలు చేసినట్లు నాటకం ఆడుతున్నాడని బాదితుడు కిరణ్‌కుమార్‌ ఆరోపించాడు. తన స్థలాన్ని అప్పనంగా స్వాధీనం చేసుకోవడానికే రిటైర్డు ప్రొఫెసర్‌ నోటరీతో తనను ఇబ్బందులు పాలుచేస్తున్నాడని కోర్టు తనకు అనుకూల తీర్పు చెప్పిన, సర్వేయర్‌ 298/1 సర్వేనెంబర్‌ భూమి ఇదేనని తేల్చిన వినడం లేదని అన్నాడు.

పట్టింపులేని తహశీల్దార్‌…?

298/1 సర్వేనెంబర్‌లో 346గజాల స్థల విషయంలో ఇంత వివాదం నడుస్తున్న హన్మకొండ తహశీల్దార్‌ మాత్రం పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలిసింది. సర్వే నెంబర్‌ విషయంలో ప్రొఫెసర్‌ కొండల్‌రెడ్డి కిరికిరి పెడుతుండగా సర్వేయర్‌ అది 298/1 సర్వే నెంబర్‌ అని తేల్చిన చర్యలు తీసుకోవడంలో తహశీల్దార్‌ వెనుకాడుతున్నట్లు సమాచారం. పంచనామా నిర్వహించాలని కోరిన ప్రొఫెసర్‌ సహకరించడం లేదనే సాకుతో నెలలు గడుస్తున్న తహశీల్దార్‌ కనీసం స్పందించడం లేదట. తహశీల్దార్‌ ప్రొఫెసర్‌తో కుమ్మక్కై బాదితుడు ప్రశ్నిస్తున్నప్పుడల్లా పొంతన లేని సమాధానాలు చెప్తున్నట్లు తెలుస్తోంది. తహశీల్దార్‌ పంచనామా నిర్వహించి నివేదిక సమర్పిస్తే స్థల వివాదం ముగుస్తుంది. కానీ తహశీల్దార్‌ అందుకు ఎంతమాత్రం పూనుకోవడం లేదని బాధితుడు కిరణ్‌కుమార్‌ అంటున్నారు. ఈ విషయంలో ఇద్దరి మధ్య ఉన్న తగదాను పరిష్కరించి, అది గొడవలకు దారితీయకుండా ఉండేందుకు పంచనామా నిర్వహించాలని స్థానిక పోలీస్‌ అధికారి తహశీల్దార్‌ను కోరిన నిర్లక్ష్యధోరణి తప్ప తహశీల్దార్‌ సమస్య పరిష్కారం చేసేందుకు సహకరించడం లేదని తెలుస్తోంది. ప్రొఫెసర్‌ కొండల్‌రెడ్డి పక్షాన ఉండేందుకు అతను యత్నిస్తున్నట్లు సమాచారం. ఇకనైన తహశీల్దార్‌ పంచనామా నిర్వహించి తమకు న్యాయం చేయాలని, ప్రొఫెసర్‌ పంచనామాకు సహకరించడం లేదనే సాకులు చెప్పవద్దని బాధితుడు కిరణ్‌కుమార్‌ కోరుతున్నాడు.

లోటస్‌ కాలనీలో మరో ఇద్దరు ప్రొఫెసర్ల భూబాగోతం

త్వరలో…

జర్నలిస్టుల అక్రిడేషన్ల దరఖాస్తు గడుపు పొడిగించాలి

జర్నలిస్టుల అక్రిడేషన్ల దరఖాస్తు గడుపు పొడిగించాలి

టియుడబ్ల్యుజె (ఐజెయు) డిమాండ్‌

ఈనెల 30వ తేదితో ముగియనున్న జర్నలిస్టుల అక్రిడేషన్‌ కార్డులు, బస్‌పాసుల గడుపును మరో ఆరు నెలల వరకు పొడిగించాలని టియుడబ్ల్యుజె ( ఐజెయు) వరంగల్‌ ఉమ్మడి జిల్లా కమిటీ అధ్యక్షులు తుమ్మ శ్రీధర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి కంకణాల సంతోష్‌ ప్రభుత్వాన్ని కోరారు. ఉమ్మడి రాష్ట్రంలో పోరాడి సాధించుకున్న జర్నలిస్టుల హక్కులు తెలంగాణ రాష్ట్రంలో టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం హరించివేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సమయంలో కేసిఆర్‌ జర్నలిస్టులందరికీ అక్రిడేషన్‌ కార్డులు ఇస్తామని అనేక సందర్బాలలో ఇచ్చాన హమీలను విస్మరించారని విమర్శించారు. రాష్ట్రంలో జర్నలిస్టుల సమస్యలు పరిష్కారమవుతాయని ఆశిస్తే నిరాశే ఎదురవుతుందని అన్నారు. సిఎం కేసిఆర్‌ కొత్త నిబందనలు సృష్టించి పత్రికలను, ఛానెల్స్‌లను ఎబిసిడి లుగా వర్గీకరించి జర్నలిస్టులకు అక్రిడేషన్లు అందరికీ అందని ద్రాక్షలగా చేస్తున్నారని అన్నారు. అన్‌లైన్‌ అక్రిడేషన్ల ప్రక్రియ ముగిసినందున ఐ అండ్‌ పిఆర్‌ శాఖ వెబ్‌సైట్‌ గత రెండు రోజులుగా సాంకేతిక కారణాలతో వెబ్‌సైట్‌ ఓపెన్‌ కాలేదని దీంతో అనేక మంది జర్నలిస్టులు అక్రిడేషన్‌ కార్డుల కోసం దరఖాస్తులు చేసుకోలేకపోయారని తెలిపారు. వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకునే విధానాన్ని విరమించుకోవాలని, పాత పద్దతిలోనే దరకాస్తు చేసుకునే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. వెంటనే ఉన్న అక్రిడేషన్స్‌, బస్‌పాసులను మరో ఆరు నెలలు పొడిగించాలని డిమాండ్‌ చేశారు.

సీఎం సార్‌…జరదేఖో..!

సీఎం సార్‌…జరదేఖో..!
ఆఖరి మజిలీకి…అంతులేని కష్టం
”మనిషి జీవితం అనేక మలుపులతో కొనసాగుతుంది. కష్ట సుఖాల మధ్య సాగే మనిషి జీవితంలో ఆఖరి మజిలీ కూడా అంతులేని కష్టంగా మారింది. చివరి అంకమైన మనిషి మరణం వారి కుటుంబాలకు బొందల గడ్డ రూపంలో మరింత ఇబ్బందులను తెలిచ్చిపెడుతుంది. మరణించిన తమ కుటుంబ సభ్యున్ని ఖననం చేయటానికి కూడా  స్మశానవాటికలు సరిగా లేకపోవటం, కొన్ని చోట్ల ఉన్నప్పటికీ సౌకర్యాలు లేకపోవటం పలు గ్రామాలలో తీరని సమస్యగా మారింది”.
వరంగల్‌ రూరల్‌ జిల్లా పరిధిలో శ్మాశానవాటికల దుస్థితిని మెరుగుపరిచేందుకు ప్రభుత్వం 2017సంవత్సరంలో దృష్టి సారించింది. ఇందుకు గాను వరంగల్‌ రూరల్‌ జిల్లాలో 126  స్మశానవాటికలను మంజూరు చేస్తూ 2017-18 బడ్జెట్‌లో నిధులు కూడా కేటాయించింది.  ఒక్కో శ్మాశానవాటిక నిర్మాణానికి రూ.10 లక్షల 13 వేల తో ఎలాంటి అసౌకర్యాలు లేకుండా పూర్తి స్థాయి సౌకర్యాలతో నిర్మించాలని సూచించింది. అయితే ఇందులో జిల్లాలోని 14 మండలాల్లో 121  స్మశానవాటికలను నిర్మించేందుకు రూ. 12 కోట్ల 76 లక్షల ప్రతిపాధనలకు అధికార యంత్రాంగం ప్రణాళికలను సిద్దం చేసింది. ఈ  స్మశానవాటికల నిర్మాణాలు ఈజీఎస్‌ పనుల కింద పూర్తి చేయాలని, ఇందులో గ్రామ పంచాయతీల పాత్ర, ఈజీఎస్‌ కూలీల పాత్ర వారికి సంబంధించిన ఖర్చుల వివరాలను బడ్జెట్‌ కేటాయింపుల్లో పేర్కొనటం జరిగింది. అయితే 2017-18 బడ్జెట్‌లోనే పూర్తి కావాల్సిన  స్మశానవాటికల నిర్మాణ పనులు మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అ్కడే అన్న చందంగా మారటం గమనార్హం.
పనులు ప్రారంభమైనవి 64 మాత్రమే…
జిల్లా పరిధిలో 121 స్మశానవాటికలు నిర్మించేందుకు ప్రతిపాధనలు రూపొందించినప్పటికీ నిర్మాణ పనుల్లో మాత్రం జాప్యం జరుగుంది. ఇప్పటి వరకు కేవలం 64 మాత్రమే నామమాత్రపు పనులు ప్రారంభమయ్యాయి. మిగిలిన 57  స్మశానవాటికల ఊసే లేకపోవటం గమనార్హం. ఇందులో పనులు మొదలు పెట్టిన వాటిలోనూ ఒక్కటి కూడా పూర్తి చేయకపోవటం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి.  స్మశానవాటికల పట్ల నిర్లక్ష్యనికి కారణాలు ఏమిటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. నిధులు సైతం పక్కదారి పడుతున్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  స్మశానవాటికల నిర్మాణ పనులు ప్రారంభించకపోవటం, కొన్నింట్లో నామమాత్రపు పనులు ప్రారంభించినప్పటికీ పూర్తి చేయకపోవటం పట్ల  గ్రామీణ ప్రాంత ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
స్మశానవాటికల్లో కల్పించాల్సిన సౌకర్యాలు…..
వరంగల్‌ రూరల్‌ జిల్లా పరిధిలో 126  స్మశానవాటికల నిర్మాణానికి ప్రభుత్వం మంజూరు చేయగా, జిల్లా యంత్రాంగం ఒక్కో శ్మాశానవాటిక నిర్మాణానికి  రూ. 10 లక్షల 13 వేల ప్రతిపాధనలు రూపొందించి జిల్లా వ్యాప్తంగా రూ.12 కోట్ల 17 లక్షల ప్రతిపాధనలు పంపింది. దీని ప్రకారం ప్రతి స్మశానవాటికలో అంత్యక్రియలు జరుపుకోవటానికి కావాల్సిన సౌకర్యాలు కల్పిస్తూ నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. అంత్యక్రియలకు రెండు ప్లాట్‌ఫామ్‌లు, ఒక్క ఆఫీసు రూం, ఓపెన్‌హాల్‌, మహిళలు, పురుషులు స్నానం చేయటానికి విడివిడిగా స్నానపు గదులు, సిమెంట్‌ గెద్దె ఒకటి, శ్మాశాన వాటిక స్థలం చుట్టూ పెన్సింగ్‌, ముఖద్వారం వద్ద కమాన్‌, గేటు, ముఖ్యంగా కరెంట్‌ నీటి సౌకర్యాలు కల్పించాలి . అవసరమైతే  నీటి సౌకర్యం కోసం బోర్‌ వేయాలి. స్మశానవాటికల నిర్మాణ పనుల్లో వీటన్నింటినీ నిర్మించాల్సిన అవసరం ప్రతిపాధనల్లో రూపొందించినప్పటికీ అందుకనుగుణమైన పనులు జరుగకపోవటం గమనార్హం.
జిల్లాలో ప్రతిపాధించిన స్మశానవాటికలు – వివరాలు
    మండలం     -మంజూరైనవి      – మొదలైనవి                 – పూర్తికానివి      – పూర్తి అయినవి
1. వర్థన్నపే     –      9                   6                      3                           0
2. పర్వతగిరి    –      6                   3                       3                          0
3. రాయపర్తి     –     15                  2                      13                         0
4. సంగెం        –    13                   9                       4                          0
5. నెక్కొండ    –     11                   6                       5                           0
6. నర్సంపేట    –      9                   6                       5                          0
7. నల్లబెల్లి      –    1                      1                       0                         0
8. ఖానాపూర    –   2                      0                        2                        0
9. చెన్నారావుపేట     8                      3                      5                         0
10. దుగ్గొండి           14                   5                       9                         0
11. శాయంపేట          2                   2                       0                         0
12. గీసుగొండ             9                  7                       2                         0
13. ఆత్మకూర్‌           11                  7                      4                          0
14. పరకాల            11                   10                    1                          0
పై వివరాల ప్రకారం జిల్లాలోని స్మశాన వాటికల పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిందనేది గమనార్హం. ఇప్పటికైనా అధికారులు, ప్రజా పత్రినిధులు ప్రత్యేక దృష్టి సారించాలని, ఆయా గ్రామాల్లోని గ్రామపంచాయతీ పాలకవర్గాలు యుద్ద ప్రతిపాధికన నిర్మాణ పనులకు చర్యలు చేపట్టాల్సిన అవసరముందని ప్రజలు కోరుతున్నారు.

నవ్విపోదురు గాక మాకేమి సిగ్గు…!

నవ్విపోదురు గాక మాకేమి సిగ్గు…!
”నవ్వి పోదురు గాక మాకేమి సిగ్గు” అన్న చందంగా గ్రేటర్‌ వరంగల్‌ నగర కార్పొరేటర్లు వ్యవహరిస్తున్నారు. శనివారం అంతర్గత సమావేశం పేరుతో నిర్వహించిన గ్రేటర్‌ వరంగల్‌ నగర పాలక వర్గం సమావేశంలో కొంత మంది  కార్పొరేటర్ల భర్తలు సైతం దర్బాజగా హాజరయ్యారు. సమావేశ ప్రోటోకాల్‌ కాగితాలకే పరిమితమైంది. సమావేశానికి ఎవరు హాజరవుతున్నారో తెలియని పరిస్థితి దాపురించింది. మహిళా కార్పొరేటర్లతో పాటు వారి భర్తలు సైతం సమావేశానికి హాజరు కావటంతో సమావేశం కలెగూరగంపగా మారింది. సమావేశానికి హాజరు కావాల్సిన నగర మేయర్‌ డుమ్మాకొట్టి ఓ ప్రయివేటు విద్యాసంస్థ తాళ్ళపద్మావతి ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ప్రారంభ కార్యక్రమానికి వెళ్లారు. నగర మేయర్‌, తూర్పు ఎమ్మెల్యే, కమిషనర్‌ తూర్పు కార్పొరేటర్లు, అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో నగర మేయర్‌ లేకపోవటం విమర్శలకు తావిస్తోంది. సమావేశంలో మహిళా కార్పొరేటర్లతో పాటు వారి భర్తలు దర్జాగా హాజరై హవా సాగించటం, పార్టీ కా ర్యకర్తలు సమావేశానికి హాజరవ్వటాన్ని తూర్పు ఎమ్మెల్యే అభ్యంతరం చెప్పకపోవటం కమిషనర్‌ కూడా నోరు మెదుపకపోవటం గమనార్హం.
సమావేశానికి దర్జాగా హాజరైన మహిళా కార్పొరేటర్ల భర్తలు…
కీలక సమావేశంగా చెప్తున్న నగర పాలకవర్గం సమావేశానికి మహిళా కార్పొరేటరైన 7 డివిజన్‌ కార్పొరేటర్‌ కెడల నద్మ భర్త కెడల జనార్తన్‌, 15వ డివిజన్‌ కార్పొరేటర్‌ శారదజోషి భర్త సురేష్‌ జోషి, 21వ డివిజన్‌ కార్పొరేటర్‌ మేడిది రజిత భర్త మదుసుదన్‌, 22వ డివిజన్‌ కార్పొరేటర్‌ మరుపల్లి భాగ్యలక్ష్మి భర్త మరుపల్లి రవి సమావేశానికి హాజరై దర్జాగా ముందువరుసలోనే కూర్చోని ” నవ్విపోదురు గాక మాకేమి సిగ్గు” అన్నట్లుగా వ్యవహరించటం చర్చానీయాంశంగా మారింది. గతంలోనూ పలు సమావేశాలకు సతులతో పాటు పతులు హాజరై హవా సాగించిన పరిస్థితి ఉందని వీరు ఇక మారే పరిస్థితి లేదని పలువురు చర్చించుకోవటం గమనార్హం. అధికారులు అడ్డుచెప్పకపోవటమే ఇందుకు కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి.

బొందలగడ్డకు ఎసరు…?

బొందలగడ్డకు ఎసరు…?

వరంగల్‌ నగర శివారు ప్రాంతమైన పైడిపల్లి గ్రామ బొందల గడ్డకు ఎసరోస్తోంది. యధేచ్ఛగా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు వెంచర్లు వేయటానికి సిద్దపడుతున్నారు. చుట్టపక్కల ప్రాంతాల్లోని చెరువుల్లోని మట్టిని, ప్రభుత్వ భూముల్లోని మొరాన్ని తవ్వి వ్యాపారం చేస్తున్నారు. పనిలో పనిగా స్మశాన వాటికలోనూ వెంచర్‌ వేయటానికి మొరాన్ని తరలించేందుకు సిద్దపడటం, స్మశానంలోని గోరీని ద్వంసం చేయటం చర్చానీయాంశంగా మారింది. మట్టి, మొరం దందాతో పాటు స్మశానవాటికను ఫలహారంగా మార్చుకునేందుకు ‘తిలాపాపం తలా పడికెడు’ అన్న చందంగా ఇదంతా స్థానిక ప్రజాప్రతినిధుల అండతోనే జరుగుతుందనేది బహిరంగ రహస్యంగా మారింది. రియల్‌ వ్యాపారులు యధేచ్ఛగా మట్టి, మొరం తవ్వకాలు చేస్తూ , స్మశానవాటికను ఫలహారంగా మార్చుకునేందుకు సిద్దపడుతున్నప్పటికీ సంబంధిత అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు నోరు మెదుపకపోవటానికి కారణమేంటనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు కుమ్మకై ప్రభుత్వ భూముల్లోని మొరం, చెరువుల్లోని మట్టితో వ్యాపారం చేస్తున్నారని, చివరికి స్మశానాలను కూడా వదలటం లేదని స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. అయితే స్మశానవాటికను వెంచర్‌ గా మాచ్చేందుకు అందులోని గోరీని ద్వంసం చేసిన ఆనవాల్లు కనిపిస్తున్నప్పటికీ పైడిపల్లి గ్రామ శివారులో మట్టి, మొరం దందాపై తమకేమీ తెలియదన్నట్లుగా 1వ డివిజన్‌ కార్పొరేటర్‌ వాఖ్యానిస్తున్నట్లు సోషల్‌ మీడియాలో చక్కర్లుకొట్టడం చర్చానీయాంశంగా మారింది. ఇప్పటికైనా అధికారులు తగు చర్యలు చేపతమ చిత్తశుద్దిని నిరూపించుకోవాల్సిన అవసరముంది.

ఆచార్యా…ఇదేం రీతి…!

ఆచార్యా…ఇదేం రీతి…!

ప్రొఫెసర్‌ కబ్జా బుద్ది

ఇంటి పక్క స్థలంపై కన్నేసిన రిటైర్డు ప్రొఫెసర్‌

తన స్థలంలో కలుపుకోవాలని అత్యాశ

నోటరి డాక్యుమెంట్‌ సృష్టించి స్థల యజమానికి చుక్కలు చూపిస్తున్నాడు

కోర్టు ఇంజక్షన్‌ ఆర్డర్‌ ఉన్నా లెక్కచేయని వైనం

సర్వే నెంబర్‌ విషయంలో కిరికిరి…లెక్క తేలుద్దాం రమ్మంటే ససేమిరా…

సర్వేయర్‌ వస్తే సహకరించడు…పంచనామాకు ఒప్పుకోడు

ప్రొఫెసర్‌ తీరుతో పరేషాన్‌ అవుతున్న స్థల యజమాని…లక్షలు పోసి కొన్న స్థల వివాదంతో దిక్కుతోచక దిగాలు

కబ్జాకథలు

సోమవారం నుంచి…

లింగయ్యా..ఉల్లంఘనేందయ్యా…?

లింగయ్యా..ఉల్లంఘనేందయ్యా…?

వరంగల్‌ అర్బన్‌జిల్లా ఇంటర్మీడియట్‌ కార్యాలయంలో అమర్చిన సీసీ కెమెరాలను మార్చి నుండి ఏఫ్రిల్‌ వరకు ఎందుకు బందు చేశారో నేటి వరకు ఆ విషయంపై ఇంటర్మీడియట్‌ డిఐఈవో లింగయ్య వివరణ ఇవ్వకపోవడంతో సీసీ కెమెరాలను బందు చేయాల్సిన అవసరం ఏం వచ్చింది! ఏదేని అవినీతికి పాల్పడాలనుకున్నప్పుడు ఆ కెమెరాలు అడ్డొచ్చాయా? పేపర్‌ వాల్యుయేషన్‌ క్యాంపులో జరిగిన అవినీతికి సంబందించిన బిల్లులు చేసేటప్పుడు కాని, డబ్బులు పంచుకునేటప్పుడు కాని కెమెరాలల్లో దొరికి పోతామనుకున్నారా? ఇంటర్‌ బోర్డు కమీషనర్‌ అనుమతి లేకున్నా డిఐఆవో లింగయ్య ప్రైవేటుగా తన వ్యక్తిగతంగా పెట్టుకున్న నైట్‌వాచ్‌మెన్‌ బండారం బయటపడుతుందని బంద్‌చేశారా? డిఐఈవోను ఎవరైనా ప్రైవేటుగా కలువడానికి వస్తున్న వ్యక్తులు కెమెరాల్లో రికార్డు కావొద్దన్న ఉద్దేశ్యంతో బంద్‌ చేశారా?.. అనేక ప్రశ్నలు, అనేక అనుమానాలు….! ఏ ఉద్దేశ్యంతో బంద్‌ చేశారో నేటికి చర్చనీయాంశంగానే సీసీ కెమెరాల బంద్‌ విషయం సస్పెన్స్‌గా మిగిలిపోయింది.

-ఆర్టీఐ చట్టమంటే అంత చులకనా…?

కార్యాలయంలో సీసీ కెమెరాలు నెలరోజులకుపైగా ఎందుకు బంద్‌ చేయాల్సి వచ్చిందో వివరణ కావాలని సమాచార హక్కు చట్టం-2005 ప్రకారం ఇంటర్మీడియట్‌ డిఐఈవో లింగయ్యకు ధరఖాస్తు ద్వారా కోరి 30రోజులు దాటుతున్నా నేటి వరకు సమాచారం ఇవ్వలేదు. ఆర్టీఐ చట్టం ప్రకారం ఏదేని ప్రభుత్వ కార్యాలయంలో సమాచారం కొరకు ఆర్టీఐ ద్వారా దరఖాస్తు ఇస్తే, సమాచార అధికారి క్లాస్‌ (6) ప్రకారం 30రోజుల్లో సమాచారం ఇవ్వాలని ఆర్టీఐ చట్టం చెబుతున్నది. సీసీ కెమరాలను ఎందుకు బంద్‌ చేశారో సమాచారం కావాలని ఆర్టీఐ ద్వారా కార్యాలయంలో కోరి 30రోజులు దాటుతున్నా నేటివరకు ఇవ్వకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారో అర్ధం కాని పరిస్థితి. డిఐఈవోకు ఆర్టీఐ చట్టమంటే గౌరవం లేదా? సమాచారం ఇస్తే తమ బండారం బయటపడుతుందని ఇవ్వటం లేదా? అన్న ప్రశ్న దరఖాస్తు దారుడిని వేదిస్తున్న ప్రశ్న. ఇప్పటికైనా స్పందించి సమాచారం ఇవ్వాలని లేని యెడల సమాచార హక్కు చట్టం కమీషనరేట్‌కు ఫిర్యాదు చేస్తానని అంటున్నారు.

 పోలీస్‌స్టేషన్‌ ముట్టడి

పోలీస్‌స్టేషన్‌ ముట్టడి

చిన్నారి శ్రీహితపై అత్యాచారం చేసిన నిందితుడిని బహిరంగంగా ఉరితీయాలని డిమాండ్‌ చేస్తూ చిన్నారి బంధువులు, మహిళలు, వివిధ సంఘాల కార్యకర్తలు హన్మకొండ పోలీస్‌స్టేషన్‌ను ముట్టడించారు. మృతదేహంతో పోలీస్‌స్టేషన్‌ ముందు బైఠాయించి ఆందోళన నిర్వహించారు. ఆందోళనతో హన్మకొండ పరిసర ప్రాంతాలు దద్దరిల్లిపోయాయి. హన్మకొండ చౌరస్తా ప్రాంతం నుంచి పబ్లిక్‌గార్డెన్‌ వరకు ట్రాఫిక్‌ పూర్తిగా స్తంభించింది. రంగంలోకి దిగిన పోలీసులు ట్రాఫిక్‌ను దారి మళ్లించే ప్రయత్నం చేయగా హన్మకొండలోని దాదాపు అన్ని ప్రాంతాలు వాహనాలతో నిండిపోయాయి. ట్రాఫిక్‌ను కంట్రోల్‌ చేయడం పోలీసులకు తలనొప్పిగా మారింది. ఇదిలా ఉంటే అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని తమకు అప్పగిస్తే తామే బహిరంగంగా శిక్షిస్తామని కొంతమంది మహిళా సంఘం నాయకులు పోలీసులను డిమాండ్‌ చేశారు. దీంతో పోలీస్‌స్టేషన్‌ వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇదిలా ఉండగా చిన్నారి మృతదేహాన్ని చేతులతో ఎత్తుకుని పోలీస్‌స్టేషన్‌ ముందు ధర్నా చేస్తున్న చిన్నారి తల్లిదండ్రులను చూసి పలువురు కంట తడిపెట్టారు. తొమ్మిదినెలల చిన్నారిని చిదిమేయడానికి మనసేలా వచ్చిందంటూ కొందరు నిందితుడిని శాపనార్థాలు పెట్టారు.

ఆ ముగ్గురు కార్పొరేటర్ల అరెస్టుకు రంగం సిద్ధం….?

ఆ ముగ్గురు కార్పొరేటర్ల అరెస్టుకు రంగం సిద్ధం….?

భూకబ్జాలో దర్జా వెలగబెడదామనుకుంటే ఆ ముగ్గురు కార్పొరేటర్లకు గొంతులో పచ్చి వెలక్కాయ పడ్డట్లు అయ్యిందట. అధికార పార్టీ కార్పొరేటర్‌లం మాకు ఎవరు అడ్డు కల్లకు పొరలు కమ్మి కార్పొరేషన్‌ సిబ్బందిని, మహిళా అధికారిని నానా దూర్బాషలాడి కబ్జాను సమర్థించే పనిచేసి, ఎమ్మెల్యే మనుషులమని చెప్పి ఆయన ప్రమేయం లేకున్నా పేరును వాడుకుని కాంప్లెక్స్‌ నిర్మాణానికి పూనుకున్న ఆ ముగ్గురికి పోలీసులు త్వరలోనే చెక్‌ పెట్టబోతున్నట్లు తెలిసింది. భూవివాదం కోర్టులో ఉండగా అవేం పట్టించుకోకుండా అనుమతులు రాకున్న భవన నిర్మాణానికి పూనుకున్న వీరికి త్వరలోనే అరదండాలు తప్పవని తెలిసింది.

అరెస్ట్‌కు రంగం సిద్దం…?

హన్మకొండ చౌరస్తాకు అతి సమీపంలో కాకాజి వారసులకు చెందిన కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని కబ్జా చేసి అక్రమంగా నిర్మాణం కొనసాగిస్తున్న ముగ్గురు కార్పొరేటర్ల అరెస్ట్‌కు రంగం సిద్దం అయినట్లు విశ్వసనీయ సమాచారం. మూడునెలల క్రితం ఈ కార్పొరేటర్లు చేస్తున్న కబ్జా తతంగంపై ‘నేటిధాత్రి’ ఓ కథనాన్ని వెలువరించింది. అడ్డు, అదుపు లేకుండా కార్పొరేటర్ల విచ్చలవిడితనాన్ని ప్రశ్నించింది. పదవి రాగానే జనం కంటికి పురుగుల్లా కనపడితే ఏంచేసిన చెల్లుతుందనే వారి గర్వాన్ని నిలదీసింది. ఈ నేపథ్యంలో పోలీస్‌శాఖ రంగంలోకి దిగి ఇంటలిజెన్స్‌ విచారణను పూర్తిచేసి అది పక్కా కబ్జా పర్వమేనని తేల్చినట్లు సమాచారం. కబ్జాకు పాల్పడిన ఆ ముగ్గురు కార్పొరేటర్లను త్వరలోనే అరెస్ట్‌ చేయనున్నారని తెలుస్తోంది.

అధిష్టానం సీరియస్‌…?

ఓ వైపు కార్పొరేషన్‌ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ…అవినీతికి అసలు అస్కారం ఉండకూడదన్న ముఖ్యమంత్రి ఆదేశాలు దీంతో హన్మకొండలో ఆ ముగ్గురు కార్పొరేటర్లు చేసిన కబ్జాపై అధిష్టానం సీరియస్‌ అయినట్లు తెలిసింది. పార్టీకి, ప్రభుత్వానికి అప్రతిష్టపాలు చేసే పని ఎవరు చేసిన సహించేది లేదని ముగ్గురు కార్పొరేటర్ల అరెస్ట్‌తో సంకేతాలు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

అరెస్ట్‌ కాకుండా పైరవీలు…?

అక్రమ కబ్జాకు పాల్పడి అడ్డంగా బుక్కైన ఆ ముగ్గురు కార్పొరేటర్లు అరెస్ట్‌ కాకుండా ఉండేందుకు పైరవీల బాట పట్టినట్లు తెలిసింది. మరో నాలుగైదు రోజుల్లో పోలీసులు వీరిని అరెస్ట్‌ చేయడానికి సిద్దం అవుతుండగా అదికార పార్టీలో తమకు తెలిసిన పెద్దల సహయాన్ని కోరి అరెస్ట్‌ కాకుండా చూడాలని వేడుకుంటున్నట్లు తెలిసింది. అయితే ఈ విషయంలో అధిష్టానం సీరియస్‌గా ఉండడం, అరెస్ట్‌కు అంఆ సిద్దం కావడంతో తమ వల్ల కాదని చేతులెత్తేసినట్లు సమాచారం.

పసిమొగ్గను…చిదిమేశాడు

పసిమొగ్గను…చిదిమేశాడు

హన్మకొండ నగరంలోని టైలర్‌స్ట్రీట్‌ పాలజెండా ప్రాంతంలో దారుణం జరిగింది. తొమ్మిది నెలల పసికందుపై ఓ కామాంధుడు సభ్యసమాజం తలదించుకునేలా ముక్కుపచ్చలారని తొమ్మిదినెలల పసికందు పాపపై అత్యాచారయత్నానికి పాల్పడి హత్య చేశాడు. ప్రతి ఒక్కరి హృదయాలను కలిచివేసే ఈ సంఘటన బుధవారం నగరంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే… జక్కోజు జగన్‌-రచన దంపతుల కుమార్తె శ్రిత (9నెలలు)తో తమ ఇంటి బంగ్లాపై నిద్రించారు. తెల్లవారుజామున సుమారు 4గంటల సమయంలో కొలేపాక ప్రవీణ్‌ (28) అనే వ్యక్తి వారు నిద్రిస్తున్న బిల్డింగ్‌పైకి వెళ్లి పాపను తీసుకువెళ్లి అత్యాచారయత్నానికి పాల్పడి హత్య చేశాడు. తల్లిదండ్రులు నిద్రలోంచి మేల్కోని చూసేసరికి పాప కనిపించకపోవడంతో వెతకడం ప్రారంభించారు. బంగ్లాపై పక్కనే స్పృహతప్పి రక్తస్రావంతో తమ కుమార్తె కనిపించడంతో గుండెలవిసేలా బోరునవిలపిస్తూ పాపను చేతుల్లోకి తీసుకుని పరిశీలించగా తీవ్ర రక్తస్రావం అవుతుండటంతో హుటాహుటిన హన్మకొండ మ్యాక్స్‌కేర్‌ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. వైద్యులు పాపను పరీక్షించి అప్పటికే మరణించిందని వైద్యులు నిర్థారించడంతో ఆ తల్లిదండ్రుల రోదనకు అంతే లేకుండాపోయింది. ఆసుపత్రి ఆవరణలో వారు రోదిస్తున్న తీరును చూసి ప్రతి ఒక్కరు కన్నీరుమున్నీరయ్యారు. మానవజాతికే మచ్చ తెచ్చిన ఆ కామాంధుడిని నిందిస్తూ శాపనార్థాలు పెడుతూ శోకసముద్రంలో మునిగితేలారు. పాప తల్లిదండ్రులు పాపను తమ చేతుల్లోకి తీసుకుని ఏడుస్తున్న దృశ్యం ప్రతి ఒక్కరిని కంటనీరు పెట్టించింది.

నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

తొమ్మిదినెలల పాపపై అత్యాచారయత్నానికి పాల్పడిన నిందితుడు కొలేపాక ప్రవీణ్‌ (24)ను స్థానికులు పట్టుకుని చితకబాది, పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని ప్రవీణ్‌ను పోలీసులు అరెస్టు చేసి కస్టడీలోకి తీసుకున్నారు. నిందితుడు దామెర మండలానికి చెందినవాడని పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. అనంతరం పాప మృతదేహాన్ని వరంగల్‌ ఎంజిఎం ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఎంజీఎం మార్చురీ వద్ద పాప తల్లితండ్రులు, బంధువుల రోదనలు మిన్నంటాయి.

నిందితుడిని కఠినంగా శిక్షించాలి

ముక్కుపచ్చలారని తొమ్మిదినెలల పసికందుపై అత్యాచారయత్నం, హత్య చేసిన కామాంధుడిని కఠినంగా శిక్షించాలని వివిధ విద్యార్థి, మహిళా, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ భవనం కూడలిలో పెద్దఎత్తున రాస్తారోకో ధర్నా నిర్వహించారు. సంఘాల నాయకులు రాస్తారోకో నిర్వహించడం వల్ల సుమారుగా గంటపాటు ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు రంగప్రవేశం చేసి ధర్నా చేస్తున్న వారిని విరమింపజేశారు. అనంతరం వివిధ సంఘాల బాధ్యులు మాట్లాడుతూ కామంతో కళ్లు మూసుకుని ఈ అఘాయిత్యానికి పాల్పడిన ప్రవీణ్‌ను ఉరితీయాలని కొందరు, శిక్షించాలని మరికొందరు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

నిందితుడిపై కేసులు నమోదు చేశాం

– సీపీ డాక్టర్‌ వి.రవీందర్‌

ఈ సంఘటనకు సంబంధించి మరణించిన చిన్నారి శ్రీహిత మామయ్య హన్మకోండ పోలీస్‌స్టేషన్‌లో ఇచ్చిన ఫిర్యాదు అధారంగా నిందితుడు ప్రవీణ్‌ను అరెస్టుచేసి సెక్షన్‌ 366, 302, 376ఎ, 376ఎబి, 379 ఐ.పి.సి సెక్షన్లతోపాటు 5(యం) రెడ్‌ విత్‌ 6 ఆఫ్‌ పోక్సో యాక్ట్‌ 2012 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లుగా పోలీస్‌ కమిషనర్‌ తెలిపారు.

కఠినచర్యలు తీసుకోండి

– దారుణంపై పోలీసులకు మంత్రి ఎర్రబెల్లి ఆదేశం

హన్మకొండలో చిన్నారిపై దారుణం జరిగిన ఘటనపై పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తీవ్రంగా స్పందించారు. ఈ విషయంలో కఠినచర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు.

అధికారుల వాహన ‘మాయ’

అధికారుల వాహన ‘మాయ’

– అధికారిక వాహనాలలో వారిదే ఇష్టారాజ్యం

– బిల్లు చెల్లించేది ఓ వాహనానికి, తిరిగేది మరో వాహనం

– బినామీ పేరుతో వేలు దండుకుంటున్న ఓ జిల్లాస్థాయి అధికారి

– తిరిగేది సొంతకారులో…వాహన బిల్లు బినామీ ఖాతాలోకి…

– మహబూబాబాద్‌ జిల్లాలో ఆ అధికారి రూటే సపరేటు

అధికారిక వాహనాల విషయంలో అధికారులు మాయ చేస్తున్నారు. అందినకాడికి దండుకోవాలన్న ఆలోచనతో తమ అతితెలివికి పదునుపెట్టి బినామీ పేర్లతో పని కనిస్తున్నారు. అధికారులు వాడే వాహనాల విషయంలో నిరుద్యోగులకు అవకాశం ఇచ్చి వారికే నెలనెల కిరాయి చెల్లించాలన్న నిబంధనకు తూట్టు పొడుస్తున్నారు. తమ సొంత కార్లలో తిరిగుతూ బినామీ పేర్లతో నెలనెల కిరాయి దండుకుంటూ అవినీతికి తలుపులు బార్ల తెరిచారు. మహబూబాబాద్‌ జిల్లాలో ఓ జిల్లాస్థాయి అధికారి తన భార్య పేరిట ఉన్న కారులో తిరుగుతూ డబ్బులు దండుకోవడానికి మాత్రం బినామీ పేరు చెప్పి నెలనెలా వేల రూపాయలు తన ఖాతాలో వేసుకుంటున్నాడు.

ఎవరా అధికారి…ఏమా కథ త్వరలో…

హసన్‌పర్తి పీఎస్‌ను సందర్శించిన హోంమంత్రి

హసన్‌పర్తి పీఎస్‌ను సందర్శించిన హోంమంత్రి

హసన్‌పర్తి పోలీస్‌స్టేషన్‌ను తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి మహమూద్‌ అలీ శనివారం సందర్శించారు. స్మార్ట్‌ సిటీ పోలీస్‌స్టేషన్ల సందర్శనలో భాగంగా శనివారం హసన్‌పర్తి పోలీస్‌స్టేషన్‌కు హోంమంత్రి వచ్చారు. పోలీస్‌స్టేషన్‌లోని రికార్డులు, ఉద్యోగుల పనితీరును ఆయన పర్యవేక్షించారు. స్టేషన్‌లోని సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హసన్‌పర్తి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో క్రైం రేట్‌ 90శాతం మేర తగ్గినందుకు ఉద్యోగులను అభినందించారు. పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో మొక్కలను నాటారు. ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకునేలా చూడాలని సీఐకు సూచించారు. సీఎం కేసిఆర్‌ ప్రవేశపెట్టిన ఫ్రెండ్లీ పోలీసింగ్‌ పనితీరు బాగుందని ప్రశంసించారు. ఇంకా బాగా కృషి చేసి తెలంగాణ రాష్ట్రంలో క్రైం రేట్‌ను పూర్తిగా తగ్గించాలని అన్నారు. నిత్యం 3.50లక్షల సీసీ కెమెరాల నిఘాలో హైదరాబాద్‌ నగరం ఉందని, దీంతో హైదరాబాద్‌లో కూడా క్రైం రేట్‌ చాలా తగ్గిందని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకున్న సీసీ కెమెరాలు నిందితులను పట్టుకునేందుకు సహకరిస్తున్నాయని అన్నారు. తెలంగాణలో 10500 పోలీసు నియామకాలు జరిగాయని, మరిన్ని ఖాళీలను భర్తీ చేసేందుకు ప్రభుత్వం యోచిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వర్థన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌, వరంగల్‌ నగర పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ వి.రవీందర్‌, వరంగల్‌ ఈస్ట్‌జోన్‌ డీసీపీ కె.ఆర్‌.నాగరాజు, కాజీపేట ఏసీపీ నర్సింగరావు, ఎంపీ పసునూరి దయాకర్‌, వరంగల్‌ మేయర్‌ గుండా ప్రకాష్‌, హసన్‌పర్తి సీఐ పుప్పాల తిరుమల్‌, ఎస్సైలు సుధాకర్‌, రవీందర్‌, రాహుల్‌ గైక్వార్‌, కానిస్టేబుళ్లు నర్సయ్య, నాగేశ్వర్‌రావు, భాస్కర్‌, రాజసమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

చేపల వేటకు వెళితే మొసలి దాడి

చేపల వేటకు వెళితే మొసలి దాడి

చేపల వేటకు వెళ్లిన ఒకరిపై మొసలి దాడి చేయగా ప్రాణాలతో బయటపడ్డాడు ఒక వ్యక్తి. వివరాలలోకి వెళితే… నర్సంపేట మండలం గురిజాల గ్రామానికి చెందిన కొలువుల యాకయ్య అనే వ్యక్తి శనివారం ఖానాపురం మండలంలోని పాకాల సరస్సులో చేపలవేటకు వెళ్లాడు. సరస్సులో అతను చేపలు పడుతుండగా ఒక్కసారిగా మొసలి దాడిచేసి చేతిని అందుకున్నది. వెంటనే ప్రతిఘటించి తోటి వారి సహాయంతో ప్రాణాలతో బయటకు వచ్చారు. వెంటనే అతడిని నర్సంపేట ఏరియా ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించారు.

మోడల్‌ స్కూల్‌ విద్యార్థినికి ఐఐటిలో చోటు

మోడల్‌ స్కూల్‌ విద్యార్థినికి ఐఐటిలో చోటు

పర్వతగిరి మండలంలోని మోడల్‌ స్కూల్‌ విద్యార్థి ఎండి.యాస్మిన్‌కు భాసర ఐఐటిలో సీటు వచ్చింది. ఈ సందర్భంగా యాస్మిన్‌కు బాసర ఐఐటిలో సీటు దక్కడంపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయ బృందం ఆశీర్వదించి అభినందించారు. తన కూతురుకు ఐఐటీలో సీటు రావడంతో యాస్మిన్‌ తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

పోలీసులు తమ కర్తవ్యాన్ని నెరవేర్చాలి : మంత్రి మహ్మూద్‌అలీ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీసుల సంక్షేమానికి పెద్దపీట వేయనున్నదని, పోలీసులకు, వారి కుటుంభాలకు అన్ని విధాలుగా అండగా నిలువడానికి రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ది కార్యక్రమ ప్రణాళికలు రూపొందిస్తున్నదని, పోలీసులు విధినిర్వహణలో తమ కర్తవ్యాన్ని నెరవేర్చి ప్రజలకు రక్షణ కల్పించాలని తెలంగాణ రాష్ట్ర హోం మంత్రి మహ్మూద్‌అలీ అన్నారు. శనివారం స్మార్ట్‌ పోలీస్‌స్టేషన్ల సందర్శనలో భాగంగా ఆయన వరంగల్‌జిల్లాలో పర్యటించి పలు పోలీస్‌స్టేషన్‌లను పోలీసుల పనితీరును, పోలీస్‌స్టేషన్‌ భవనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులు ప్రజలతో ఫ్రెండ్లీగా వ్యవహరించి ప్రజలకు భద్రత, భరోసా, విశ్వాసాన్ని కల్పించాలని ఆయన సూచించారు.

అనంతరం 4వ బెటాలియన్‌ నూతన పరిపాలన భవనంను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జి కలెక్టర్‌ దయానంద్‌, వరంగల్‌ పోలీస్‌ కమీషనర్‌ డా.వి రవీందర్‌, అడిషనల్‌ డిజిపి అభిలాష బిస్తు,వరంగల్‌ ఈస్ట్‌జోన్‌ డిసిపి కేఆర్‌ నాగరాజు వరంగల్‌ పార్లమెంట్‌ సభ్యులు పసునూరి దయాకర్‌, గ్రేటర్‌ వరంగల్‌ మేయర్‌ గుండా ప్రకాశ్‌, వరంగల్‌ తూర్పు ఎమ్మేల్యే నన్నపునేని నరేందర్‌, వర్ధన్నపేట ఎమ్మేల్యే ఆరూరి రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version