విచ్చలవిడి అవినీతితో అపార్ట్‌మెంట్ల ధరలకు రెక్కలు

హద్దులు దాటుతున్న కొందరు అధికార్ల అవినీతి

-పట్టుబడినా బయటపడతామన్న ధైర్యమే వారి ఆయుధం

-పట్టుబడిన అవినీతి ఉద్యోగులవద్ద వందల కోట్లలో సంపద

-రియల్‌ ధరలు పెరగడానికి ఈ అవినీతి ప్రధాన కారణం

-అన్ని భారాలను మోసేది సామాన్యుడే

-గగన కుసుమ మవుతున్న సామాన్యుడి సొంతింటి కల

-ఇప్పుడిప్పుడే ఫలితాలిస్తున్న రేవంత్‌ ప్రభుత్వ చర్యలు

`ఇంకా ధరలు తగ్గాలి సామాన్యుడికి అపార్ట్మెంట్లు అందుబాటులోకి రావాలి

హైదరాబాద్‌,నేటిధాత్రి:

హైదరాబాద్‌లో ఒక సొంత ఇల్లు ఉండాలన్నది సాధారణ మధ్యతరగతి పౌరుడి కల. దాన్ని నెరవేర్చుకోవడానికి ఎన్నో కష్టాలు పడుతుంటారు. తన ఆదాయంలో ఎన్నో ఖర్చులు తగ్గించుకొని మరీ సొంతింటి కల నెరవేర్చుకోవడానికి, భగీరథ ప్రయత్నం చేస్తుంటారు. మానవుడికి నెలసరి నిత్యావసరాల మాదిరిగానే, సొంతిల్లు కూడా ఒక నిత్యావసరం. రోజురోజుకూ పెరుగుతున్న అద్దెలు, నిత్యావసరాల ధరలతో తనకు వచ్చే పొంతనలేని ఆదాయం ఎప్పటికప్పుడు మధ్యతరగతి జీవుల జీవనశైలిని శాసిస్తుంటుంది. అటువంటివారు ఏదోవిధంగా సొంతింటి కల నెరవేర్చుకోవడానికి తన ఆదాయాన్ని, ఇంటి ఖర్చులను బేరీజు వేసుకొని మరీ ఎన్ని కష్టాలైనా పడి సొంతగూడు ఏర్పాటుకు సిద్ధమవుతారు. నిజం చెప్పాలంటే సొంతగూడు కల అనేది మధ్యతరగతి జీవి తన జీవిత కాలం త్యాగం చేస్తే తప్ప నిజం చేసుకోలేని ‘నిత్యావసర’ లక్ష్యం! ఈవిధంగా ఒక త రం కష్టంతో రెండోతరానికి ఇల్లు అమరడం సహజంగా జరుగుతున్న ప్రక్రియే. అయితే మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజల్లో పెరుగుతున్న ఆకాంక్షలకు అనుగుణంగా వారి వారి ఆదా య పరిమితులకు తగ్గట్టు అందుబాటులోకి ఇళ్లు, అపార్ట్‌మెంట్లు అందుబాటులోకి రావడం మొదలైంది. ఫలితంగా జంటనగరాల విస్తరణ కూడా అంతే వేగంగా కొనసాగింది. క్రమంగా ఈ విస్తరణలో విపరీత పోకడలు చోటుచేసుకుంటూ, ఇప్పుడు అపార్ట్‌మెంట్‌ లేదా సొంతిల్లు కొనుగో లు చేయాలంటే మధ్యతరగతి లేదా సామాన్య ప్రజలు కలలో కూడా ఊహించలేని విధంగా పరిస్థితులు తయా రయ్యాయి. ఇందుకు ప్రధాన కారణం, భూముల ధరలు పెరగడం, అధికార్లులోలంచగొండిత నం హద్దులుదాటి విపరీతస్థాయికి చేరుకోవడం, నిర్మాణవ్యయం పెరగడం వంటి కారణాలను ప్రధానంగా చెప్పవచ్చు. వీటి కారణంగా నగరంలో అపార్ట్‌మెంట్‌ కొనుగోలు చే యాలంటే పది పదిహేనేళ్ల క్రితం చదరపు అడుగుకు రూ.1000 నుంచి రూ.1500 వరకు పలికిన ధరలు ఇప్పుడు ఏకంగా రూ.6వేల నుంచి రూ.15వేలు ఆపైన పలుకుతున్నాయి. ఈ ధరల్లో కొనుగోలు చేయడం మధ్యతరగతివారికి తలకుమించిన భారంగా మారడంతో ఎంతోమంది తమ సొంతింటి కోర్కెను బలవంతంగా అణచుకొని, అద్దె ఇళ్లలోనే సర్దుబాటు జీవనంతో బతుకులీడుస్తున్నారు.

ముక్కుపిండి లంచాల వసూళ్లు

ఒక అపార్ట్‌మెంట్‌ లేదా ఇల్లు నిర్మాణానికి అనుమతులు రావాలంటే ఇందులో దాదాపు 20కి పైచిలుకు ప్రభుత్వ శాఖలనుంచి అనుమతులు పొందాల్సివుంటుంది. ఆయా శాఖలకు చెందిన కొందరు అధికార్లకు ఎంతోకొంత ముట్టజెప్పి పనిచేయించుకునే స్థాయినుంచి, ఇప్పుడు కచ్చితమైన రేట్లను చెల్లించక పోతే అనుమతులు మంజూరుకాని దుస్థితికి పరిస్థితులు చేరుకున్నాయి. ఫలితంగా విచ్చలవిడి లంచాల భారం, చివరికి కొనుగోలు దారుడిపై పడుతోంది. ఎంత నిర్మాణ వ్యయం పెరిగినా ఒక ఆపార్ట్‌మెంట్‌ను చదరపు అడుగుకు రూ.3500లోపే ధరతో అమ్మకాలు జరపవచ్చు. కానీ రూ.6వేల నుంచి రూ.15వేల వరకు ధరలను చెబుతున్నారంటే, ఇందులోపెరిగిన మొత్తంలో సింహభాగం అధికార్ల లంచాలకే చెల్లించాల్సి వస్తోంది. ఒక బిల్డర్‌ నిర్మాణం మొత్తం ఖర్చులు పోను తన లాభం చూసుకొని అమ్మకం జరుపుతాడు కనుక, ఈ మొత్తం భారం కొనుగోలుదారుమోయక తప్పడంలేదు.

ఇటీవల హైదరాబాద్‌లో అవినీతి నిరోధకశాఖ అధికార్లకు చిక్కుతున్న కొందరు చిన్నస్థాయి ఉద్యోగుల వద్ద కూడా వందల కోట్లలో అక్రమ సంపాదన బయటపడటానికి ప్రధాన కారణం రియల్టర్లనుంచి ఇతరత్రా మార్గాల ద్వారా విచ్చలవిడిగా లంచాలరూపంలో వసూలు చేయడమే. అయితే రియల్‌ బిజినెస్‌ నుంచి వచ్చే ఆదాయంమే వీరికి ఎక్కువగా వుంటోందన్నది సత్యం. అదీ కాకుండా దొరికిన వారికి భయం వుండటంలేదు. కొద్దికాలంలో మళ్లీ తమకు పోస్టింగ్‌ ఖాయమన్న ధైర్యం కూడా ఇందుకు కారణం. ఏసీబీకి పట్టుబడిన ఒక ప్రబుద్ధుడి వద్ద రూ.400 కోట్ల వరకు దొరికితే, మధ్యవర్తిద్వారా ఇప్పటికైనా తనిఖీలు ఆపితే ఒక మంత్రిగారికి రూ.200కోట్లు ముట్టజెప్పుకుంటానని ఏకంగా బేరంపెట్టిన సంఘటనలు కూడా జరిగాయి. అతగాడి ప్రయత్నాలు ఫలించలేదు. ఇక్కడ విషయమేంటంటే అన్ని వందలకోట్లు పట్టుబడినా, ఏకంగా మంత్రికే ఆస్థాయి లంచం ఇవ్వజూపాడంటే, అతని వద్ద ఇంకెంత మొత్తంలో అక్రమ సంపాదన ఉండివుండాలి?

తేలుకుట్టిన దొంగలు

కొందరు అధికార్ల అవినీతికి మరొక మచ్చుతునక. వరంగల్‌ వంటి ప్రధాన నగరానికి చెందిన వ్యాపారి రూ.25కోట్లతో ఒక షాపింగ్‌ మాల్‌ను నిర్మించాడు. తర్వాతికాలంలో వ్యాపారంలో న ష్టం వస్తుండటంతో దాన్ని రాత్రికి రాత్రే ఖాళీచేసి, అందులో పత్తిబేళ్లను నింపి అగ్నికి ఆహుతి చేసి, అగ్నిప్రమాదమని నమ్మించి ఇన్సూరెన్స్‌ క్లైమ్‌ చేసాడు. కొన్ని సంవత్సరాల తర్వాత అతనికి రూ.12కోట్లు ఇన్సూరెన్స్‌ క్లైమ్‌ లభించింది. అప్పటివరకు దాదాపు ఎవరికీ కనబడకుండా ఉన్న ఆ వ్యాపారి, చిన్నగా తగులబడిన షాపులను మరమ్మతులు చేసి, కొత్త షాపులు తెరిచే ప్రయత్నంలో ఉన్నాడు. ఇంతకూ ఈకథలో అసలు ట్విస్ట్‌ మరోటుంది. మొట్టమొదట ఆ షాపింగ్‌ మాల్‌నుఅతగాడు కట్టింది వివిధ శాఖలకు చెందిన కొందరు అధికార్లు, ఉద్యోగులు అక్రమంగా సంపా దించిన మొత్తం నుంచి! ఇది ఆశ్చర్యంగా వున్నా నిజం. ఎట్లా అంటే, అటువంటి అక్రమ సం పాదనను సదరు అధికార్లు, ఉద్యోగులు ఇతగాడికి నామమాత్రపు వడ్డీకి ‘నమ్మకంతో’ ఇచ్చారు. ఆ మొత్తంతో దర్జాగా షాపింగ్‌ మాల్‌ ప్రారంభించాడు. తర్వాత అగ్నిప్రమాదం పేరుతో తతంగంఅంతా జరిపించి, ఇప్పుడు ఇన్సూరెన్స్‌ క్లైమ్‌ మొత్తంలో అధికారికంగా మాల్‌లో తన బంధువుల పేర్న షాపులు తెరవడానికి యత్నిస్తున్నాడు. ఇప్పుడు అప్పులిచ్చిన అధికార్ల పరిస్థితి తేలుకుట్టిన దొంగల్లా మారింది. అతగాడిని గట్టిగా అడగనూ లేరు! షాపింగ్‌ మాల్‌ కట్టుబడి వెనుక తమ డబ్బే వున్నదని బయటకు చెప్పుకోనూ లేరు! చివరకు తమపేర్లు బయటకు రాకుండా వుంటే చాలు! తామిచ్చిన మొత్తం పోయినా ఫర్వాలేదనే స్థితికి వచ్చారు. ఇక్కడ ప్రజల నోళ్లు కొట్టి అధికార్లు సంపాదిస్తే, వీళ్ల నెత్తికొట్టిన మరో వ్యాపారి దర్జాగా జీవితాన్ని అనుభవిస్తున్నాడు!! పేదల నెత్తి పెద్దలు కొడితే…పెద్దల నెత్తి పెరుమాళ్లు కొట్టాడన్న సామెతకు ఇది చక్కగా సరిపోయే సంఘటన.

ప్రమాదమని తెలిసినా కొందరు ఎందుకింత విచ్చలవిడి అవినీతికి పాల్పడుతున్నారన్న ప్రశ్నకు ఒక్కటే సమాధానం. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి…ఉద్యోగంనుంచి బయటకు వెళ్లి నా సమాజంలో తానొక ధనవంతుడిగా గుర్తింపు పొందాలన్న బలీయమైన కాంక్ష. మరికొందరు ఇటువంటి విచ్చలవిడి సంపాదనతో ఉద్యోగాన్ని వదలి రాజకీయా పార్టీలో చేరి టిక్కెట్‌కోసం ప్రయత్నించిన సంఘటనలు కూడా ఉన్నాయి. సంపాదించడానికి రాజకీయాన్ని మించిన అవకాశం మరొకటి లేదన్నది వీరి అభిప్రాయం!

హైదరాబాద్‌ నగరంలో గత పదేళ్ల కాలంలో దాదాపు 12వేల కోట్ల ఎస్‌.ఎఫ్‌.టి.ల అపార్ట్‌మెంట్ల అమ్మకాలు జరిగాయన్నది ఒక అనధికారిక అంచనా. ఇదే కాలంలో ఎస్‌.ఎఫ్‌.టి.ధర క్రమంగా అడ్డూఅదుపూ లేకుండా పెరిగిపోయిందన్నది నిష్టుర సత్యం. ఈ వైపరీత్యానికి ప్రధాన కారణాల్లో కొందరు అధికార్ల అవినీకూడా ముఖ్యమైన కారణం. ప్రస్తుత విషయానికి వస్తే జంటనగరాల్లో 4లక్షల అపార్టుమెంట్లు ఇంకా అమ్మకాల జరగకుండా ఖాళీగా ఉండగా మరో 4లక్షలు ని ర్మాణంలో ఉన్నాయన్నది అంచనా. ఇన్ని ఖాళీగా పడివున్నా ధరలు విపరీతంగా పెంచేస్తున్నారు తప్ప తగ్గడంలేదు.

ఫలిస్తున్న కఠిన చర్యలు

ప్రస్తుతం రేవంత్‌ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో, అడుగుకు రూ.6వేలు పైచిలుకు పలికిన కొన్ని అపార్ట్‌మెంట్ల ధరలు ఇప్పుడు రూ.4`5వేలమధ్యకు దిగివస్తున్నాయి. ఈమేరకు కొన్ని ప్రముఖ రియల్టర్‌ కంపెనీలు బ్రోచర్లు కూడా విడుదల చేస్తున్నాయి. నిజానికి వీటి ధరలు రూ.3500వరకు దిగివవస్తే ఈ రంగంలో అవినీతి చాలా వరకు తగ్గిపోయినట్టుగా భావించాలి. రేవంత్‌ ప్రభుత్వం ఈ చర్యలు తీసుకోకపోతే సదరు అపా ర్ట్‌మెంట్‌ల ధరలు దిగొచ్చేవి కావన్నది అక్షర సత్యం. ఏసీబీ దాడులు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో కొందరు తమవద్ద వున్న అక్రమ ధనాన్ని తిరిగి రియల్టర్ల వద్దకే పంపి ‘దాచుకునే యత్నాలు’ చేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం కూడా దొరికిన అక్రమ అధికార్లను ఎంత కఠినం గా శిక్షించాలంటే మరొకరు లంచాన్ని డిమాండ్‌ చేయాలంటే భయపడే స్థాయిలో వుండాలి. దురదృష్టవశాత్తు అటువంటిది జరగడంలేదు. తిరిగి ఏదోవిధంగా పోస్టింగ్‌ పొందుతామన్న ధైర్యం వారిని లంచావతారాలను చాలించనివ్వడంలేదు. ఒక దేశంలో రాజుగారు లంచాలు తీసుకుంటున్న అధికార్ల ముక్కు కోసే శిక్ష విధించాడట! యధావిధిగా ఒకరోజు పట్టుబడిన అధికారికి ము క్కు కోసే శిక్ష విధించి, తన రాజప్రాసాదంపై పచార్లు చేస్తుంటే, ముక్కుకోసే వ్యక్తి, శిక్షపడిన అధికారి మధ్య ఏవో మాటలు జరుగుతుండటం ఆయన కంటపడిరది. పైకి పిలిపించి వారిద్దరినీ విచారిస్తే, సదరు అధికారి ‘అయ్యా! వంద రూకలు ఇస్తే పదునైన కత్తితో ఒకేసారి కసక్కున ముక్కు కోసేస్తానని, లంచం ఇవ్వకపోతే మొండికత్తితో బరాబరా కోస్తానని బెదిరిస్తున్నాడని’ చెప్పడంతో రాజుగారు అవాక్కయ్యారట! ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కూడా అటువంటి పరిస్థితి రాకుండా కఠిన చర్యలు తీసుకోక తప్పదు మరి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!