ఓఆర్‌ఆర్ లోపల కల్లు అమ్మకాలు బంద్?
హైదరాబాద్‌లో కల్లు దుకాణాలు మూతపడనున్నాయా? కల్తీ కల్లును అరిట్టాలంటే.. అసలు కల్లు దుకాణాలే లేకుండా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోందా
- కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో కల్లు దుకాణాల ఎత్తివేత దిశగా ప్రభుత్వ ఆలోచన
- కల్తీ కల్లును అరికట్టాలంటే ఇదొక్కటే మార్గమని
- సూచించిన ఆబ్కారీ శాఖ అధికారులు
- ఓఆర్‌ఆర్ లోపల ప్రస్తుతం 454 కల్లు దుకాణాలు
- కూకట్‌పల్లి కల్తీ కల్లు ఘటనలో మరో మహిళ మృతి
కూకట్‌పల్లి ఘటన అనంతరం లిక్కర్‌తోపాటు కల్లు అమ్మకాలు ఎంత మేరకు జరుగుతున్నాయనే అంశంపై అధికారుల్లో చర్చ జరిగింది. ఓఆర్‌ఆర్ లోపల లిక్కర్ అమ్మకాలతో సమానంగా కల్లు విక్రయాలు కూడా ఉన్నాయని గుర్తించిన అధికారులు.. ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. ప్రస్తుతం ఓఆర్‌ఆర్ లోపల తాటి కోఆపరేటివ్ సొసైటీలు 390 ఉన్నాయి. అందులో హైదరాబాద్ నగరంలో 14 ఉన్నాయి. ఈ సొసైటీల పరిధిలో 53 కల్లు దుకాణాలు ఉన్నాయి. సికింద్రాబాద్ పరిధిలో 31 సంఘాలు ఉంటే వాటి కింద 50 దుకాణాలు, రంగారెడ్డి ఎక్సైజ్ జిల్లా మల్కాజిగిరి పరిధిలో 77 సంఘాలు ఉండగా, వాటి పరిధిలో 79 దుకాణాలు ఉన్నాయి. మేడ్చల్ పరిధిలో 50 సంఘాలు ఉంటే వాటి పరిధిలో 52 దుకాణాలు, సరూర్‌నగర్ పరిధిలో 158 సంఘాలు ఉంటే 158 దుకాణాలు, శంషాబాద్ పరిధిలో 60 సంఘాల కింద 62 దుకాణాలు ఉన్నాయి. మొత్తం 390 సంఘాల పరిధిలో 454 దుకాణాల్లో కల్లు విక్రయాలు జరుగుతున్నాయని ఆబ్కారీ శాఖ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. ఇక హైదరాబాద్, సికింద్రాబాద్ మినహా మేడ్చల్, మల్కాజిగిరి, శంషాబాద్, సరూర్‌నగర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ల పరిధిలో ఉన్న టీఎ్‌ఫటీ (ట్రీ ఫర్ ట్రేడ్) అనుమతులకు సంబంధించి ఔటర్ లోపల ఉన్న కల్లు దుకాణాలు కూడా రద్దయ్యే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ కింద 6, సికింద్రాబాద్ 6, రంగారెడ్డి 21 ఎక్సైజ్ స్టేషన్లు కలిపి 33 స్టేషన్ల పరిధిలో కల్లు దుకాణాలన్నీ రద్దు కానున్నట్లు సమాచారం. ఎక్సైజ్, టీజీ న్యాబ్, కొత్తగా ఏర్పాటు చేసిన ఈగల్ నిఘా విభాగం అన్ని కలిసి పటిష్ఠ నిఘా పెడుతున్నా.. కల్తీ కల్లు తయారీకి వినియోగించే అల్ర్పా జోలం, డైజీఫాం, హైడ్రోక్లోరైడ్ వంటి మత్తు పదార్థాలను పూర్తి స్థాయిలో అరికట్టలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో ఓఆర్‌ఆర్ లోపల కల్లు విక్రయాల అనుమతులను రద్దు చేయాలని ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం.
కేపీహెచ్‌బీకాలనీ, హైదరాబాద్ సిటీ, జూలై 17 (ఆంధ్రజ్యోతి): కూకట్‌పల్లిలో కల్తీ కల్లు ఘటనలో మరొకరు మరణించారు. కూకట్‌పల్లి ఇందిరాహిల్స్‌కు చెందిన సునీత(42) అనే మహిళ ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మరణించారని కూకట్‌పల్లి ఎస్సై నరసింహ తెలిపారు. జూలై 5న ఇందిరానగర్ కల్లు కాంపౌండ్‌లో కల్లు తాగిన సునీత.. మరుసటి రోజు తన స్వగ్రామం నాగర్‌కర్నూల్ జిల్లా ఇంద్రకల్‌కు వెళ్లారు. అక్కడ అస్వస్థతకు గురవ్వగా కుటుంబసభ్యులు ఏడో తేదీన నాగర్‌కర్నూల్ ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం సునీతను ఈ నెల 15న ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆమె మరణించింది. కాగా, పాల ప్యాకెట్ల తరహాలో గుండ్లపోచంపల్లి అయోధ్యనగర్‌లోని ఓ హోటల్‌లో కల్లు ప్యాకెట్లను విక్రయిస్తున్న వారిని ఎక్సైజ్ అధికారులు గురువారం పట్టుకున్నారు. ఎస్‌వీఎస్ బ్రాండ్ పేరుతో విక్రయిస్తున్న 270 లీటర్ల కల్లు ప్యాకెట్లను సీజ్ చేశారు. హోటల్ నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నారు. మరో పక్క, సైదాబాద్ ప్రాంతంలో అనుమతి లేకుండా కల్లు విక్రయిస్తున్న ఇద్దరిపై కేసు నమోదు చేసిన ఎక్సైజ్ పోలీసులు వారి వద్ద 750 లీటర్ల కల్లును స్వాధీనం చేసకున్నారు.