`ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు.
`రాజకీయ ముసుగులో ప్రజల జీవితాలతో ఆటలాడుకుంటున్నారు.
`ప్ర్రజాసేవ గాలికి..రాజకీయాలు స్వార్థానికి!
`ఎందుకు గెలిచామన్నది వదిలేస్తున్నారు.
`ప్రజలెందుకు గెలిపించారన్నది ఎప్పుడో మర్చిపోయారు.
`ప్రజా ప్రతినిధులు తమ కర్తవ్యాలను మూలన పడేస్తున్నారు.
`వివాదాలు ముందేసుకొని కాలయాపన చేస్తున్నారు.
`ప్రజల దృష్టి మళ్లించి మూటలు వెనకేసుకుంటున్నారు.
`ఆ పార్టీ మీద ఈ పార్టీ, ఈ పార్టీ మీద ఆ పార్టీ..
`నిత్య రాజకీయ ప్రకంపనలు..అవినీతి ఆరోపణలు.
`పార్టీల స్వార్థం.. లేని పొత్తుల రాజకీయం!
`నాయకుల మాటలకు హద్దూ, బద్దు లేదు.
`కాంగ్రెస్, బిఆర్‌ఎస్ తో పొత్తని బిజేపి అంటుంది?
`బిఆర్‌ఎస్, బిజేపి పొత్తని కాంగ్రెస్ అంటోంది?
`కాంగ్రెస్, బిజేపి లు కలిసి నాటకాలాడుతున్నాయని బిఆర్‌ఎస్ ఆరోపిస్తుంది?
`ఉన్నవే మూడు పార్టీలు?
`జాతీయ పార్టీల మధ్య పొత్తలు అసాధ్యం!
`జాతీయ, ప్రాంతీయ పార్టీల పొత్తులు సహజం.
`ఒకరితో ఒకరికి రాజకీయ అవసరం.
`రహస్య ఒప్పందాలు సరే..లేని సంబంధాలపై రభసలెందుకు?
`ప్రజలను గందరగోళంలో పడేయడమెందుకు?
హైదరాబాద్,నేటిధాత్రి: రాను రాను రాజకీయాలు ఎటు పోతున్నాయో ఎవరికీ అర్దం కావడం లేదు. అసలు రాజకీయాలు ప్రజా శ్రేయస్సు కోసమున్నాయో? లేక నాయకుల కోసం వున్నాయో? తెలియకుండాపోతున్నాయి. రాజకీయ పార్టీల వైఖరి ఎవరికీ అంతు పట్టకుండాపోతోంది. ఎవరు ఎవరిపై ఎలాంటి విమర్శలు చేస్తుంటారో వారికే అవగాహన కరువౌతోంది. ముఖ్యంగా సోషల్ మీడియా పెరిగిన తర్వాత నాయకులు ఇచ్చే లీకులు, ప్రకటనలు మరింత గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. ఇక పార్టీల విషయానికి వస్తే ఏ పార్టీ తన సొంత పార్టీ వ్యవహారాలకన్నా ఇతర పార్టీల వైఖరి, అడుగుల గురించి ప్రస్తావిస్తూ పోవడం వింతగా వుంది. పైగా తెలంగాణలో రాజకీయాలన్నీ సహజంగా అధికార కాంగ్రెస్ పార్టీ చుట్టూ తిరగాలి. లేదంటే కేంద్రంలో వున్న బిజేపిపార్టీ చుట్టైనా తిరగాలి. కాని ప్రజలు ఓడిరచిప్రతిపక్ష పాత్రను అప్పగించిన బిఆర్‌ఎస్ చుట్టూ తిప్పుతున్నారు. తమ తమ పార్టీలను వారికి తెలియకుండానే తక్కువ చేసుకుంటున్నారు. వారి పార్టీలను వాళ్లే పలుచన చేసుకుంటున్నారు. ఎన్నికల ముందు ఇచ్చినహామీలేమిటి? వాటి అమలు తీరు ఎలా వుంది? ప్రజలు ఏమనుకుంటున్నారు? వారి అభిప్రాయాలమేమిటి? అమలు జరుగుతున్న ప్రభుత్వ పధకాలపై ఎంత వరకు సంతృప్తి చెందుతున్నారు? ఏ ప్రభుత్వానికి అన్ని వర్గాల ప్రజలను సంతృప్తి చెందించడం ఎవరి వల్ల కాదు. కాని మెజార్టీ ప్రజలను మెప్పించే పాలన సాగుతుందా? లేదా? అన్నది కాంగ్రెస్ పార్టీ పెద్దలు, నాయకులు ఎప్పటికిప్పుడు తెలుసుకుంటుండాలి. ఓ వైపు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితోపాటు కొంత మంది మంత్రులు ఎంతో కష్టపడుతున్నారు. ప్రజలకు గత ప్రభుత్వంలో అందని అనేక పథకాలను అమలు చేస్తున్నారు. అందులో ముఖ్యంగా ఉచిత బస్సు అనే పథకం ప్రజలకు ఎంతోఉపయోపడుతోంది. కాని దానిపై ప్రజలనుంచి వ్యతిరేకత వ్యక్తం కాకపోయినా, ప్రతిపక్ష పార్టీలు విమర్శల పాలు చేస్తున్నాయి. ఆయా పార్టీలకు చెందిన సోషల్ మీడియాలో విపరీతమై, విచిత్రమైన ప్రచారం సాగిస్తున్నారు. కాని ఉచిత బస్సు వినియోగించుకుంటున్న వాళ్లు మాత్రం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బస్సుల సంఖ్యను పెంచమని కోరుతున్నారు. అంతే కాని ఉచిత బస్సు ఎందుకు ప్రవేశపెట్టారని ఎవరూ అనడం లేదు. కేవలం బస్సులతో పనిలేని వాళ్లు మాత్రమే ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారు. వాటిని తిప్పికొట్టే ప్రయత్నం కాంగ్రెస్‌పార్టీ నాయకులు చేయడం లేదు. ప్రతిపక్షాలు చేస్తున్న అసత్య ప్రచారమే నిజమని నమ్మే పరిసి ్ధతి వస్తోంది. కాని ఉచిత బస్సు పధకం వల్ల ఎంతోమందికి ఎంతో కొంత మేలు జరుగుతోంది. ప్రైవేటు కార్యాలయాల్లో పనిచేసే మహిళలు, కూలీ పని చేసుకునేవారికి, కూరగాయల వ్యాపారం చేసుకునేవారికి, ఇతరత్రా పల్లెల్లో పనులు చేసుకోవడానికి వెళ్లేవారికి ఎంతో ఉపయోగపడుతోంది. ఆ పధకం మరింత ప్రయోజకరంగా కావాలంటే బస్సులు పెంచాలి. రైతు కూలీలకు ముఖ్యంగా ఎంతో ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. పొరుగు గ్రామాలలో పనుల కోసం వెళ్లే మహిళలందరూ కలిసి ఆటోలను మాట్లాడుకొని వెళ్లేవారు. రోజు వారి కూలీలో కొంత ఖర్చు చేయాల్సి వచ్చేది. ఇప్పుడు అది మిగులుతోంది. అంటే ఉచిత బస్సు ప్రయాణం అనేది ఎంతో మేలు ప్రక్రియే అని చెప్పాలి. ఇక ఉచిత బస్సు పధకం వల్ల లక్షలాది మంది స్కూల్, పాఠశాలల విద్యార్ధునులకు బస్సు పాసులు తీసుకోవాల్సిన అవసరం లేకుండాపోయింది. సన్న బియ్యం పధకం అనేది ఎంతో గొప్ప పధకం. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధైర్యానికి ఎవరైనా మెచ్చుకోవాల్సిందే. ఎందుకంటే రెండు రూపాయలకు కిలో బియ్యం పధకం ప్రవేశపెట్టిన సమయంలో సన్న బియ్యం మార్కెట్‌లో సుమారు రూ.5 రూపాయలు వుండేది. ఆ సమయంలో దొడ్డు బియ్యాన్ని రెండు రూపాయలకు కిలో ఇచ్చారు. తర్వాత వైఎస్ రాజశేఖరెడ్డి 2004లో రెండు రూపాయలకు కిలో బియ్యం ఇచ్చినప్పుడు సన్న బియ్యం రూ.20 రూపాయలు వుంది. ఇప్పుడు మార్కెట్‌లో సన్న బియ్యం కిలో రూ.50 రూపాయలకుపైగా వుంది. ఇలాంటి సమయంలో సన్న బియ్యం ఉచితంగా ఇవ్వడం అంటే పేదల పట్ల రేవంత్ రెడ్డికి వున్న అంకితభావం అర్దం చేసుకోవచ్చు. ఇలా రాష్ట్ర ప్రభుత్వం మేలైన, మెరుగైన పధకాలను అమలు చేస్తోంది. ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తోంది. తొలి ఏడాది సుమారు 4.5లక్షల ఇండ్లు నిర్మాణం చేస్తున్నారు. ఈ ఏడాది మూడున్నర లక్షల రేషన్ కార్డులిస్తున్నారు. రైతుభరోసా వేస్తున్నారు. రైతు రుణమాఫీ చేశారు. వీటిని ప్రచారం చేయాల్సిన కంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బిఆర్‌ఎస్ పార్టీ బిజేపితో కలిసి సాగుతుందంటారు. బిఆర్‌ఎస్, బిజేపితో వచ్చే ఎన్నికల్లో పొత్తుపెట్టుకుందంటూ అంటుంటారు. రాష్ట్ర ప్రభుత్వం గొప్ప గొప్ప పనులు చేస్తుంటే వాటి గురించి చెప్పుకోకుండా నిత్యం బిఆర్‌ఎస్ మీద పడి ఎందుకు ఏడుస్తున్నారో ఎవరికీ అర్ధం కావడంలేదు. ఇందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మినహాయింపు కాకుండాపోవడంలేదు. ఆయన కూడా పదే పదే బిఆర్‌ఎస్ నాయకులను టార్గెట్ చేస్తూ ఏ జిల్లాకు వెళ్తే ఆ జిల్లా నాయకులను ఉతికి ఆరేస్తున్నారు. జిల్లాల పర్యటనలకు వెళ్లినప్పుడు అక్కడి సమస్యలు తెలుసుకొని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని చెబితే ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది. ప్రబుత్వం అమలు చేస్తున్న పధకాల గురించి వివరిస్తూ పోతుంటే, ప్రజలకు మరింత నమ్మకం కల్గుతుంది. అంతే కాని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నుంచి మొదలు అందరూ అదే బాష, అదే తీరును అనుసరిస్తున్నారు. నిజానికి కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా టార్గెట్ చేయాల్సింది బిఆర్‌ఎస్‌ను కాదు. కేంద్రంలో వున్న బిజేపిని. రాష్ట్రానికి కేంద్రం నుంచి అందాల్సిన నిదులు రాకపోతే కేంద్రాన్ని కడిగేయాలి. దోషిగా ప్రజల ముందు నిలబెట్టాలి. అది వదిలిపెట్టి బిఆర్‌ఎస్ మీదే పడుతున్నారు. బిజేపి కూడా కాంగ్రెస్ దారిలోనే నడుస్తోంది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హమీలు 420. వాటిని కనీసం బిజేపి పార్లమెంటు సభ్యులు ఒక్కరైనా చదివారా? కాంగ్రెస్ పార్టీ మ్యానిఫెస్టో చూశారా? రైతు భరోసా విషయంలోనైనా, రైతు రుణమాఫీ అంశంలోనైనా బిజేపి ఎందుకు మాట్లాడడం లేదు? రేవంత్ సర్కారు ఇచ్చిన హమీలను బిజేపి ఎందుకు గుర్తు చేయడం లేదు. తెలంగాణలో కరువు చాయలు కనిపిస్తున్నాయి. రైతులకు నీళ్లివ్వాలని బిజేపి ఎందుకు నిలదీయడం లేదు. 8 మంది బిజేపి ఎంపిలను తెలంగాణ గెలిపించి పార్లమెంటుకు పంపారు. అసలు ఆ ఎంపిలు కేంద్రం నుంచి ఎన్ని నిదులు తెచ్చారో చెప్పిన దాఖలాలు ఏ ఒక్కటి లేదు. కాని తెల్లారిలేస్తే బిఆర్‌ఎస్‌ను టార్గెట్ చేసే రాజకీయాలు మాత్రమే చేస్తున్నారు. ప్రజలు బిఆర్‌ఎస్‌ను కాదని ఎందుకు ఎన్నుకున్నారు. తమకు ఎందుకు పాలన అప్పగించారన్న ఆలోచన ఏ ఒక్క నాయకుడు ఆలోచించడం లేదు. ఈ పార్టీ, ఆ పార్టీతో పొత్తు, ఆ పార్టీ, ఈ పార్టీతో పొత్తు అంటూ ఇంకా ఎన్నికలు ఎంతో సమయం వుంది. ఇప్పటి నుంచే ప్రచారం చేసుకుంటూ పోతే వచ్చేదేముంది? ప్రజా సమస్యలను పక్కదారి పట్టించి సాదించేదేముంది? రాజకీయాలు ఇంకా ఎంతదూరం వెళ్లాయంటే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత త్వరలో కాంగ్రెస్‌లో చేరనున్నదని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అంటుంటారు. అంతేకాకుండా త్వరలోనే ఆమెకు మంత్రి పదవి ఇస్తారంటారు. గత మంత్రి వర్గ విస్తరణలోనే ఆమె మంత్రిగా ప్రమాణం చేయాల్సి వుండేది. కాని ఆగిపోయిందంటారు. అసలు రాజకీయాలను ఎటు వైపు నుంచి ఎటు వైపు తీసుకెళ్తున్నారు. ఓ వైపు బిసి ఉద్యమమని అందరూ మాట్లాడతారు? అందరూ చిత్తశుద్దినే ప్రదర్శిస్తామంటున్నారు. 42 శాతం రిజర్వేషన్ అమలుకు కాంగ్రెస్ ఆర్డినెన్స్ తెచ్చి బిసిలకు రాజకీయ న్యాయం చేయాలనుకుంటున్నామని కాంగ్రెస్ అంటుంది. లేదు లేదు. ఆర్డినెన్స్ వల్ల రిజర్వేషన్ అమలు అసాద్యమని అదంతా బోగస్ అని బిఆర్‌ఎస్ అంటుంది. బిసి రిజర్వేషన్ల ఆర్డినెన్స్ మీద ఎవరూ కోర్టుకు పోకుండా చూసుకోవాలని ప్రభుత్వం అంటుంది. గతంతో తాము కూడా 27శాతం రిజర్వేషన్ అమలు చేయాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ కోర్టుకు వెళ్లిందని బిఆర్‌ఎస్ ఆరోపిస్తోంది. ఇలా నిత్యం ఏదో వివాదం తప్ప, ప్రజలకు న్యాయం జరగాలన్న ఆలోచన ఏ పార్టీకి లేదన్నది మాత్రం ముమ్మాటికి నిజం అని చెప్పకనే చెబుతున్నారు.