టెండర్ పాడిన లారీలు ఎక్కడ?

`రాని లారీలకు బిల్లులు.. అధికారుల జేబుల్లోకి కోట్లు!
`వడ్ల కొనుగోలులో ఏటా ఇదే దోపిడీ!
`అధికారులే ట్రాన్స్ పోర్ట్ బినామీలు?
`డి ఏంల చేతుల్లేనే లారీల లెక్కలు!
`అన్ని లెక్కలు కాగితాల మీదనే…
`లారీలు మాత్రం కనిపించడం లేవాయే!
`లారీలు..రైతు గోసలు!
`అధికారులు.. లాలూఛీలు!
`ప్రభుత్వానికి అప్రతిష్టలు!
`ఏటెటా ఇవే ఇబ్బందులు.. అధికారులు ఏం చేస్తున్నట్లు!
`కోట్ల రూపాయలు ఏటా కొల్ల గొడుతున్నారు!
`ప్రభుత్వానికి నామం పెడుతున్నారు?
`దశాబ్దలు గడుస్తున్నా సమస్య పరిస్కారం ఎందుకు కావడం లేదు!
`సమస్యలు లేకుండా చేయాలనే చిత్త శుద్ధి ఎందుకు లేదు!
`సమస్య పరిష్కరిస్తే అధికారుల జేబులు నిండవు!
`తెలంగాణ వ్యాప్తంగా వరి పంటపై కచ్చితమైన లెక్కలున్నాయి!
`ఏ ఊరిలో ఎంత వరి పండిస్తున్నారో రికార్డులున్నాయి.
`ప్రతి జిల్లా లెక్కలు అధికారులకు అందుబాటులోనే వున్నాయి.
`జిల్లా వ్యాప్తంగా వరి సేకరణకు ఎన్ని లారీలు అవసరమో అధికాలకు తెలుసు!
`దాని ప్రకారమే లారీలను ట్రాన్స్ పోర్ట్ కోసం టెండర్ ప్రకటిస్తున్నారు!
`ట్రాన్స్ పోర్ట్ టెండర్లకు బిల్లులు చెల్లిస్తున్నారు!
`అయినా వడ్లు కల్లాలలోనే ఎందుకుంటున్నాయి!
`ఐకేపీ సెంటర్లు దాటి మిల్లులకు ఎందుకు చేరలేక పోతున్నాయి!
`రోజుల తరబడి రైతులు ఎందుకు ఎదురు చూస్తున్నారు?
`ఆఖరుకు రైతులనే ట్రాక్టర్లు తెచ్చుకొమ్మని ఎందుకు చెబుతున్నారు!
`టెండర్ పాడిన లారీలు ఎక్కడ తిరుగుతున్నాయి!

హైదరాబాద్, నేటిధాత్రి:
ప్రతి సీజన్ రైతులు పండించిన వరిని సేకరించక తప్పడం లేదు. అందుకోసం పెద్దఎత్తున ప్రభుత్వం ఖర్చు చేయక తప్పడం లేదు. సకాలంలో వరి కొనుగోలు చేయక తప్పడం లేదు. అందుకోసం వ్యవస్దలన్నింటినీ సమాయత్తం చేయక తప్పడం లేదు. వరి కొనుగోలు చేసిన వెంటనే రైతుల ఖాతాల్లో డబ్బులు వేయక తప్పడం లేదు. ఏది తప్పడం లేదు. అందులో ప్రతి సారి ప్రభుత్వం విమర్శలు పాలు కాక తప్పడం లేదు. ప్రతిపక్షాలు ప్రశ్నించక తప్పడం లేదు. రైతుల ఆగ్రహం తప్పడం లేదు. ఇంత చేసినా ప్రభుత్వానికి మంచి పేరు రావడం లేదు. దీనంతటికీ కారణం ఎవరు? రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంత చేస్తున్నా..ఎంత చేసినా విమర్శలు తప్పడం లేదు. ఆరోపణలు గుప్పించకుండా ప్రతిపక్షాలు వుండడం లేదు. తొలకరి నుంచి మొదలు నారు పోసే నాటి నుంచి పండిన వరి పంటలో ఆఖరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తూనే వుంది. ప్రభుత్వం వద్ద డబ్బులు లేకున్నా బ్యాంకుల నుంచి రుణాలు తెచ్చి మరీ రైతుల ఖాతాల్లో ఆలస్యం కాకుండా సొమ్ము జమ చేస్తూనే వుంది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొనుగోలు విషయంలో ఎన్ని రకాల ఆరోపణలు వచ్చినా, రైతుల ఖాతాల్లో సకాలంలో డబ్బులు పడలేదన్న మాట మాత్రం ఏ ఒక్క రైతు నోటి నుంచి రాలేదు. ప్రతిపక్షాలకు ఆ అవకాశం చిక్కలేదు. కాని కొనుగోలు వ్యవహారంలో మాత్రం రేవంత్ సర్కారును ఇరుకున పెడుతున్నది ఎవరు? రేవంత్ సర్కారుపై విమర్శలు రావడానికి కారణమౌతున్నది ఎవరు? అని ఆలోచిస్తే సివిల్ సప్లైకి చెందిన అదికారులే ప్రభుత్వం మీద నిందలకు కారనమని తేలుతోంది. సివిల్ సప్లయ్ శాఖలో ఉన్నత స్దానాల్లో వున్న డిఎంలు, జిల్లా జాయింట్ కలెక్టర్ల మÖలంగానే ప్రభుత్వం ఆరోపణలు ఎదుర్కొంటోంది. అనర్దాలు జరుగుతున్నాయి. ఏటా రెండు సీజన్లలో వరి ప్రభుత్వం కొనుగోలు చేయాల్సి వుంటుంది. ఆ వరి కొనుగోలు సమయానికి ముందే రాష్ట్ర ప్రభుత్వం ట్రాన్స్‌పోర్టు టెంటర్లు పిలుస్తారు. అందుకే అవసరమైన అడ్వాన్సులు కూడా ఇస్తుంటారు. అయినా కొనుగోలులో ఆలస్యమే కాదు..నిర్ణీత సమయంలో కొనుగోలు జరక్కుండా జాప్యం జరుగుతూ వుంది. రైతుల్లో ఆగ్రహానికి కారణమౌతుంది. ప్రతిపక్షాల రాజకీయానికి దారి తీస్తోంది. రైతులతో కలిసి, రాజకీయం చేయడానికి ప్రతిపక్షాలకు వీలు కల్పించినట్లౌవుతుంది. దీనంతటకీ కారణం కేవలం అదికారులు మాత్రమే? వడ్లు కొనుగోలు కోసం ప్రభుత్వం లారీల టెండర్లును పిలుస్తారు. అదంతా జిల్లా స్దాయిలో డిఎం స్దాయి అదికారులు చూసుకుంటారు. వడ్లు కళ్లాలకు వచ్చే సమయం వరకు లారీలు రెడీగా వుండాలి. ప్రతి గ్రామంలో ఖరీఫ్, రబీ సీజన్‌లలో ఎంత పంట వేస్తున్నారనే దానిపై ఖచ్చితమైన లెక్కలుంటాయి. దాంతోపాటు ప్రతి మండలం, జిల్లా స్ధాయి, రాష్ట్ర స్ధాయి వరకు ఖచ్చితమైన సమాచారం పొందు పర్చబడి వుంటుంది. ముఖ్యంగా గత పదేళ్ల సమయంలో వరి సాగు ఎలా పెరిగిందో లెక్కలున్నాయి. ఎంత సాగౌతుందో లెక్కలున్నాయి. ఏటా ఎలా సాగు పెడుతుందో లెక్కలున్నాయి. పెరిగిన సాగు విస్తీర్ణంపై పూర్తి వివరాలు పొందుపర్చబడి వున్నాయి. సీజన్ ప్రారంభంలోనే ఈ వివరాలు గ్రామ స్ధాయి నుంచి అదికారులు సేకరిస్తూనే వున్నారు. వరి పంట ఎంత చేతికొస్తుందో అన్నదానిపై కూడా పూర్తి లెక్కలు తేల్చబడే వున్నాయి. దానికి అనుగుణంగా లారీలను సిద్దం చేస్తుంటారు. లారీ టెండర్లును పిలుస్తుంటారు. అందులో ఒకటో, రెండో లారీలు సమయానికి రాలేదంటే పెద్ద విషయం కాదు. కాని లారీ టెండర్లు పిలిచి అన్నీ సిద్దం చేసుకున్నా ఎందుకు లారీలు రావడంలేదు. కల్లాలనుంచి ఎందుకు వడ్లు ఎత్తుడం లేదు? ఆఖరు నిమిషంలో అదికారులు ఎందుకు రైతులు ట్రాక్టర్లు ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. రైతులకు రవాణా ఖర్చులు ఇస్తామని ఎందుకు వెల్లడిస్తున్నారు? ఇది వ్యవస్థ లోపమా? లేక అధికారుల పైత్యమా? అంటే లంచాలకు అలవాటు పడిన అదికారులు అటు రైతులు, ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని చేస్తున్న మోసమని చెప్పక తప్పదు. వందల కోట్లు మింగుతున్నారని చెప్పక తప్పదు. అవును..లారీల టెండర్ల వ్యవహారంలో కోట్ల రూపాయలు దిగమింగుతున్నది అదికారులే అనే విషయాలు బైటకు వస్తున్నాయి. లారీల టెండర్ల విషయంలో బినామీలను ఏర్పాటు చేసుకొని అదికారులే ఈ మోసాలకు తెగబడుతున్నారు. లారీల టెండర్ల పేరుతో కొంత మంది తమ బినామీలను ఏర్పాటు చేసుకొని లారీలను సమకూర్చుతున్నట్లు రికార్డులు సృష్టిస్తారు. లారీ యÖనియన్లతో మాట్లాడుకొని లారీల నెంబర్ల లిస్టులను తీసుకుంటారు. ఆ లారీలను వడ్లు ఎత్తేందుకు సమాయత్తం చేస్తున్నట్లు రికార్డులు తయారు చేస్తారు. కాని ఆ లారీలు వుండవు. కల్లాల వద్దకు రావు. ఆ నెంబర్ కల్గిన లారీలు ఎక్కడో మైనింగ్ పనుల్లో బిజీగా వుంటాయి. మైనింగ్ రవాణాలో తిరుగుతుంటాయి. కాని వడ్ల కొనుగోలులో కల్లాలో వున్నట్లు, వడ్లు రవాణా చేస్తున్నట్లు మాత్రం లెక్కలుంటాయి. పైగా రెండు మÖడు లారీలకు కూడా ఒకే నెంబర్ వుంటుంది. అలాంటి లారీలను ఒక వేళ పట్టుకున్నా ఆ లారీలు వడ్ల రవాణాలో వున్నట్లు తప్ప్పుడు దృవపత్రాలు సృష్టిస్తారు. ప్రభుత్వం సొమ్ముకు కన్నం వేస్తుంటారు. ఇలా ప్రతి సీజన్‌లో కొన్ని వందల కోట్లు జిల్లాల సివిల్ సప్లై అదికారులు దోచుకుంటున్నారు. పైకి మాత్రం తమకు ఏ పాపం తెలియదనట్లు నటిస్తుంటారు. వాటాలు పంచుకుంటారు. ప్రభుత్వాన్ని మోసం చేస్తున్నారు. అందుకే ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరడం లేదు. ప్రభుత్వం ఎంత చిత్తశుద్దితో పనిచేస్తున్నా అధికారులు అందుకు సహకరించడం లేదు. దాంతో ప్రభుత్వం రైతుల చేత ఆరోపణలు ఎదుర్కొవాల్సి వస్తుంది. గత నెల రోజులుగా వడ్లు చాలా ప్రాంతాల్లో కల్లాలకు వచ్చి చేరుకున్నాయి. అయినా వాటి కొనుగోలు వేగం అందుకోవడం లేదు. రైతులు రాస్తారోకో చేయడం వంటివి చేస్తున్నారు. ఇలా రైతుల ఆగ్రహం తీవ్రతరం అయిన తర్వాత అదికారులు చావు కబురు చల్లగా చెప్పినట్లు, రైతులు సొంతంగా ట్రాక్టర్లు ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తారు. రైతులు ట్రాక్టర్ల ద్వారా తెచ్చిన వడ్లకు ట్రాక్టర్ కిరాయి చెల్లించి, అదికారులు లారీలలో వడ్లు సేకరించినట్లు లెక్కలు రాసుకుంటారు. ట్రాన్స్‌పోర్టు కిరాయిల లెక్కలన్నీ జేబులు నింపుకుంటున్నారు. రేవంత్ సర్కారు రైతులకు ఎక్కడా ఇబ్బంది కలగొద్దు. కొనుగోలులో జాప్యం చేయెద్దని ఎన్ని ఆదేశాలు జారీ చేసినా అధికారులు హడావుడి తప్ప మరేం కనిపించదు. రైతులు ఫోన్లు చేసినా సమాధానం చెప్పే దిక్కుండదు. అందుకే గత ఇరవై రోజులుగా వడ్ల కొనుగోలు గందరగోళంగా మారింది. ఈసారి అదికారులు మరింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఇదే సరైన సమయమని ప్రతిపక్షాలు రంగంలోకి దిగి రాజకీయం చేస్తున్నాయి. ఫ్రభుత్వం ఇప్పటికైనా తేరుకోవాలి. జిల్లాల వారిగా జాయింట్ కలెక్టర్లు, డిఎంలు సాగిస్తున్న అక్రమ వ్యవహరం అంతు చూడాలి. ఏ జిల్లాలో ఎన్ని లారీలు ఎవరు టెండర్ పలిచారు? ఎన్ని లారీలు వచ్చాయి? వచ్చిన లారీలు ఎన్ని? రాని లారీలు ఎన్ని? రాకున్నా వచ్చినట్లు రికార్డుల్లో నమోదైన లారీలు ఎన్ని? ట్రాక్టర్లలో రైతులు ఎక్కడెక్కడ వడ్లు తరలించారు. అనే విషయాలపై ఆ శాఖ రాష్ట్ర స్ధాయి అధికారులు దృష్టిపెడితే డిఎంల బాగోతం బైట పడుతుంది. ఏటా వందల కోట్లు ఎలా మాయమైపోతున్నాయో తేలిపోతుంది.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version