సర్పంచులను వేధిస్తే ఊరుకోం…

సర్పంచులను వేధిస్తే ఊరుకోం…

– ప్రతి జిల్లాలో ‘లీగల్ సెల్’ ఏర్పాటు

* కాంగ్రెస్ బెదిరింపులకు భయపడొద్దు.. న్యాయపరంగా అండగా ఉంటాం

* రెండేళ్లలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత

* సిరిసిల్లలో నూతన సర్పంచులకు దిశానిర్దేశం చేసిన కేటీఆర్

సిరిసిల్ల(నేటి ధాత్రి):

 

రాష్ట్రంలో కొత్తగా ఎన్నికైన సర్పంచులను ఇబ్బంది పెట్టాలని చూస్తే సహించేది లేదని, వారి రక్షణ కోసం ప్రతి జిల్లాలో బిఆర్‌ఎస్ పార్టీ తరఫున ప్రత్యేక న్యాయ విభాగాన్ని (Legal Cell) ఏర్పాటు చేస్తున్నామని బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. ఆదివారం సిరిసిల్లలోని తెలంగాణ భవన్‌లో రాజన్న సిరిసిల్ల జిల్లా నుండి గెలుపొందిన నూతన సర్పంచుల సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా గెలిచిన అభ్యర్థులను అభినందిస్తూ, వారికి భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు.

ప్రతి జిల్లాలో సర్పంచుల కోసం లీగల్ సెల్ ఏర్పాటు:

సర్పంచ్ ఎన్నికల్లో గెలిచిన బిఆర్‌ఎస్ మద్దతుదారులు కాంగ్రెస్ పార్టీ బెదిరింపులకు భయపడవద్దని కేటీఆర్ భరోసా ఇచ్చారు. “మిమ్మల్ని సస్పెండ్ చేస్తాం, ఇబ్బంది పెడతాం అని ఎవరైనా అధికారులు గానీ, పాలకపక్ష నేతలు గానీ బెదిరిస్తే ఒక్క క్షణం కూడా ఆలోచించకండి. వెంటనే పార్టీని సంప్రదించండి. మీ కోసం ప్రతి జిల్లాలో లీగల్ సెల్ ఏర్పాటు చేస్తున్నాం. అరగంటలో పార్టీ యంత్రాంగం మీకు అండగా నిలుస్తుంది, కోర్టు ద్వారా మన హక్కుల కోసం కొట్లాడుదాం” అని కేటీఆర్ స్పష్టం చేశారు. రాజ్యాంగబద్ధంగా గ్రామాలకు రావాల్సిన ఫైనాన్స్ కమిషన్ నిధులను ఎవరూ ఆపలేరని, ఆ నిధులు సాధించుకునే బాధ్యత తాము తీసుకుంటామని హామీ ఇచ్చారు.

కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత:

కేవలం రెండేళ్ల పాలనలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందని కేటీఆర్ విమర్శించారు. రైతుబంధు, రుణమాఫీ, పెన్షన్లు, మహిళలకు తులం బంగారం వంటి హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో 40 నుండి 70 శాతం స్థానాల్లో బిఆర్‌ఎస్ మద్దతుదారులు గెలవడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. సూర్యాపేట జిల్లాలో మల్లయ్య యాదవ్ హత్య, తిప్పర్తిలో కిడ్నాప్ వంటి ఘటనలను ప్రస్తావిస్తూ.. కాంగ్రెస్ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి పంచాయతీ ఎన్నికల్లో ప్రచారం చేసిన ప్రజల వ్యతిరేకత నుంచి కాంగ్రెస్ని కాపాడలేకపోయారని కేటీఆర్ అన్నారు. మంత్రులు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నాయకుల అరాచకాలకు బెదరకుండా భయపడకుండా ప్రజలు మా పార్టీ నేతలు నిలబడ్డారని…అందుకే అత్యధిక స్థానాల్లో ప్రతిపక్షంలో ఉన్న మా పార్టీని గెలిపించారని కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పట్ల నెలకొన్న తీవ్రమైన అసంతృప్తికి వ్యతిరేకతకు పంచాయతీరాజ్ ఎన్నికల ఫలితాలు నిదర్శనం అన్నారు.

పదవి ముఖ్యం కాదు.. పనే ముఖ్యం:

సర్పంచులు కేవలం పదవులను అలంకారప్రాయంగా కాకుండా, గ్రామ అభివృద్ధికి సాధనంగా వాడుకోవాలని కేటీఆర్ సూచించారు. సూర్యాపేట జిల్లాలోని ‘ఏపూర్’ గ్రామాన్ని ఉదాహరణగా తీసుకుంటూ.. అక్కడ చెక్ డ్యాంలు, వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనం వంటి నిర్మాణాలతో ఆ గ్రామం దేశంలోనే ఉత్తమ పంచాయతీగా అవార్డు పొందిందని గుర్తుచేశారు. ఐదేళ్ల తర్వాత ప్రజలు మనల్ని గుర్తుపెట్టుకోవాలంటే, మనం చేసిన పనే మనకు శ్రీరామరక్ష అని హితవు పలికారు. పల్లె ప్రగతి ద్వారా ప్రతి ఊరిలో నర్సరీ, డంప్ యార్డ్, ట్రాక్టర్, వైకుంఠధామం వంటివి ఏర్పాటు చేసి గ్రామాల రూపురేఖలు మార్చామని తెలిపారు.

గెలిచిన సర్పంచులకు త్వరలో శిక్షణా తరగతులు:

స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ పూర్తయిన వెంటనే, గెలిచిన సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలకు పంచాయతీరాజ్ చట్టం, విధులు, హక్కులపై అవగాహన కల్పించేందుకు నిపుణులతో ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహిస్తామని కేటీఆర్ వెల్లడించారు. మిగిలిన విడత ఎన్నికల్లోనూ పార్టీ శ్రేణులు కష్టపడి గులాబీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు.

పదేళ్ల బిఆర్ఎస్ పాలనలో గ్రామాల అభివృద్ధిలో తెలంగాణ రికార్డు:

దేశ జనాభాలో కేవలం 3 శాతం ఉన్న తెలంగాణ, కేంద్రం ప్రకటించిన ఉత్తమ పంచాయతీ అవార్డుల్లో 30 శాతం కైవసం చేసుకుందని, ఇది కేసీఆర్ పాలన దక్షతకు నిదర్శనమని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ రికార్డును దేశంలో ఏ రాష్ట్రం కూడా సాధించలేదని అన్నారు. ప్రతి గ్రామంలో కనీస మౌలిక వసతులను ఏర్పాటు చేశామని ప్రతి గ్రామానికి పరిశుద్ధ నిర్వహణ నుంచి మొదలుకొని పచ్చదనం వరకు తాగునీటి సరఫరా వరకు అన్ని రంగాల్లో అద్భుతమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామన్నారు. అందుకే తెలంగాణ పంచాయతీ రాజ్ వ్యవస్థకు కేంద్రం నుంచి అనేక అంశాల్లో ఉత్తమ గ్రామపంచాయతీలు ఉత్తమ జిల్లా పరిషత్తులు అవార్డులను దక్కించుకున్నాయన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version