మొక్కజొన్న రైతులను ఆదుకోవాలి…

మొక్కజొన్న రైతులను ఆదుకోవాలి

ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో పరిమితి పెంచాలని డిమాండ్

విక్రయించిన రైతులకు వెంటనే చెల్లింపులు చేయాలని డిమాండ్

ఎంసీపీఐ(యు) రాష్ట్ర కమిటీ సభ్యుడు మర్రిపెల్లి మొగిలి

కేసముద్రం/ నేటి ధాత్రి

ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో మొక్కజొన్నలను విక్రయించిన రైతులను తక్షణమే ఆదుకోవాలని ఎంసిపిఐఐ(యు) రాష్ట్ర కమిటీ సభ్యుడు మరిపెళ్లి మొగిలి డిమాండ్ చేశారు. శుక్రవారం కేసముద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ స్థానిక వ్యవసాయ మార్కెట్‌లో ఏర్పాటు చేసిన ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో ఎకరాకు కేవలం 26½ క్వింటాళ్ల మొక్కజొన్నలనే కొనుగోలు చేస్తున్నారని తెలిపారు.

ఈ ఏడాది ప్రతి రైతుకు ఎకరాకు 35 నుంచి 45 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చినప్పటికీ, ప్రభుత్వ కొనుగోలు పరిమితి తక్కువగా ఉండడంతో మిగిలిన మొక్కజొన్నలను ప్రైవేటు వ్యాపారులకు తక్కువ ధరలకు అమ్మాల్సి వస్తోందని పేర్కొన్నారు. దీనివల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ఎకరాకు కనీసం 40 క్వింటాళ్ల మొక్కజొన్నలను కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఇక ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో మొక్కజొన్నలను విక్రయించిన రైతులకు ఇప్పటివరకు చెల్లింపులు జరగలేదని మొగిలి తెలిపారు. గత నెల 31న మార్కెట్ ఆవరణలో కొనుగోలు కేంద్రం ప్రారంభమైనప్పటి నుంచి దాదాపు 400 మంది రైతులు తమ మొక్కజొన్నలను విక్రయించినప్పటికీ, ఒక్క రూపాయి కూడా వారి ఖాతాల్లో జమ కాలేదని పేర్కొన్నారు. క్వింటాలుకు రూ.2400 ధర వస్తుందని ఆశించి ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలో విక్రయించిన రైతులను డబ్బులు అందక తీవ్ర నిరాశకు గురవుతున్నారని చెప్పారు.

గ్రామాల్లో ప్రైవేటు వ్యాపారులు 15 రోజుల వాయిదాతో చెల్లింపులు చేస్తుంటారని, ఇదే విధంగా ప్రభుత్వం కూడా వ్యవహరించడం సరికాదని విమర్శించారు. మార్కెట్ నిబంధనల ప్రకారం సరుకు విక్రయించిన రోజే చెక్కు జారీ చేయాలని ఉన్న నేపథ్యంలో, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో కూడా అదే రోజు రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version