గత సంవత్సరం కంటే మిన్నగా యూరియా నిలువలు.
యూరియా కొరత అనేది డీలర్ల సృష్టి…
అధికారులపై మండిపడ్డ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి
నర్సంపేట,నేటిధాత్రి:
నర్సంపేట డివిజన్ పరిధిలో
గత సంవత్సరం కంటే మిన్నగా యూరియా నిలువలు ఉన్నాయని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. నర్సంపేట డివిజన్లో యూరియా కొరతలు అధికమవడం వలన రైతులు ఇబ్బంది పడుతున్నారని వస్తున్న ఫిర్యాదుల మేరకు నర్సంపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ,సహకార,రెవెన్యూ శాఖల అధికారులతో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా యూరియా కొరత రైతులు పడుతున్న ఇబ్బందులపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గత సంవత్సరం కన్నా మిన్నగా యూరియా సరఫరా ఉందని,రైతులు ఆందోళన చెందొద్దని తెలియజేశారు.సహకార సంఘం,వ్యవసాయ శాఖ రెవెన్యూ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించి డీలర్ల నుండి రైతులకు యూరియా ఎరువులు పంపిణీ జరిగేలా చూడాలని లేని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.మీ పర్యవేక్షణ లోపం వల్లే రైతులు ఇబ్బందులు పడుతున్నారని సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా ప్రతిపక్షాలు అల్ప సంతోషంతో రైతులను రెచ్చగొడుతూ పత్రికల్లో ప్రకటన కోసం హడావుడి చేస్తున్నారని అన్నారు.రైతులు కూడా జాగ్రత్తగా ఎరువులను వాడుకోవాలని,అధిక మోతాదులో యూరియాను వినియోగించకుండా తగిన మోతాదులో వాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట ఆర్డిఓ ఉమారాణి నర్సంపేట వ్యవసాయ శాఖ వసంచాలకులు దామోదర్ రెడ్డి, నర్సంపేట ఎమ్మార్వో రవిచంద్ర రెడ్డి, నర్సంపేట వ్యవసాయ శాఖ అధికారి కృష్ణ ప్రసాద్, వివిధ మండలాల ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.