చిన్నారుల అశ్లీల వీడియోల కేసులో ఇద్దరి అరెస్ట్

https://netidhatri.com/wp-content/uploads/2025/08/download-31-2.wav?_=1

చిన్నారుల అశ్లీల వీడియోల కేసులో ఇద్దరి అరెస్ట్

మందమర్రి నేటి ధాత్రి

మందమర్రి పోలీసుల హెచ్చరిక

చిన్నారులకు సంబంధించిన అశ్లీల వీడియోలను సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లైన ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లలో షేర్ చేసిన కేసులో మందమర్రికి చెందిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇటువంటి చర్యలపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ వింగ్ నిఘా ఉంచి, కఠిన చర్యలు తీసుకుంటుందని పోలీసులు హెచ్చరించారు.
జాతీయ సంస్థ నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్‌ప్లోయిటెడ్ చిల్డ్రన్ (ఎన్ సి ఎం ఈ సి ) అందించిన సమాచారం ఆధారంగా, తెలంగాణ సైబర్ సెక్యూరిటీ వింగ్ ఈ కేసును మందమర్రి పోలీసులకు అప్పగించింది. దీనిపై స్పందించిన మందమర్రి ఎస్సై రాజశేఖర్ సైబర్ చట్టం కింద రెండు కేసులు నమోదు చేశారు. అనంతరం, మందమర్రి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కె. శశిధర్ రెడ్డి దర్యాప్తు చేసి, నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
ఈ సందర్భంగా మీడియాకు వివరాలు వెల్లడించిన ఇన్‌స్పెక్టర్ కె. శశిధర్ రెడ్డి, “నాలుగు గోడల మధ్య కూర్చుని తమ మొబైల్స్‌లో చిన్నారుల అశ్లీల వీడియోలు లేదా ఫోటోలు చూసినా, ఇతరులకు పంపినా ఎవరికీ తెలియదు అనే భ్రమలో చాలామంది ఉంటున్నారు. కానీ, వారికి తెలియకుండానే వారు నేరస్తులుగా మారుతున్నారు. తెలిసి చేసినా, తెలియక చేసినా చట్టం దృష్టిలో ఇటువంటి చర్యలు తీవ్రమైన నేరాలుగా పరిగణించబడతాయి” అని స్పష్టం చేశారు.
ఇంటర్‌నెట్‌లో చిన్నారుల అశ్లీలతను వెతకడం, షేర్ చేయడం, ఫార్వర్డ్ చేయడం లేదా ప్రచారం చేయడం అత్యంత తీవ్రమైన నేరాలు. ఇటువంటి చర్యలకు పాల్పడిన ప్రతి ఒక్కరిపైనా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ వింగ్ సైబర్ పెట్రోలింగ్ ద్వారా నిఘా ఉంచి, చట్టపరమైన చర్యలు తీసుకుంటుందని ఆయన హెచ్చరించారు.
సమాజంలో చిన్నారుల రక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, సామాజిక మాధ్యమాల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అశ్లీల విషయాలకు దూరంగా ఉండాలని సూచించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version