సచ్చిదానందమే పరమానందం
◆-: కంది హరేకృష్ణ టెంపుల్ బాధ్యులు శ్రీ గోకులేష్ ప్రభుజీ
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్, జనవరి 11: మనిషి తాత్కాలిక సుఖాల కోసం వేంపర్లాడుతూ శాశ్వతమైన ఆనందాన్ని కోల్పోతున్నాడని సంగారెడ్డి జిల్లా కంది హరేకృష్ణ టెంపుల్ బాధ్యులు శ్రీ గోకులేష్ ప్రభుజీ ఆవేదన వ్యక్తం చేశారు. అనునిత్యం జ్ఞానంతో కూడిన చింతన చేస్తూ సదా కృష్ణ భక్తిలో లీనమైనవారికి సచ్చిదానందం కలుగుతుందని అదే జీవన పరమానందమని పేర్కొన్నారు. జహీరాబాద్ హరేకృష్ణ మూమెంట్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం స్థానిక శ్రీ వెంకటేశ్వరాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సత్సంగ సమావేశంలో ఆయన పాల్గొని ప్రవచించారు.మనిషికి ఉన్న ఇంద్రియాలు స్వీయ తృప్తి కోసం కాకుండా శ్రీకృషుడి సేవకోసం వినియోగించాలని సోదాహరణంగా వివరించారు. ఇంద్రియాలను విషాపూరిత సర్పాలతో పోలుస్తూ ఇంద్రియాలను కట్టడి చేసినపుడే భగవద్భక్తి యందు ప్రేరణ కల్గుతుందని తద్వారా దుఃఖలయానికి నెలవుగా ఉన్న ప్రపంచంలో మనిషి ఆనందంగా గడపవచ్చని సెలవిచ్చారు. సాంఖ్య యోగంలోని 58 వ శ్లోకాన్ని వివరిస్తూ తాబేలు ఏ రకంగా తనకు అవసరమున్నపుడే తన శరీర భాగాలను బయటకు తీస్తుందో అదేవిధంగా మనిషి తన అవసరార్థం ఇంద్రియాలను ఉపయోగించుకుంటూ సత్కర్మలను ఆచరించాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రపంచం మొత్తం యుద్దానికి కాలు దువ్వుతున్నాయని అయితే ఇది చెడు పర్యావసనాలకు దారి తీస్తుందని ఆందోళన వెలిబుచ్చారు. భవిష్యత్ తరాలకు ప్రభుపాదుల వారు అందించిన హితోపదేశాలు మానవాళి మనుగడకు దోహదపడే విధంగా ఉన్నాయని వాటిని అవగతం చేసుకొని ఆచరించడమే కృష్ణ భక్తుల కర్తవ్యమని బోధించారు.అంతకు ముందు రసరమ్యకర కీర్తనలు ఆలపిస్తూ మహీంద్రా కాలనీ వీధుల్లో శోభాయాత్ర నిర్వహించారు. కీర్తనలకు అనుగుణంగా నృత్యాలు చేస్తూ భక్తులు పారవశ్యంలో మునిగిపోయారు.భక్తుల కోలాహలాలమధ్య 189వ నగర సంకీర్తన వైభవంగా ముగిసింది.
