ట్రాఫిక్ రద్దీతో సిద్ధిక్ నగర్ ప్రజల నరకయాతన – డీసీపీకి ఆంజనేయులు సాగర్ వినతి
శేరిలింగంపల్లి, నేటి ధాత్రి :-
అంజయ్య నగర్ డివిజన్ పరిధిలోని సిద్ధిక్ నగర్ కాలనీలో నెలకొన్న తీవ్ర ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని కోరుతూ అంజయ్య నగర్ డివిజన్ సీనియర్ నాయకులు ఆంజనేయులు సాగర్ సోమవారం సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ రాజన్ రతన్ కుమార్ (IPS) గారిని మరియు అసిస్టెంట్ డీసీపీ హనుమంత్ రావు గారిని కలిసి వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆంజనేయులు సాగర్ మాట్లాడుతూ, సిద్ధిక్ నగర్ అమ్మవారి టెంపుల్ సమీపంలో రహదారి అత్యంత ఇరుకుగా ఉండటంతో నిత్యం ట్రాఫిక్ స్తంభిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. హైటెక్ సిటీకి వెళ్లే ఐటీ ఉద్యోగులు, ఇతర ప్రైవేట్ సంస్థల సిబ్బంది ఇదే మార్గం గుండా వెళ్లాల్సి ఉండటంతో, ప్రతిరోజూ వాహనదారులు సుమారు 20 నిమిషాల పాటు రోడ్డుపైనే పడిగాపులు కాయాల్సి వస్తోందని వివరించారు.భారీ వాహనాలు మరియు ద్విచక్ర వాహనాల రద్దీ వల్ల చివరకు అత్యవసర సేవలైన అంబులెన్స్‌లు కూడా ట్రాఫిక్‌లో చిక్కుకుపోతున్నాయని, ఇది ప్రాణాపాయానికి దారితీసే అవకాశం ఉందని ఆయన అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.
