కార్మికులు,గ్రామీణ పేదల శ్రమను కార్పొరేట్ శక్తులకు తాకట్టు పెడుతున్న పాలకులు…
నేటి ధాత్రి -మహబూబాబాద్ -గార్ల :-
వ్యవసాయ కార్మికులు, గ్రామీణ పేదల శ్రమను కార్పొరేట్ శక్తుల లాభాల కోసం పాలకులు తాకట్టు పెడుతున్నారని కార్మిక సంఘాల నాయకులు అన్నారు.కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక, ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసే విధానాలను వ్యతిరేకిస్తూ జాతీయ కార్మిక సంఘాల దేశవ్యాప్త సమ్మెలో భాగంగా బుధవారం గార్ల మండల కేంద్రంలో సిఐటియు, ఏఐటీయూసీ,ఐ ఎఫ్ టి యు, ఐ ఎన్ టి యు సి,బిఆర్ఎస్, విశ్వ సమాజం కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సమ్మె నిర్వహిస్తూ,పట్టణ పూరవీధుల్లో భారీ ప్రదర్శన నిర్వహించారు.
ఈ సందర్భంగా కార్మిక సంఘాల రాష్ట్ర నాయకులు కందునూరి శ్రీనివాస్,కట్టెబోయిన శ్రీనివాస్, గుగులోతు సక్రు, విశ్వ జంపాల,గంగావత్ లక్ష్మణ్ నాయక్ ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,కేంద్ర ప్రభుత్వం పరిశ్రమలు,వ్యవసాయ రంగంలో ప్రతికూలమైన విధానాలను అమలు చేస్తుందని అన్నారు.ప్రభుత్వం ఉపాధి మరియు సామాజిక భద్రతా నిబంధనలపై తప్పుడు వాదనలు చేస్తుందన్నారు.
కేంద్ర బిజెపి ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను 29 కుదిస్తూ నాలుగు లేబర్ కోడ్ లు తీసుకువచ్చి కార్మిక వర్గాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పనంగా వారి శ్రమను అమ్మ చూస్తుందన్నారు.కార్మిక వ్యతిరేక,యజమాని అనుకూల నాలుగు లేబర్ కోడ్ లకు వ్యతిరేకంగా,ట్రేడ్ యూనియన్ ఉద్యమాన్ని అణిచివేయడానికి సమిష్టి బేరసారాలకు వారి హక్కును లాక్కోవడానికి,సమ్మె చేసే హక్కును,యజమానులు కార్మిక చట్టాలను ఉల్లంఘించడాన్ని,నేర రహితంగా చేయడానికి, ట్రేడ్ యూనియన్ల కార్యకలాపాలను నేరంగా పరిగణించడానికి వ్యతిరేకంగా కార్మిక సంఘాలు పోరాడుతున్నాయని అన్నారు.కనీస వేతన చట్టం చేయని ప్రభుత్వం ప్రస్తుతం ఎనిమిది గంటల పని సమయాన్ని 12 గంటలుగా పెంచేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుందని వారు విమర్శించారు.ఈ సమ్మె కార్యక్రమంలో అంగన్వాడి, హమాలీ కార్మికులు, ఆశా కార్యకర్తలు,మధ్యాహ్న భోజన కార్మికులు,ఐకెపి, గ్రామపంచాయతీ కార్మికులు, గ్రామ సేవకులు, అసంఘటిత రంగ కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు అలవాల సత్యవతి,జంపాల వెంకన్న,మాలోత్ మాన్య, రామకృష్ణ,ఎం సురేష్,భారతి, పద్మ తదితరులు పాల్గొన్నారు.