ఆర్కేపీ లో గుప్పుమంటున్న గుడుంబా.

ఆర్కేపీ లో గుప్పుమంటున్న గుడుంబా….

– ఆర్కేపీ లో గుట్టుగా గుడుంబా తయారీ
– పులిమడుగు లో జోరుగా గుడుంబా విక్రయాలు
– రూ. లక్షలు సంపాదిస్తున్న అక్రమార్కులు
– గుడుంబా మూలలపై దృష్టి సారించని ఎక్సైజ్‌శాఖ, పోలీస్ శాఖ

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

RKP

రామకృష్ణాపూర్, పులిమడుగు, తిమ్మాపూర్ ఏరియాలలో గుడుంబా గుప్పుమంటోంది. కొన్నేళ్లుగా స్తబ్దుగా ఉన్న నాటుసారా తయారీ మళ్లీ పుంజుకుంటోంది. గుడుంబా తయారీదారులు గుట్టుచప్పుడు కాకుండా తయారు చేసి రహస్యంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తూ దందా సాగిస్తున్నారు. మద్యం ధరలు విపరీతంగా పెరగడంతో పేద, మధ్య తరగతి ప్రజలు నాటుసారా వైపు మల్లుతున్నారు. గుడుంబాను నిరోధించాల్సిన సంబంధిత ఎక్సైజ్‌ అధికారులు మూలాలపై దృష్టి పెట్టకుండా మామూళ్ల మత్తులో అడపాదడప దాడులు చేస్తూ అమ్మకందారులకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారనే విమర్శలు వస్తున్నాయి. పోలీసులు రాత్రి వేళల్లో గుడుంబా విక్రయాల ప్రదేశాలను కనిపెట్టి గుడుంబా విక్రయాలను అరికట్టేందుకు కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు. గతంలో గుడుంబా తయారు చేసేవాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం పునరావాసం కల్పిస్తూ పలు పథకాలను అమలు చేసింది. అయినప్పటికీ కొందరు గుడుంబా కాయడమే వృత్తిగా పెట్టుకుని రామకృష్ణాపూర్ పట్టణంలోని రైల్వే స్టేషన్ ఏరియా,కాకతీయ కాలనీ, ఆర్కే ఫోర్ గడ్డ,రామాలయం, ఆర్కే వన్, పులిమడుగు ఏరియాలలో జోరుగా దందాను సాగిస్తున్నారు.మద్యం ధరలు ఎక్కువగా ఉండడంతో పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన వారు తక్కువ ధరలో లభించే గుడుంబా వైపు మరులుతున్నారని తెలుస్తుంది.దీంతో సారా అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. గుట్టుచప్పుడు కాకుండా ప్లాస్టిక్‌ కవర్లలో నింపి ద్విచక్ర వాహనాల,ఆటోల్లో ఇతర ఏరియాలకు, పట్టణాలకు సరఫరా చేస్తున్నట్లు వినికిడి. కొందరు సారా తయారీనే వృత్తిగా మలుచుకొని పెద్దఎత్తున తయారు చేసి అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. గతంలో గుడుంబా తయారీ పెద్దఎత్తున సాగేది. అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం తయారీకి అడ్డుకట్ట వేయడానికి బెల్లం తయారీని నిషేధించింది. దీంతో సారా తయారీకి అలవాటు పడిన కుటుంబాలకు వివిధ ఉపాధి అవకాశాలు కల్పించారు. అనంతరం వారు సారా తయారీ మానుకునేలా చర్యలు తీసుకున్నారు. అయితే ఇటీవల కాలంలో తిరిగి గుడుంబా గుప్పు మంటోంది. కొందరు తమ కోసం ఇప్పపువ్వుతో మేలి రకం సారా తయారు చేసుకుని తాగుతుండగా మరికొందరు ఇప్పపువ్వుతో పాటు బెల్లం, కుళ్లిన అరటిపండ్లు, ఇతర మత్తు పదార్థాలతో గుడుంబా తయారు చేసి దందా సాగిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. మద్యం ధరలు ఎక్కువగా ఉండడంతో పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన కొందరు మత్తు కోసం సారాకు అలవాటు పడుతున్నట్లు తెలుస్తోంది. దీంతో సారా అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. మద్యం తాగాలంటే వందల రూపాయలు వెచ్చించాల్సి వస్తోంది. క్వాటర్‌ మద్యం కొనాలంటే 100 నుండి 150 పైగానే ఖర్చవుతుందనే ఆలోచనతో తక్కువ ధరలో దొరుకుతున్న గుడుంబా తాగేందుకు మందుబాబులు నాటుసారా వైపు చూస్తున్నారు. గుడుంబాపై ఎక్సైజ్‌శాఖ ప్రత్యేక నిఘా పెట్టలేకపోతుందనే విమర్శలు వస్తున్నాయి. ప్రధానంగా నాటుసారా తయారు చేసే మూలాలపై సంబంధిత శాఖ అధికారులు దృష్టిసారించకపోవడంతో విచ్చలవిడిగా నాటుసారా

RKP

తయారవుతుందనే వాదన వినిపిస్తోంది. సారా అమ్మకాలు ఆగాలంటే తయారీ మూలాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. సారా ఎక్కడ తయారు చేస్తున్నారో గుర్తించి పక్కా వ్యూహంతో దాడులు చేస్తే అసలు నిందితులు దొరికే అవకాశం ఉందని స్థానిక ప్రజలు సంబంధిత అధికారులను కోరుతున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version