రాష్ట్రంలో వ్యవసాయం అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యం
భూపాలపల్లి నేటిధాత్రి
వ్యవసాయం దండగ కాదు పండగ చేస్తూ రైతులకు అండగా నిలబడుతున్నామని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు
శనివారం ఐడిఓసి కార్యాలయ సమావేశపు హాలులో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లాలో 30 వేల ఎకరాలకు భూమి హక్కులు లేక రైతుల ఇబ్బందులు పడుతున్నారని సర్వే నిర్వహించి అర్హులైన ప్రతి ఒక్కరికి భూ హక్కు పట్టాలిస్తామని తెలిపారు. సాదా బైనామా భూములకు కూడా పట్టాలు ఇవ్వనున్నట్లు తెలిపారు. రైతులకు పట్టాలిస్తే రైతు కంట ఆనందం వెల్లివిరుస్తుందని పేదలు దున్నుకునే భూములకు పట్టాలు ఇచ్చేందుకు సీఎం అంగీకరించారని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో వేగం పెంచాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాలు ప్రైవేట్ భవనాల్లో నిర్వహిస్తున్నట్లయితే అటువాటికి శాశ్వత భవనాలు నిర్మాణానికి ప్రతిపాదనలు అందజేయాలని సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గ్రామ, మండల, జిల్లా స్థాయిలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అట్టి కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు. ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండాలన్న లక్ష్యంతో ఆరోగ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ప్రతి ఒక్కరూ వైద్య పరీక్షలు నిర్వహించుకొని వైద్య సేవలు పొందాలని తెలిపారు. వ్యాధులు వచ్చిన తర్వాత మందులు వాడే దానికంటే ముందుగానే ఆరోగ్య పరీక్షలు నిర్వహించుకొని జాగ్రత్త పడటం మంచిదని సూచించారు. జిల్లా ప్రధాన ఆసుపత్రిలో 12 కోట్లతో ఎమ్మారై, 3.40 కోట్లతో సిటీ స్కాన్, 40 లక్షలతో వెంటి లేటర్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 165 రకాల పరీక్షలు చేసే పరికరాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. నూతనంగా క్యాజువాలిటీ నిర్మాణానికి అలాగే 1.90 కోట్లతో డ్రైనేజీ నిర్మాణం చేపట్టనున్నట్లు తెలిపారు. గ్రామాలు మున్సిపాలిటీ అభివృద్ధికి ఆదాయాన్ని సమకూర్చుకొని ప్రజలకు మౌలిక సౌకర్యాలు కల్పన పనులు చేపట్టాలని తెలిపారు. అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. 26 కోట్లతో నర్సింగ్ కళాశాల నిర్మిస్తున్నామని, అలాగే 50 కోట్లతో ఏటీసీ భవనం నిర్మించినట్లు తెలిపారు. రాష్ట్రంలో 600 ఏటిసి కేంద్రాల నిర్మించినట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి 70 వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినట్లు తెలిపారు. జిల్లా కేంద్రంలో జాబ్ మేళా నిర్వహించి 2,700 మందికి ఉపాధి అవకాశాలు కల్పించామని రానున్న రోజుల్లో జాబ్ మేళా నిర్వహించి మరి కొంతమంది నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. జిల్లా కేంద్రంలో సింగరేణి సౌజన్యంతో 36 కోర్సుల్లో వృత్తి నైపుణ్యం శిక్షణ కేంద్రం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జూన్ 12వ తేదీన పాఠశాలలు పున ప్రారంభం రోజున విద్యార్థులకు యూనిఫామ్స్, పుస్తకాలు పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పాఠశాల విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నామని అన్ని సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు 200 శాతం డైట్ చార్జీలు, 40% కాస్మొటిక్ చార్జీలు పెంచినట్లు తెలిపారు. 200 కోట్లతో యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణం పనులు చేపట్టామని, 18 నెలల్లో పూర్తి చేస్తామని తెలిపారు. కొడవటంచ దేవాలయాన్ని మరో యాదగిరిగుట్ట లాగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. భూపాలపల్లి నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఆదర్శ నియోజకవర్గంగా మోడల్ నియోజకవర్గంగా తీర్చి దిద్దేందుకు జిల్లా యంత్రాంగం ప్రజాప్రతినిధులు కలిసికట్టుగా పని చేయాలని ఆయన స్పష్టం చేశారు. పార్టీలు కచ్చితంగా జిల్లాను అభివృద్ధి చేయాలని అభివృద్ధిలో మనందరం పోటీ పడాలని ఆయన స్పష్టం చేశారు.
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం జిల్లాలో దిగ్విజయంగా జరుగుతున్నట్లు తెలిపారు. రాష్ట్రస్థాయి నుండి గ్రామీణ ప్రాంతం వరకు ఈ కార్యక్రమాలు అమలు జరుగుతున్నట్లు తెలిపారు. వార్డు సభ్యులు, సర్పంచులు, కౌన్సిలర్లు, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లకు ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంపై అవగాహన కల్పించామని అన్నారు. చేపట్టిన కార్యక్రమాలను అన్ని శాఖలలో అమలు చేశామన్నారు. ప్రతి గ్రామం, మున్సిపాలిటీల్లో గ్రామసభలు నిర్వహించి శాఖల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలపై దిశా నిర్దేశం చేసి అమలు చేస్తున్నామన్నారు. ముఖ్యంగా హెల్త్ కార్యక్రమాలు నిర్వహించి వైద్య పరీక్షలు చేస్తున్నట్లు తెలిపారు. పోలీస్ రమణా శాఖ ద్వారా అరైవ్ … అలైవ్ కార్యక్రమం నిర్వహించి రోడ్డు భద్రతపై కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. గ్రామస్థాయిలో రోడ్డు సేఫ్టీ కమిటీలు ఏర్పాటు చేశామన్నారు. క్రైమ్ కంటే రహదారి ప్రమాదంలో చాలామంది మరణిస్తున్నారని ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. రానున్న రోజుల్లో జరగనున్న రైతు వారం, సంక్షేమ వారోత్సవాలు, చైల్డ్ సేఫ్టీ, నో డ్రగ్స్, వ్యవసాయం, యువజన సర్వీసులు, విద్య, మహిళలు పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు ఉన్నాయని విజయవంతంగా నిర్వహించాలని తెలిపారు. క్షేత్రస్థాయి వరకు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములు కావాలని, అభివృద్ధి కోసం ఇన్నోవేషన్ ఐడియాలు అమలు చేయాలని తెలిపారు. అనంతరం నేతన్న భద్రత భీమా క్రింద ఇద్దరికి 10 లక్షలు పంపిణీ చేశారు. అలాగే దత్తత సహాయ కేంద్రం హెల్ప్ డెస్క్ ప్రారంభించారు.
ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, ఏఎస్పి నరేష్ కుమార్, ఆర్డిఓ హరికృష్ణ, మున్సిపల్ చైర్మన్ బుర్రా కొమురయ్య, వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, భూపాలపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ కిష్టయ్య , అన్ని శాఖల జిల్లా ధికారులు, తహసీల్దార్లు, ఎంపిడిఓలు, కౌన్సిలర్లు సర్పంచులు తదితరులు పాల్గొన్నారు.
