ఆటో కార్మికుల సంక్షేమాన్ని ప్రభుత్వం పర్యవేక్షించాలి.
శ్రీరాంపూర్: నేటిధాత్రి
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మికులు తీవ్రమైన ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారని, వారి సంక్షేమాన్ని ప్రభుత్వం పర్యవేక్షించాలని బిఎంఎస్ జిల్లా ఆటో యూనియన్ అధ్యక్షుడు చెల్ల విక్రమ్ అన్నారు. శుక్రవారం తెలంగాణ రాష్ట్ర జేఏసీ ప్రణాళిక చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్ ఆదేశాల మేరకు మంచిర్యాల జిల్లా నస్పూర్–శ్రీరాంపూర్ ప్రాంతంలో మే డే సందర్భంగా ఆటో కార్మికుల దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో బిఎంఎస్ జిల్లా ఆటో యూనియన్ అధ్యక్షుడు చెల్ల విక్రమ్ జెండా ఆవిష్కరణ చేపట్టి, కేక్ కట్ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. మహాలక్ష్మి పథకం వల్ల ఆటో కార్మికులు ఉపాధి కోల్పోయి వారి కుటుంబాలు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటో కార్మికులకు సంక్షేమ పథకాలు, భీమా, రుణ సౌకర్యాలు కల్పించాలని, వారి జీవనోపాధిని రక్షించే చర్యలు ప్రభుత్వం తీసుకోవాలని డిమాండ్ చేశారు. 140వ మేడే ఉత్సవాలను పురస్కరించుకొని, ఆటో యూనియన్ ఆధ్వర్యంలో బిఎంఎస్ జిల్లా అధ్యక్షులు చెల్ల విక్రమ్ మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో పొట్ట మధు, పులి రాజేందర్ గౌడ్, కుమ్మరి రాజకుమార్, రొడ్డ సమ్మయ్య, బానోతు రాజు, రాజలింగు, మధు,పలువురు నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.
