జనవరి 11నుంచి హజరత్ మాషూక్-ఎ-రబ్బాని 470వ దర్గా ఉత్సవాలు.
వరంగల్ నేటిధాత్రి.
ఈ నెల 11, 12, 13 తేదీల్లో వరంగల్ నగరంలోని కరీమాబాద్ ప్రాంతంలో ఉన్న హజరత్ మాషూక్-ఎ-రబ్బాని 470వ దర్గా ఉత్సవాలను ఘనంగా నిర్వహించి విజయవంతం చేయాలని దర్గా పీఠాధిపతి నవీద్ బాబా పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాషూక్-ఎ-రబ్బాని దర్గాలో ఉత్సవాల గోడపత్రికను ఆయన ఆవిష్కరించారు. నవీద్ బాబా తెలిపిన ప్రకారం, జనవరి 11వ తేదీ సాయంత్రం 5 గంటలకు దర్గా పీఠాధిపతి నివాసంలో ఫాతిమాతో ఉరుఫ్ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. 12వ తేదీన రాత్రి 9 గంటలకు సందల్ సాని మరియు ప్రత్యేక వేడుకలు నిర్వహించనున్నారు. 13వ తేదీన ఖురాన్ పఠనం అనంతరం హజ్రత్ సయ్యద్ షా హైదర్ ఇల్లాలుద్దీన్ ఖాద్రి జిలానీకి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు దేశం నలుమూలల నుంచే కాకుండా వివిధ దేశాల నుంచి సుమారు 10 లక్షల మంది భక్తులు హాజరవుతారని ఆయన తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా పోలీస్, మున్సిపల్, విద్యుత్ శాఖలతో పాటు జిల్లా అధికారులు సమన్వయంతో అన్ని సహాయక చర్యలు తీసుకుంటున్నారని వెల్లడించారు.
భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని హజరత్ మాషూక్-ఎ-రబ్బాని 470వ దర్గా ఉత్సవాలను విజయవంతం చేయాలని దర్గా పీఠాధిపతి నవీద్ బాబా కోరారు.
