తెలంగాణపై వివక్ష
`యూరియా రాజకీయంపై తెలంగాణ ఎంపీల ఆందోళన
`పార్లమెంట్ ముందు నిరసన ప్రదర్శన
న్యూఢల్లీ,నేటిధాత్రి:
తెలంగాణ రైతాంగం ఎదుర్కొంటున్న యూరియా సమస్యను పరిష్కరించాలంటూ పార్లమెంట్ ఆవరణలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఆందోళనకు దిగారు. వారితోపాటు కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంకగాంధీ నిరసనలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులపై వివక్ష చూపిస్తోందని ఆరోపించారు. తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన యూరియాను సరఫరా చేయకుండా తెలంగాణ రైతాంగాన్ని ఇబ్బంది పెడుతున్నారని ఎంపీలు మండిపడ్డారు. యూరియాను భాజపా పాలిత రాష్ట్రాలకు దారి మళ్లిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది.
యూరియా పంపిణీ విషయంలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతోందని విమర్శించారు కాంగ్రెస్ ఎంపీలు. మంగళవారం పార్లమెంటు ఆవరణలో యూరియా కొరతపై మాట్లాడారు. బీజేపీ పాలిత రాష్ట్రాలకు యూరియా పంపుతూ.. తెలంగాణపై వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు ఎంపీలు మల్లురవి, గడ్డం వంశీకృష్ణ. తెలంగాణపై కేంద్ర వైఖరికి నిరసనగా పార్లమెంటు ఆవరణలో ఆందోళనకు దిగారు
తెలంగాణకు మొత్తం 9 లక్షల టన్నుల యూరియా రావాల్సి ఉండగా 3 నుంచి 4 లక్షల టన్నుల యూరియా మాత్రమే ఇచ్చినట్లు ఎంపీ గడ్డం వంశీకృష్ణ అన్నారు. ఫెర్టిలైజర్స్ పార్లమెంటరీ కమిటీ ఛైర్మన్ క్రితీ ఆజాద్ ను సోమవారం ఎంపీలు అంతా కలిసి ఈ అంశంపై వివరించినట్లు- చెప్పారు. మంగళవారం జీరో అవర్ లో దీనిపై ప్రశ్నించనున్నట్లు చెప్పారు. కూటమి ప్రభుత్వాలున్న రాష్ట్రాలకు యూరియా పంపుతూ.. విపక్ష పార్టీల పాలనలో ఉన్న రాష్ట్రాలపై వివక్ష చూపిస్తున్నట్లు ఆరోపించారు.