న్యూయార్క్‌లో విజయం తరువాత మమ్దానీ ప్రసంగం.. నెహ్రూ మాటల్ని గుర్తు చేస్తూ..
న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో విజయం తరువాత తొలిసారిగా ప్రసంగించిన భారత సంతతి నేత జొహ్రాన్ మమ్దానీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు గట్టి మార్నింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా భారత దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ మాటల్ని కూడా గుర్తు చేసుకున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: న్యూయార్క్ మేయర్ ఎన్నికల్లో ఘన విజయం తరువాత తొలిసారిగా డెమాక్రెటిక్ పార్టీ నేత జొహ్రాన్ మమ్దానీ తన మద్దతుదారులను ఉద్దేశించి తాజాగా ప్రసంగించారు. భారత దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చేసిన ట్రిస్ట్ విత్ డెస్టినీ వ్యాఖ్య తనకు ఈ సందర్భంగా గుర్తొస్తోందని అన్నారు. ఎన్నికల్లో తన విజయం ఓ చారిత్రాత్మక క్షణమని అన్నారు. ఒక శకం ముగిసి.. నవ శకానికి స్వాగతం పలికే ఇలాంటి క్షణాలు చాలా అరుదుగా మాత్రమే వస్తాయని అన్నారు. అణచివేతకు గురైన దేశ ఆత్మ జాగృతమై తన గొంతుక వినిపించిన అద్భుత క్షణం ఇదని కామెంట్ చేశారు. ఈ కొత్త శకంలో న్యూయార్క్ ప్రజలు స్పష్టత, దార్శనికత, ధీరత్వంతో కూడిన నాయకత్వాన్ని చూస్తారని అన్నారు (Zohran Mamdani, Tryst With Desting Nehru Speech).
దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన సందర్భంగా జవహర్లాల్ నెహ్రూ రాజ్యాంగ పరిషత్ వేదికగా ప్రసంగించారు. నాటి అమృత ఘడియలను నెహ్రూ ట్రిస్ట్ విత్ డెస్టినీగా అభివర్ణించారు. ఆ అద్భుతం శకం రాక ముందుగానే నిర్ణయమైందని అన్నారు. నాటి నెహ్రూ మాటలనే నేడు మమ్దానీ మళ్లీ ప్రస్తావించారు.
ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు కూడా మమ్దానీ గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఎలాంటి సంకోచం లేకుండా ట్రంప్ పేరును ప్రస్తావించి మరీ హెచ్చరిక చేశారు. ఈ విజయానికి కారణం న్యూయార్క్‌లోని కొత్త తరం అని అన్నారు. వారి తరపున తామంతా పోరాడతామని హామీ ఇచ్చారు. రాజరిక వ్యవస్థల్ని కూల్చేశామని వ్యాఖ్యానించారు. ‘ట్రంప్.. మీరు ఇదంతా చూస్తున్నారని నాకు తెలుసు. మీకు నేను నాలుగే నాలుగు మాటలు చెప్పదలచుకున్నారు. ఇకపై హోరు మరింత పెరుగుతుంది. మాలో ఏ ఒక్కరిని టచ్ చేయాలన్నా మా అందర్నీ ఎదుర్కోక తప్పదు’ అంటూ గట్టి వార్నింగ్ ఇచ్చారు. అధికార రిపబ్లికన్ పార్టీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నికల్లో డెమాక్రెటిక్ నేత మమ్దానీ గెలిచి..అత్యంత చిన్న వయస్కుడైన మేయర్‌గా చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.
