విబిజి రామ్ జీ చట్ట వ్యతిరేకతపై బీజేపీ మండిపాటు

రామ్’ అనే పేరున్నందుకే ‘వి.బి.జి. రామ్ జీ’ చట్టాన్ని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్- సింగిరెడ్డి కృష్ణారెడ్డి

కరీంనగర్, నేటిధాత్రి:

ఉపాధి హామీ పథకంలో విప్లవాత్మక మార్పులు తెస్తూ, కూలీల సంక్షేమమే ధ్యేయంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘వికసిత భారత్ గ్యారెంటీ (విబిజి) రామ్ జీ – 2025’ చట్టాన్ని కేవలం అందులో ‘రామ్’ అనే పేరున్నందుకే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించడం ఆపార్టీ దివాళాకోరుతనానికి నిదర్శనమని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు సింగిరెడ్డి కృష్ణారెడ్డి మండిపడ్డారు. రామడుగు మండల కేంద్రంలో బీజేపీ వికసిత భారత్ మండల కన్వీనర్ సంటి జితేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన మండల స్థాయి కార్యశాలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఏమంచి పని చేపట్టినా అడ్డుపడటమే కాంగ్రెస్ అలవాటుగా మార్చుకుందని కృష్ణారెడ్డి విమర్శించారు. రాఫెల్ యుద్ధ విమానాలు, ఆర్టికల్ 370 రద్దు, రామమందిర నిర్మాణం, స్వచ్ఛ భారత్, వందే భారత్ రైళ్లు, నూతన న్యాయ సంహిత వంటి చారిత్రాత్మక నిర్ణయాలను వ్యతిరేకించిన కాంగ్రెస్‌ను దేశ ప్రజలు ఇప్పటికే తిరస్కరించారని, కేవలం మూడు రాష్ట్రాలకే పరిమితం చేసినా ఆ పార్టీ తీరు మారలేదని ఎద్దేవా చేశారు. కూలీలకు ఏటా నూట ఇరవైఐదు రోజుల పని కల్పించే చట్టబద్ధమైన గ్యారెంటీ, పనిచేసిన పదిహేను రోజుల్లోపే నేరుగా ఖాతాల్లోకి వేతనాల జమ, దేశవ్యాప్తంగా ఉపాధి హామీ బడ్జెట్‌ను ఎనభై ఆరువేల కోట్ల నుంచి ఒకటిన్నర లక్షల కోట్లకు పెంచడం జరిగిందని, తెలంగాణకు అదనంగా మూడు వందల నలభై ఆరుకోట్ల నిధులను కేటాయించి ఉపాధి కూలీలకు కేంద్రం అండగా నిలబడిందని ఆయన పేర్కొన్నారు.
డిజిటల్ హాజరు ద్వారా అవినీతికి తావులేకుండా అర్హులైన కూలీలకు సరైన వేతనం అందుతుందని
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో 2004 నుంచి 2014 వరకు కేవలం ఒకవేయి ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఉపాధి పనికి కేటాయిస్తే నరేంద్ర మోడీ బిజెపి ప్రభుత్వం 2014 నుంచి 2024 వరకు ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు కేటాయించిందని ఈ విషయాలన్నీ వివరిస్తూ
ఉపాధి హామీ చట్టంపై కాంగ్రెస్ చేస్తున్న దుష్ప్రచారాన్ని బీజేపీ కార్యకర్తలు గ్రామగ్రామాన తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. గ్రామాల అభివృద్ధికి, భూగర్భ జలాల పెంపునకు, మౌలిక వసతుల కల్పనకు ఈచట్టం ఎంతో దోహదపడుతుందని వివరించారు. కూలీల కడుపు కొట్టేలా వ్యవహరిస్తున్న కాంగ్రెస్‌కు రాబోయే రోజుల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈకార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి పోచంపెల్లి నరేష్, మండల ఉపాధ్యక్షులు కాడే నర్సింగం, కళ్లెం శివ, వెంకట్రావుపల్లి ఉపసర్పంచ్ బద్ధం లక్ష్మారెడ్డి, వికసిత భారత్ మండల కో-కన్వీనర్ బండారి శ్రీనివాస్, యువ మోర్చా జిల్లా కార్యవర్గ సభ్యులు ఎడవల్లి రామ్, లక్ష్మణ్, అధికార ప్రతినిధి వంచ మనోజ్, సీనియర్ నాయకులు జిట్టవేని అంజిబాబు, శెవెళ్ల అక్షయ్, దయ్యాల వీరమల్లు, పురంశెట్టి మల్లేశం, గోపు అనంత రెడ్డి, కుమ్మరి అనిల్, బీర్ల అనిల్ మరియు బూత్ కమిటీ అధ్యక్షులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version