మహమ్మదాపురంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమం
దుగ్గొండి, నేటిధాత్రి:
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు” కార్యక్రమంలో భాగంగా దుగ్గొండి మండలం మహమ్మదాపురం గ్రామంలో రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం, వరంగల్ ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది.
శాస్త్రవేత్తలు డాక్టర్ ఓం ప్రకాష్,డాక్టర్ బి.వి. రాజ్ కుమార్, మాట్లాడుతూ, రైతులు తక్కువ యూరియా వాడి సాగు ఖర్చు తగ్గించుకోవాలని, అవసరం మేరకే రసాయనాలను వినియోగించి నేల ఆరోగ్యం కాపాడుకోవాలని సూచించారు. పంట మార్పిడి, సాగు నీటి ఆదా, మార్కెట్లో గిరాకీ ఉన్న వరి రకాల సాగు, సేంద్రియ పద్ధతులతో ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తిపై అవగాహన కల్పించారు. విశ్వవిద్యాలయం నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులు అలవర్చుకుని అధిక దిగుబడులు సాధించాలని కోరారు. వానకాలానికి అనువైన కూనారం 1638, వరంగల్ సిద్ది, ఆర్ఎన్ఆర్ 15048 వరి రకాల గురించి, మొక్కజొన్నలో ఎండు తెగులు తట్టుకునే రకాల గురించి వివరించారు. సేంద్రియ ఎరువుల వాడకంతో నేలలో కర్బన శాతం పెరుగుతుందని, పచ్చిరొట్ట ఎరువులతో యూరియా వాడకం తగ్గించవచ్చని, భూసార పరీక్షల ఆధారంగా ఎరువులు వేయాలని తెలిపారు.కూరగాయలలో తెగుళ్లు, సమగ్ర సస్యరక్షణ చర్యలపై, విశ్వవిద్యాలయ యూట్యూబ్ ఛానల్, వ్యవసాయ మాసపత్రిక, కిసాన్ సారథి సేవలపై వివరించారు.మండల వ్యవసాయ అధికారి జి. శ్యామ్ మాట్లాడుతూ, విశ్వవిద్యాలయం రూపొందించిన కొత్త రకాలను సాగు చేయాలని, శాస్త్రవేత్తల సూచనలు పాటించాలని కోరారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ జి. శ్రీనివాసరెడ్డి, శాస్త్రవేత్తలు ఏఈవో రాజేష్, విద్యార్థులు, గ్రామ రైతులు పాల్గొన్నారు.
