ఏకదంతుడి రూపాలు ఎన్నెన్నో..
మరో నాలుగురోజుల్లో వినాయక చవితి(Vinayaka Chavithi) వేడుకలు జరగనున్నాయి. ఏకదంతుడిని ప్రతిష్ఠించేందుకు ఎన్నెన్నో రూపాలతో అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు కళాకారులు. రాష్ట్రంలో ఈ ఏడాది పీఓపీ గణపతులకు పూర్తిస్థాయిలో చెక్ పెట్టారు.
బెంగళూరు: మరో నాలుగురోజుల్లో వినాయక చవితి(Vinayaka Chavithi) వేడుకలు జరగనున్నాయి. ఏకదంతుడిని ప్రతిష్ఠించేందుకు ఎన్నెన్నో రూపాలతో అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు కళాకారులు. రాష్ట్రంలో ఈ ఏడాది పీఓపీ గణపతులకు పూర్తిస్థాయిలో చెక్ పెట్టారు. పీఓపీ గణపతులు ప్రతిష్ఠించేందుకు అనుమతులు ఇచ్చేది లేదని అధికారులు తేల్చిచెప్పారు. దక్షిణకన్నడ, ఉడుపి జిల్లాల పరిధిలో గడిచిన రెండేళ్లుగా పూర్తిస్థాయిలో మట్టితో తయారు చేసిన గణపతులనే కొలిచారు.
రాష్ట్రంలో వినాయక చవితిని ప్రాంతానికో ప్రత్యేకంగా జరుపుతారు. చిత్రదుర్గలో జరిగే ఉత్సవాలు జాతీయస్థాయిలోనే పేరొందాయి. తుమకూరులో నెలరోజులపాటు వినాయకుడిని ప్రతిష్ఠ చేసి పూజలు చేసే సంప్రదాయం ఉంది. బెళగావి(Belagavi)లో జరిగే ఉత్సవాలు మహారాష్ట్ర(Maharashtra) సంప్రదాయాలతో కొనసాగుతాయి. బెంగళూరులో వినాయక ప్రతిష్ఠ మరింత ప్రత్యేకంగా ఉంటుంది. సాధారణంగా దేశమంతటా చవితిరోజున వినాయకుడిని ప్రతిష్ఠించి మూడు, ఐదు, ఏడు, తొమ్మిది, పదకొండు రోజులకు నిమజ్జనం చేస్తారు.
కానీ బెంగళూరులో ప్రాంతాలవారీగా మూడు రోజులపాటు ప్రతిష్ఠించి పూజలు చేసే సంప్రదాయం నెలన్నరపాటు కొనసాగుతుంది. కాగా బసవనగుడిలో జరిగే బెంగళూరు గణేశ ఉత్సవ్‌లో నిర్వహించే సంగీత కార్యక్రమాలు జాతీయస్థాయిలోనే పేరొందాయి. దక్షిణాది, బాలీవుడ్ ప్రముఖ గాయకులు పాల్గొంటారు. వీరు 11రోజులపాటు ఉత్సవాలు జరుపుతారు. వినాయక విగ్రహాలను నగరంలోని ఆర్వీ రోడ్డుతోపాటు పలు చోట్ల విక్రయిస్తారు. ఆర్వీ రోడ్డులో గణేశ విగ్రహాల విక్రయాలు ఐదు దశాబ్దాలకుపైగా పేరొందాయి.