10వ తరగతి పరీక్ష కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని జంగేడు ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న పదో తరగతి వార్షిక పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ సక్రమంగా జరుగుతున్న తీరు, పరీక్షా కేంద్రంలో ఉన్న సౌకర్యాలను ఆయన పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ పరీక్షా హాళ్లను సందర్శించి, విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయడానికి అవసరమైన ఏర్పాట్లును అధికారులను అడిగి తెలుసుకున్నారు. తాగునీరు, విద్యుత్, పరిశుభ్రత, భద్రత వంటి మౌలిక సదుపాయాలు సమృద్ధిగా ఉండేలా చూడాలని సంబంధిత అధికారులకు సూచించారు.
పరీక్షలు పారదర్శకంగా, ఎటువంటి అవకతవకలు లేకుండా నిర్వహించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఆయన పేర్కొన్నారు. విద్యార్థులు ఒత్తిడికిలోను కాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని సూచించారు.
ఈ తనిఖీలో విద్యాశాఖ అధికారి రాజేందర్, పరీక్షా కేంద్రాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
