విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ శాపం…..*
◆-: రైతు జీవితాన్ని కాల్చేసిన నిర్లక్ష్యం!
వరుస ప్రమాదాలతో కుప్పకూలిన పేద రైతు కుటుంబం – స్పందించని అధికారులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
విద్యుత్ శాఖ నిర్లక్ష్యం మరో పేద రైతు జీవితాన్ని అగ్నికి ఆహుతి చేసింది. సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం పొట్టేపల్లి గ్రామానికి చెందిన బేగరి రాములు–సత్యమ్మ దంపతుల పొలంలో ఉన్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ శాపంగా మారింది. ఎంతో ఆశతో సాగు చేసిన ఎకరం 38 గుంటల చెరకు పంట కళ్లముందే కాలిపోగా, రైతు కుటుంబం అక్షరాలా రోడ్డున పడింది.
పంటతో పాటు పొలంలో ఏర్పాటు చేసిన డ్రిప్ పైప్‌లైన్ పూర్తిగా దగ్ధమవడంతో సుమారు రూ.2 లక్షలకు పైగా నష్టం వాటిల్లిందని బాధిత రైతు కన్నీళ్లతో వాపోతున్నాడు. చేతికి వచ్చే దశలో ఉన్న పంట బూడిదైపోవడంతో ఆ కుటుంబ భవిష్యత్తే అంధకారంగా మారిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మూడుసార్లు అగ్నిప్రమాదాలు.. అయినా మారని అధికారుల వైఖరి
ఝరాసంగం మండలం సర్వే నంబర్ 121లోని తమ భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న రాములు దంపతుల పొలంలో ఉన్న ఈ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ గతంలోనే మూడుసార్లు అగ్నిప్రమాదాలకు కారణమైంది. అధికారులకు పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ, సమస్య పరిష్కారంపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.
⚠️ ప్రాణాలకే ముప్పు.. విద్యుత్ షాక్‌తో తప్పిన ప్రమాదం
పంట నష్టమే కాకుండా, ఇదే ట్రాన్స్‌ఫార్మర్ కారణంగా గతంలో పొలంలో పని చేస్తున్న సమయంలో రాములు విద్యుత్ షాక్‌కు గురై ప్రాణాపాయ స్థితిలో చిక్కుకున్నాడు. అదృష్టవశాత్తు ప్రాణాలతో బయటపడినప్పటికీ, అప్పటి నుంచి ఆ కుటుంబం భయభ్రాంతుల్లోనే జీవిస్తోంది. ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది.
రైతు డిమాండ్లు
తక్షణ పరిహారం: కాలిపోయిన చెరకు పంటకు, డ్రిప్ పైప్‌లైన్‌కు వెంటనే ఆర్థిక సహాయం అందించాలి
ట్రాన్స్‌ఫార్మర్ తరలింపు: ప్రమాదాలకు కేంద్రంగా మారిన ఈ ట్రాన్స్‌ఫార్మర్‌ను వెంటనే సురక్షిత ప్రాంతానికి మార్చాలి
తమ గోడును జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి, మానవతా దృక్పథంతో స్పందించి న్యాయం చేయాలని ఆ పేద రైతు వేడుకుంటున్నాడు. ఇప్పటికైనా అధికారులు స్పందించకపోతే, మరో రైతు ప్రాణం… మరో కుటుంబ భవిష్యత్తు ప్రమాదంలో పడటం తథ్యమని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
