మళ్ళీ మ్యాజిక్
‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ జోడీ
టాలీవుడ్ వెండితెరపై కొన్ని కాంబినేషన్లు ఎప్పటికీ క్లాసిక్స్‌గా నిలిచిపోతాయి. అలాంటి వాటిలో సిద్ధార్థ్ , త్రిషల జోడీ ఒకటి. దాదాపు రెండు దశాబ్దాల క్రితం ‘ నువ్వొస్తానంటే నేనొద్దంటానా ‘ చిత్రంతో ప్రేక్షకులను మాయ చేసిన ఈ జంట ఇప్పుడు మరోసారి వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్టును టాలీవుడ్ అగ్ర నిర్మాత దిల్ రాజు తన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై పట్టాలెక్కించేందుకు సన్నాహాలు చేస్తున్నారన్న వార్త ఇప్పుడు ఫిల్మ్ నగర్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ కొత్త సినిమా కోసం దిల్ రాజు ఒక ప్రతిభావంతుడైన కొత్త దర్శకుడిని రంగంలోకి దించబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రం ప్రధానంగా విదేశీ నేపథ్యంలో సాగే ఒక అందమైన ప్రేమకథగా ఉండబోతుందని, ఇందులో సిద్ధార్థ్-త్రిషలతో పాటు మరో యువ జంట కూడా కనిపిస్తారని టాక్ వినిపిస్తోంది. వింటేజ్ యూత్‌కు ఈ జోడీని మళ్ళీ చూడటం ఒక పెద్ద సర్ప్రైజ్ కానుంది.
ప్రస్తుతం హీరో సిద్ధార్థ్ సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక దిల్ రాజుతో సిద్దు చేసిన బొమ్మరిల్లు ఎంతటి ఘన విజయం సాధించింది ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కాబట్టి, దిల్ రాజు మళ్లీ సిద్ధార్థ్‌కు ఒక సాలిడ్ కంబ్యాక్ ఇవ్వాలని పక్కా ప్రణాళికతో ఉన్నారు.
మరోవైపు త్రిష సినిమాలకు స్వస్తి పలుకుతున్నారనే పుకార్లు వైరల్ అవుతున్న వేల ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళంలో కూడా ఏకకాలంలో నిర్మిస్తారా లేదా డబ్బింగ్ చేస్తారా అనేది త్వరలోనే తెలియనుంది.
