ప్రభుత్వ పాఠశాల ఘటనపై బిజెపి ఆందోళన
ప్రిన్సిపల్ తో పాటు ఉపాధ్యాయులు,అటెండర్ ను సస్పెండ్ చేయాలి
ధర్నాలో మద్దతు పలికిన మాజీ ఎమ్మెల్యే రవిశంకర్
గంగాధర నేటిధాత్రి :
గంగాధర మండలంలోని కురిక్యాల ప్రభుత్వ పాఠశాలలో చోటుచేసుకున్న బాలికల బాత్రూమ్లో కెమెరా వ్యవహారం పెద్ద సంచలనంగా మారింది. ఈఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన బీజేపీ నాయకులు గంగాధరలోని మధురానగర్ చౌరస్తాలో ధర్నా నిర్వహించారు. ఆఘటనకు బాధ్యుడైన అటెండర్ను తక్షణమే సస్పెండ్ చేయడంతో పాటు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఇతర ఉపాధ్యాయులను కూడా సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. చిన్నారుల భద్రత విషయంలో నిర్లక్ష్యం ప్రదర్శించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు గళమెత్తారు. ధర్నాకు మద్దతుగా చొప్పదండి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సంఖ్య రావి శంకర్ మాట్లాడుతూ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని, పాఠశాలల్లో విద్యార్థినుల భద్రతకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని ఆయన మీడియాతో తెలిపారు. ఈధర్నా కారణంగా గంగాధర ప్రధాన రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పోలీసులు అక్కడికి చేరుకొని బీజేపీ నాయకులతో చర్చించారు. చివరికి పోలీసులు సర్ది చెప్పి ధర్నాను విరమింపచేశారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు ఈఘటన పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
