రేపే కేంద్ర బడ్జెట్.. ఎప్పుడు.. ఎక్కడ వీక్షించాలి.. ఏమిటా ప్రత్యేకతలు?
ఏప్రిల్ 1 నుంచి మొదలయ్యే ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్ర బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న ఉదయం 11 గంటలకు పార్లమెంట్లో సమర్పిస్తారు. ఇంతకు ముందు ఎప్పుడూ లేని విధంగా ఆదివారం రోజున బడ్జెట్ సమర్పణ జరుగుతుండటం గమనార్హం.
దేశ ఆర్థిక వ్యవస్థను నిర్ణయించే యూనియన్ బడ్జెట్ 2026-27ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రేపు (ఫిబ్రవరి 1) పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ఇది.. ఒక మహిళా ఆర్థిక మంత్రి వరుసగా ఒకే ప్రధాని నేతృత్వంలో సమర్పించనున్న తొమ్మిదవ కేంద్ర బడ్జెట్ కావడం విశేషం. ఈ బడ్జెట్‌పై దేశవ్యాప్తంగా ప్రజలు, వ్యాపార వర్గాలు, మధ్య తరగతి వేతనదారుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అంతేకాకుండా.. ఆదివారం రోజున బడ్జెట్ ప్రవేశపెట్టడం అరుదైన విషయం కావడంతో ఈ బడ్జెట్‌పై ప్రత్యేక ఆసక్తి నెలకొంది.
‘వికసిత్ భారత్ @2047’ లక్ష్యాన్ని ముందుంచుకుని ఆర్థిక సంస్కరణలు, కస్టమ్స్ డ్యూటీ మార్పులు, రుణ తగ్గింపు, మౌలిక సదుపాయాలు, సామాజిక సంక్షేమం వంటి అంశాలపై ఈ బడ్జెట్లో మరింత దృష్టి సారించే అవకాశం ఉంది. ఆదాయపు పన్ను రాయితీలు, రక్షణ, వ్యవసాయం, ఆర్థిక వృద్ధి వంటి రంగాల్లో ప్రజలు, వ్యాపారవేత్తలు ఆశలు పెట్టుకున్నార
భారత రాజ్యాంగం ఆర్టికల్ 112 ప్రకారం.. ఏటా ఉభయ సభల ముందూ సమర్పించే ఈ ఆర్థిక ప్రకటనలో రాబోయే ఆర్థిక సంవత్సరానికి ఆదాయాలు, ఖర్చుల అంచనాలు, పన్ను ప్రతిపాదనలు, వ్యయ ప్రాధాన్యాలు, సంస్కరణలు, అభివృద్ధి చర్యలు వివరిస్తారు. కేంద్ర బడ్జెట్.. భారత ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమైంది. ప్రజలు, వ్యాపార సంఘాలు, మార్కెట్లు దీనిపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. కేంద్ర మంత్రి ప్రసంగం తర్వాత వివిధ రంగాల్లో ప్రతిస్పందనలు, స్టాక్ మార్కెట్ రియాక్షన్స్ ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. అనంతరం బడ్జెట్ మీద విశ్లేషణలు, వ్యాఖ్యానాలు వ్యక్తమవుతాయి.
