నేలపై కూర్చుని విద్యార్థులతో ముచ్చటించిన రామ్మోహన్ నాయుడు
రూ. 99 లక్షలతో 5 అదనపు తరగతి గదులు నిర్మించామని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. పిల్లల మైండ్ అభివృద్ధి చెందాలంటే అందరూ ఆటలు ఆడాలని కేంద్రమంత్రి అన్నారు.
శ్రీకాకుళం, నవంబర్ 5: జిల్లాలో కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు (Union Minister Rammohan Naidu) పర్యటన కొనసాగుతోంది. ఈరోజు (బుధవారం) శ్రీకాకుళం పట్టణంలో ఉమెన్స్ కళాశాలలో అదనపు భవనాల ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గొండు శంకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి మాట్లాడుతూ.. శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా కళాశాలలో తన తల్లి కూడా చదివారని తెలిపారు. స్టేట్‌లో అధికంగా ఈ మహిళా కళాశాలలో విద్యార్థులు చదువుతున్నారని అన్నారు. రూ. 99 లక్షలతో 5 అదనపు తరగతి గదులు నిర్మించామని తెలిపారు. పిల్లల మైండ్ అభివృద్ధి చెందాలంటే అందరూ ఆటలు ఆడాలని కేంద్రమంత్రి అన్నారు.
కళాశాల అభివృద్ధికి అన్ని విధాలుగా సహాయసహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. పిల్లల నుంచి కోరుకునేది ఒక్కటే అని.. యూత్ అంతా రాణించాలని ఆకాంక్షించారు. పిల్లలంతా పెద్ద పెద్ద లక్ష్యంతో ముందుకు వెళ్లాలని అన్నారు. పిల్లలంతా చదువు సమయంలో చదువు పైనే దృష్టి పెట్టాలని సూచించారు. వేదిక ఎదురుగా విద్యార్థులతో కలిసి నేలపైన కూర్చుని మరీ కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ముచ్చటించారు. అనంతరం కల్లేపల్లి గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కేంద్రమంత్రి ప్రారంభించారు. కోతకు గురైన పెద్ద గనగళ్లవానిపేట వద్ద సముద్ర తీరాన్ని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పరిశీలించారు.
