గాంధీభవన్ లోనే ఫిరాయింపు ఎమ్మెల్యేల సంసారం
జిల్లా కాంగ్రెస్ ఆఫీసుల్లో మీటింగులు… వాళ్లే బి.ఫాంలు పంచుతున్నారు
స్పీకర్ గారు… అయినా మీ కళ్లకు కన్పించడం లేదా?
స్పీకర్ పదవికి మచ్చ తేవడం న్యాయమేనా?
ప్రజలారా…ఓట్ల కోసం వచ్చే ఫిరాయింపు ఎమ్మెల్యేలను నిలదీయండి
వాళ్లు ఏ పార్టీలో ఉన్నారు…ఎందుకు ఓటేయాలని అడగండి
మాకు భయపడి కేటీఆర్ సిరిసిల్లలోనే అడ్డాపెట్టి ఓటుకు రూ.10 వేలు ఇస్తున్నారట
కేటీఆర్…నా జోలికొస్తే నీ బతుకును రోడ్డుకీడుస్తా
నీ అరాచకాలు, నువ్వు చేసిన నీచ పనులన్నీ బయటపెడతా
కేంద్రం నిధులిస్తే…ఆ నిధులను మింగి సిరిసిల్లను వరదల్లో ముంచుతున్నరు
రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో సిరిసిల్లకు నయాపైసా ఇయ్యలే
కాంగ్రెస్ వద్ద నయాపైసా లేదు… వాళ్లకు ఎందుకు ఓటేయాలి?
అందుకే 6 గ్యారంటీలను అమలు చేయలేకపోతున్నారు
మళ్లీ ఓట్ల కోసం మోసపూరిత హామీలతో మీ ముందుకొస్తున్నారు
కాంగ్రెస్ దొంగ హామీలను నమ్మి మోసపోతే 5 ఏళ్ల అరిగోస తప్పదు
సిరిసిల్ల ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ లపై నిప్పులు చెరిగిన కేంద్ర మంత్రి బండి సంజయ్
భారీ ఎత్తున తరలివచ్చిన జనం… కార్యకర్తల జోష్ తో సిరిసిల్లలో ఎన్నికల సందడి
సిరిసిల్ల(నేటి ధాత్రి):
ఫిరాయింపుల విషయంలో కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యభిచారం చేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. ఆయా ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినట్లు ఆధారాల్లేవంటూ శాసనసభ స్పీకర్ తీర్పు ఇవ్వడం దుర్మార్గమని అన్నారు. ‘‘స్పీకర్ సార్…మీరు నిజాయితీ పరులు. మీపై కాంగ్రెస్ ఒత్తిడి తెస్తోంది. ఎందుకంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలు గాంధీభవన్ లోనే సంసారం చేస్తున్నరు. జిల్లా కాంగ్రెస్ ఆఫీసుల్లో మీటింగ్ లు పెడతారు. వాళ్ల చేతికే బి.ఫాంలు ఇస్తరు. కళ్ల ముందే ఇవన్నీ కన్పిస్తున్నా పార్టీ మారినట్లు ఆధారాల్లేవని కేసు కొట్టివేయడం దారుణం.’’అని విమర్శించారు. ఇలాంటి తీర్పులతో ప్రజాస్వామ్యం అపహాస్యమవుతోందన్నారు. రాజ్యాంగబద్దమైన స్పీకర్ పదవిపై మచ్చ పడి చరిత్ర హీనులు కావొద్దని కోరారు. ఈ సందర్భంగా ఫిరాయింపు ఎమ్మెల్యేలున్న నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి ‘‘మీ నియోజకవర్గంలో ఓట్ల కోసం వస్తున్న మీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో అడగండి. ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేయాలి? ఏ అభ్యర్ధిని గెలిపించాలని నిలదీయండి. ఒక పార్టీ నుండి గెలిచి ఇంకో పార్టీ కండువా కప్పుకుని గెలుపు కోసం ఎందుకు పనిచేస్తున్నారో అడుగడుగునా నిలదీయండి’’’అని పిలుపునిచ్చారు.
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సిరిసిల్ల కు విచ్చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అంబేద్కర్ సర్కిల్ వద్ద నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి, రాష్ట్ర అధికార ప్రతినిధి జె. సంగప్పతోపాటు పార్టీ జిల్లా నేతలు, బీజేపీ పక్షాన పోటీ చేస్తున్న అభ్యర్థులంతా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడికి తరలి వచ్చిన వేలాది మంది ప్రజలను ఉద్దేశించి బండి సంజయ్ ప్రసంగించారు. ఏమన్నారంటే….
మాకు భయపడి కేసీఆర్ కొడుకు సిరిసిల్లలోనే అడ్డాపెట్టి ఓటుకు రూ.10 వేలు ఇస్తున్నడట. ఆ డబ్బులు మనవే. తీసుకోండి. ఓట్లు మాత్రం పువ్వు గుర్తుకు వేసి బీజేపీకి మున్సిపల్ ఛైర్మన్ పీఠాన్ని అప్పగించండి.
మొన్నటిదాకా సిరిసిల్ల మున్సిపల్ పీఠాన్ని బీఆర్ఎస్ కు అప్పగిస్తే… ఏం జరిగింది? వానొస్తే గల్లీలన్నీ మునిగిపోతున్నయ్. ఆఖరికి జిల్లా కలెక్టరేట్ కూడా మునిగిపాయే. పడవల్లో, ట్రాక్టర్లలో పోవాల్సిన దుస్థితి.
మురికి నీటి శుద్ధి ప్లాంట్ పేరిట పద్మనగర్లో ఎస్ టి పి ప్లాంట్ నిర్మిస్తే ఏమైంది? మురికి కాలువ నీళ్లన్నీ ఊళ్లకు వస్తున్నయ్. తలకాయ ఉన్నోడు ఎవడైనా అట్ల చేస్తరా?
వస్త్ర పరిశ్రమ మొత్తం సిరిసిల్లలో ఉంటే… నూలు (యారన్) డిపోను వేములవాడలో పెడతారా ఎవరైనా? డిపో ఈడ పెడితే వాళ్ల కమీషన్లన్నీ తెలుస్తదని ఆడ పెట్టిర్రు. ప్రతి కిలో పై కాంగ్రెస్ నేతలు కమిషన్లు దొబ్బుతున్నారు.
కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో సిరిసిల్లలో ఒక్కటంటే అభివృద్ధి కార్యక్రమం కూడా చేయలేదు. సిమెంట్ రోడ్లు, మురికి కాలువలు లాంటి మౌలిక వసతులు కల్పనలో కాంగ్రెస్ విఫలమైంది.
సుందరీ కరణ పేరిట సిరిసిల్ల కొత్త చెరువును కూడిక చేయకుండా, మధ్యలో ఐలాండ్ నిర్మించి దాని నీటిలో సామర్థ్యాన్ని గత బీఆర్ ఎస్ ప్రభుత్వం తగ్గించింది. కొత్తచెరువు నీళ్లు కొద్దిపాటి వర్షానికి ఊర్లోకి వస్తున్నాయి. ఇదంతా బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్వాకమే.
ఇక టెక్స్టైల్ పార్క్ పరిస్థితి దారుణంగా ఉంది. పరిశ్రమలు మూతపడ్డాయి. 220 యూనిట్లు నడవాల్సి ఉంటే ఇప్పుడు, పది షెడ్లలో పని ఉంది. 200 షెడ్లు మూతపడ్డాయి. నేత కార్మికులకు ఉపాధి కల్పించడంలో రెండు ప్రభుత్వాలు విఫలమయ్యాయి.
సిరిసిల్ల పట్టణంలో రఘుడు, చందంపేట, ముష్టి పెళ్లి, చిన్న బోనాల, పెద్ద బోనాల, పెద్దూరు, సర్దాపూర్ వంటి ఏడు శివారు గ్రామాలను బలవంతంగా సిరిసిల్లలో కలిపి, అక్కడి ప్రజలకు ఉపాధి హామీ లేకుండా బిఆర్ఎస్ ప్రభుత్వం చేసింది.
ఈ ఏడు గ్రామాలను సిరిసిల్ల మున్సిపాలిటీలో విలీనం నుంచి తప్పించి మళ్లీ గ్రామ పంచాయతీలుగా చేస్తామని కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చిన విస్మరించారు. పదేళ్లలో విలీన గ్రామాల్లో మురికినీటి సమస్య రోడ్ల సమస్య ఎప్పటిలాగే ఉంది. పైపెచ్చు ఇంటి పన్నులు ఇతర ట్యాక్స్ లు పెంచారు.
జిల్లా కేంద్రమైన సిరిసిల్ల పాత బస్టాండ్లో పార్కింగ్ స్థలం లేదు. సిరిసిల్లలో ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. మున్సిపల్ లో కౌన్సిలర్ల అవినీతి కాంట్రాక్టర్ల అక్రమాలతో గత పాలన అవినీతిమ ఏమైంది.
మరి బీజేపీ ఏం చేసిందని ఓటేయాలని మాట్లాడుతున్న వాళ్లకు నేను చెప్పే సమాధానమొక్కటే…
ఇప్పటి వరకు 14, 15వ ఆర్ధిక సంఘం ద్వారా ప్రతి ఒక్కరికి దాదాపు 29 కోట్లు ఇచ్చినం. అమ్రుత్ పథకం ద్వారా రూ.50 కోట్లు ఇచ్చినం. మేం ఇంత పెద్ద ఎత్తున పైసలిస్తే… సక్రమంగా వినియోగించకుండా డబ్బులన్నీ వ్రుధా చేస్తున్నరు. కమీషన్లు సంపుకుంటున్నరు. పైప్ లైన్ పనులన్నీ ఎక్కడికక్కడ ఆగిపోయినయ్.
ప్రధానమంత్రి స్వనిధి ద్వారా ఈ సిరిసిల్ల పట్టణంలోని 11 వేల 737 మందికి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేందుకు 21 కోట్ల 52 లక్షలు ఇచ్చినం. స్వచ్ఛ భారత్ ద్వారా ఈ మున్సిపాలిటీకి రూ.44 లక్షలు ఇచ్చినం. సిరిసిల్లకు వరదల లెక్క కేంద్రం నిధులు తీసుకొస్తే…సిరిసిల్లను వరదల్లో ముంచుతున్నరు. ఇదిగో బుక్ లెట్… ఇంటింటికీ పంపిస్తున్నా..చదువుకోండి. బీజేపీ రాష్ట్రంలో, ఈ మున్సిపాలిటీలో అధికారం లేకపోయినా కేంద్రం నుండి మోదీగారిని ఒప్పించి నిధులు తీసుకొచ్చిన.
మేం అభివ్రుద్ధి మాట్లాడుతున్నం. నా కోసం ఇక్కడి కార్యకర్తలు కష్టపడి పనిచేస్తున్నరు. మీ ఇంటింటికీ తిరిగి ఓట్లు అడుగుతున్నరు. వాళ్ల కోసమే నేను వచ్చిన. పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుతున్నా.
మోదీ ప్రభుత్వం 2 లక్షల ఇండ్లకు పైసలిస్తే ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం సిరిసిల్లలో ఒక్కరికి ఇల్లు ఇయ్యలే. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇయ్యాలని చెబితే నాపై కేసు పెట్టి జైలుకు పంపారు. ఇదేందని అడిగిన బీజేపీ కార్యకర్తలను కొట్టి జైలుకు పంపిర్రు.
నేను కేసీఆర్ కొడుకు లెక్క అయ్య పేరు చెప్పుకుని రాజకీయాల్లోకి రాలేదు. కార్యకర్తగా కష్టపడి మీకోసం లాఠీదెబ్బలు తిన్న. జైలుకు పోయిన.
మరి నువ్వేం(కేటీఆర్) చేసినవ్. మా కార్యకర్తలను కొట్టి జైలుకు పంపుతవా? బిడ్డా.. నీ సంగతి చూస్తా.. మళ్లీ నువ్వు ఇక్కడికి వచ్చి ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే నీ బండారం అంతా బయటపెడతా. ప్రజలు నీ కంటే నాకు ఎక్కువ ఓట్లేసి గెలిపించారు. 2.26 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిపించారు. మొన్న వానలొచ్చి పేదలు మునిగిపోతే వాళ్లను కాపాడే సోయి కేటీఆర్ కు ఉందా? నేను హెలికాప్టర్ తీసుకొచ్చి ముంపు బాధితులను కాపాడిన. నేను కేంద్రం నుండి నిధులు తెచ్చి ప్రజల కోసం కష్టపడుతుంటే…. కేటీఆర్ మాత్రం ఆ నిధులను దారి మళ్లించి కమీషన్లు దొబ్బితిన్నవ్.
బీఆర్ఎస్ కార్యకర్తలారా… మీ కష్టాలను బీఆర్ఎస్ పట్టించుకోదు. ఎన్నికల్లో మిమ్ములను ఆదుకునే పరిస్థితి లేదు. కష్టమొస్తే ఆదుకునేది బీజేపీయే. నేను అండగా ఉంటా. బీజేపీలోకి రండి.
ఇగ కాంగ్రెస్ ను అడుగుతున్నా… ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేశారా? మహిళలకు రూ.2500, తులం బంగారం, స్కూటీ ఇచ్చారా? అవ్వాతాతలకు రూ.4 వేల పెన్షన్ ఇచ్చారా?
అసలు ఇవ్వడానికి కాంగ్రెస్ దగ్గర పైసలున్నయా? నన్ను కోసినా నయాపైసా ప్రభుత్వం వద్ద లేదని సీఎం రేవంత్ రెడ్డే చెప్పిండు. మరి యాడ నుండి తీసుకొచ్చి అభివ్రుద్ది చేస్తరు? నిధులు ఇచ్చేది కేంద్రం… తెచ్చేది నేనే. మీరు సిరిసిల్ల మున్సిపాలిటీని బీజేపీకి అప్పగిస్తే… పెద్ద ఎత్తున నిధులిస్తానని మోదీ భరోసా ఇచ్చారు. ఆయన మాటగా చెబుతున్నా… మేయర్ పీఠాన్ని మాకు అప్పగించండి.
లేనిపక్షంలో కేంద్రం ఇచ్చిన నిధులను దారి మళ్లిస్తరు. పైసలు మావి…ప్రగతి మాది… సోకులు వాళ్లవి…కమీషన్లు వాళ్లవి… మళ్లీ అట్లాంటోళ్లకు మళ్లీ ఓట్లేస్తారా? ఆలోచిస్తారా?
కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో రాజకీయ వ్యభిచారం చేస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గాంధీభవన్ లో సంసారం చేస్తున్నారు. జిల్లా కాంగ్రెస్ ఆఫీసుల్లో సంసారం చేస్తున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలతో మీటింగ్ లు పెడుతున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకే కాంగ్రెస్ బి.ఫాంలు ఇస్తున్నారు. వాళ్లే టిక్కెట్లు ఇస్తున్నారు.. ఇయాళ ఫిరాయింపులు స్పీకర్ గారు ఫిరాయింపు కేసును కొట్టివేయడం దుర్మార్గం. స్పీకర్ సార్… మీరు నిజాయితీపరులు. మీరున్నది రాజ్యాంగ పదవిలో. ప్రజాస్వామ్యాన్ని కాపాడే పదవిలో.. కానీ మీపై కాంగ్రెస్ ఒత్తిడి తెస్తోంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు ఆధారాల్లేవని ఫిరాయింపుల కేసును కొట్టివేయడం తగదు. మీపై మచ్చ పడుతుంది. చరిత్రలో మసక బారి పోతారు. మీ తీర్పును చూసి జనం నవ్వుకుంటున్నారు.
ప్రజాలారా…. ఫిరాయింపు ఎమ్మెల్యేలు మీ వద్దకొస్తే నిలదీయండి. మీరు ఏ పార్టీ తరపున వచ్చారు? ఏ పార్టీని గెలిపించాలి? ఏ పార్టీ అభ్యర్ధికి ఓటేయాలి? అనే నిలదీయండి.
బీజేపీ మీ మాదిరిగా రాజకీయ వ్యభిచారం చేయదు. ప్రజాస్వామ్య స్పూర్తితో పనిచేస్తోంది. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు మా వద్దకు రావాలంటే రాజీనామా చేయాల్సిందే. ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేశాకే బీజేపీలోకి తీసుకున్నామనే విషయాన్ని గుర్తుంచుకోండి.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నీచ రాజకీయాలకు బుద్ది చెప్పండి. వాళ్ల అవినీతి, అక్రమాలకు చెంపపెట్టుగా తీర్పు ఇవ్వండి. బీజేపీ అభ్యర్థుల దగ్గర పైసల్లేకపోవచ్చు. కానీ మీ కోసం కొట్లాడే దమ్ముంది? పైసలు రప్పించే తెగువ ఉంది? మేం మీ ప్రగతి గురించి, మీ బాగోగుల గురించి ఆలోచిస్తున్నారు. వాళ్లు అవినీతి, కమీషన్ల కోసం ఆలోచిస్తున్నారు. అందుకే ఆలోచించి ఓటేయండి. కమలం పువ్వు గుర్తుకు ఓటేసి సిరిసిల్ల మున్సిపాలిటీని బీజేపీకి అప్పగించాలని కోరుతున్నా…
