వెండికీ… ఒక రోజు రానే వచ్చింది…
బంగారం బంగారమే! కాదనలేం. కానీ, వెండికీ పెద్ద చరిత్రే ఉంది. ప్రపంచవ్యాప్తంగా అనేక మానవ సంస్కృతులతో ఈ లోహ బంధం విడదీయలేనంతగా పెనవేసుకుంది. తవ్వేకొద్దీ వెండి చరిత్ర బయల్పడుతూనే ఉంది. మానవ నాగరికతలో వేల ఏళ్ల నుంచీ ఆభరణాలు, నాణేలు, దేవతామూర్తుల రూపంలో వెండి మన ఆత్మీయలోహంగా మారిపోయింది.
ప్రతి మనిషికీ ఒక రోజు వస్తుంది అన్నట్లే వెండికీ ఒక రోజు రానే వచ్చింది. ఏళ్ల తరబడి జంటగా ప్రయాణించిన పసిడి, వెండి పరుగులో పుత్తడి ముందుకెళ్లింది. వెండిని వెనకేశానని మురిసిపోయింది. కొన్నాళ్లు సైలెంట్‌గా ఉన్న సిల్వర్.. సిక్స్‌ప్యాక్ మెటల్‌లా శక్తిమంతమై.. గోల్డును సైతం బోల్డ్ చేసింది. పద్నాలుగేళ్లలో ఏకంగా 188 శాతం పెరిగి… సంచలనం సృష్టించింది. ఇప్పుడు వెండి.. శ్వేత బంగారం!! నేలమాలిగల్లో దాగున్న ఆ లోహపు అపురూప చరిత్రను తవ్వి తీస్తే ఎన్నో ఆసక్తికర విశేషాలు. అవే.. ఈ వారం కవర్‌స్టోరీ.
